రాబందులకో రెస్టారెంట్..
ముంబై: మనుషులకే కాదు రాబందులకు కూడా రెస్టారెంట్లుంటాయి.. అంతే కాదు మన రెస్టారెంట్ల మెనూలాగే వాటికి కూడా ఓ ప్రత్యేక మెనూ ఉంటుంది. అవును మీరు చదువుతున్నది నిజమే.. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా పన్సాడ్ పక్షుల సంరక్షణ కేంద్రంలో రెండెకరాల విస్తీర్ణంలో రాబందుల రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. హానికర రసాయనం డైక్లోఫినాక్ ఇచ్చిన జంతు మృతకళేబరాలను తినడం వల్ల తరచూ రాబందులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రాబందులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేరాయి.
అందుకే పరీక్షించిన జంతువుల మృతకళేబరాలను ఈ రెస్టారెంట్‌లో మెనూగా పెట్టారు. అక్కడ రాబందులు తమకు కావలసిన ఆహారాన్ని స్వేచ్ఛగా తినొచ్చు. ఒకవేళ రాబందులు మృతకళేబరాలను తినకుంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఆ వ్యర్థాలు భూమిలో చేరి వాటి ద్వారా నీరు, ఆహారం కలుషితమై అతిసార వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.