![Rare Black Vulture Identified in Chinagollapalem](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/vvv.jpg.webp?itok=oJn6FokE)
చినగొల్లపాలెంలో అరుదైన నల్ల రాబందు గుర్తింపు
నీటిలో తడిసి ఎగరలేని స్థితిలో మత్స్యకారుడికి లభ్యం
విశాఖ జూలాజికల్ పార్కుకు తరలింపు
పర్యావరణ బంధువైన నల్ల రాబందు (సినేరియన్, ఇండియన్ వల్చర్) కృష్ణా జిల్లా చినగొల్లపాలెం ఏటిపొగరులో లభ్యమైంది. వేటాడే అతిపెద్ద పక్షుల్లో ఒకటైన నల్ల రాబందు అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఈ అరుదైన పక్షి గంధం సూర్యారావు అనే మత్స్యకారుడి వద్ద అటవీ శాఖ అధికారులు గురువారం గుర్తించారు. మూడు రోజుల క్రితం నీటిలో తడిసిపోవడంతో ఎగరలేక సముద్రపు ఒడ్డున పడి ఉన్న ఈ భారీ పక్షిని సూర్యారావు ఇంటికి తీసుకొచ్చి పంజరంలో పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారి బి.విజయ కైకలూరు అటవీశాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ రంజిత్‌కుమార్, సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా జరిపించి నల్ల రాబందును సంరక్షణ నిమిత్తం విశాఖ జూకు తరలించారు. – కైకలూరు/కృత్తివెన్ను
అంతరించి పోవడానికి ఇదీ కారణం
జంతు కళేబరాలను ఆహారంగా తీసుకుంటూ ప్రకృతి సవాళ్లను సమతుల్యం చేయడంలో రాబందుల పాత్ర కీలకం. వెటర్నరీ వైద్యుడు సుశాంత్ ఈ జాతి కనుమరుగైపోవడానికి కారణాలను వివరిస్తూ.. ‘పశువులకు గతంలో డైక్లోఫినాక్ అనే మందును ఇచ్చేవారు. ఆ పశువు చనిపోయిన తరువాత కూడా వాటి శరీర భాగాల్లో ఆ మందు నిక్షిప్తమై ఉండేది. ఆ కళేబరాన్ని తిన్న రాబందుల మూత్రపిండాలపై అది తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా రాబందులు అధిక సంఖ్యలో మృత్యువాత పడి అంతరించేపోయే దశకు చేరుకున్నాయి’ అని వివరించారు. తరువాత కాలంలో ఆ మందును నిషేధించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు.
ప్రత్యేకతలివీ..
ఈ రాబందు శరీర పొడవు 3 అడుగుల 11 అంగుళాలు ఉండగా.. రెక్కల పొడవు ఒక్కొక్కటి 5 అడుగులు చొప్పున ఉన్నాయి. బరువు దాదాపు 14 కిలోలు ఉంది. ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గూడు కట్టుకుని గుడ్లు పెడతాయి. వీటి జీవిత కాలం 39 ఏళ్లు. అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై కూడా దీని జాడను గుర్తించారు. స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఫ్రాన్స్, గ్రీస్, టర్కీలలో నల్ల రాబందులు ఎక్కువగా సంచరిస్తాయి. ఆఫ్ఘని స్థాన్ మీదుగా ఉత్తర భారతదేశంలోకి ఇవి ప్రవేశిస్తాయి. మంచూరియా, మంగోలియా, కొరియాలలో సంతానోత్పత్తి చేస్తాయి. నదీతీర ఆవాసాలు, పర్వత ప్రాంతాలు, కొండల్లో మృత కళేబరాలను తింటూ జీవిస్తాయి. మెడ ఈకలు బట్టతలగా ఉండటంతో దీనిని సన్యాసి రాబందు అని కూడా పిలుస్తారు.
ఆశ్చర్యంగా ఉంది
ఈ జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. ఈ ప్రాంతంలో అరుదైన రాబందు దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఇది చిన్న వయసున్న పక్షి. దీనిని బట్టి ఈ ప్రాంతంలో ఇంకా దీనికి సంబంధించిన పక్షులు ఉండే అవకాశం ఉంది. ఇటువంటివి ఎవరికైనా కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి. – ఎం.రంజిత్, ఫారెస్ట్ డీఆర్‌వో
హాని కలిగించవద్దు
ప్రకృతిలో ఎన్నో అరుదైన జీవులు సంచరిస్తాయి. వాటిని గుర్తించినప్పుడు హాని చేయకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించండి. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో కొండ చిలువలు కనిపిస్తున్నప్పుడు గ్రామస్తులు భయంతో వాటిపై దాడి చేస్తున్నారు. అవి విషపూరితం కావు. సమాచారం అందిస్తే సంరక్షిస్తాం. – బి.విజయ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment