tracker
-
జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నాలుగు రోజులుగా కెమెరా లేని జీపీఎస్ ట్రాకర్‌తో తిరుగు తున్న రాబందును అటవీశాఖ అధికారు లు గురువారం చిన మిడిసిలేరు ప్రాంతంలో పట్టుకున్నారు. ఆదివారం నీరసంగా, కదల్లేని స్థితిలో నాయకకాలనీలోని ఏకలవ్య పాఠశాల సమీపంలో ఈ రాబందు కనిపించగా స్థానికులు మాంసాహారం పెట్టగా తినేసి వెళ్లిపోయింది. ఈ విషయం బయటపడటంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే మహారాష్ట్రకు చెందిన ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ వారు నాగపూర్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఆగస్టు 10న ఇలాంటి రాబందులను వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈ రాబందు ఎక్కువ దూరం వెళ్లలేకపోతుండటాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించిన అక్కడి అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నట్లు తెలిసి అటవీశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వగా చర్ల రేంజ్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రేంజ్ కార్యాలయానికి తరలించి ఆహారం అందించి పశువైద్యుల ద్వారా పరీక్ష చేయిస్తున్నారు. కాగా, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ రాబందు తిరుగుతుండటంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులే పంపించారనే చర్చ జరిగింది. చివరకు పరిశోధనల కోసం విడిచిపెట్టినట్లు తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
ఈ స్మార్ట్ రింగ్ ఫింగర్లో ఉంటే ఫికర్ లేదు!
ఫిట్నెస్ ట్రాకర్‌గా పనిచేసే స్మార్ట్ రింగ్‌ను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్ భారతదేశంలో విడుదల చేసింది. చేతి వేళ్లకు ధరించగలిగేలా తయారు చేసిన రింగ్ యూజర్ల బయోమెట్రిక్స్, రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ నీరు, చెమట నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వ్యాయామ సెషన్లు లేదా నీళ్లలో యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా ధరించవచ్చు. స్టెప్ కౌంట్, నడిచిన దూరం, కేలరీలు ఎంత మేర కరిగాయి, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలతో సహా అనేక రకాల ఆరోగ్య కొలమానాలను ఈ స్మార్ట్ రింగ్ ట్రాక్ చేస్తుంది. ఇందులో బాడీ రికవరీ ట్రాకింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ బీట్ వేరియబిలిటీ అనాలిసిస్‌తో పాటు ఓవరాల్ యాక్టివిటీ రికార్డులను ఉపయోగించి యూజర్ల మొత్తం ఆరోగ్య స్థితి గురించి తెలియజేస్తుంది. శారీరక శ్రమను ట్రాక్ చేయడంతో పాటు నిద్రను కూడా ఈ స్మార్ట్ రింగ్ పర్యవేక్షిస్తుంది. మొత్తం నిద్ర వ్యవధి, వివిధ నిద్ర దశలలో గడిపిన సమయం సంభావ్య నిద్ర భంగం వంటి అంశాలను కవర్ చేస్తూ సమగ్ర స్లీప్ డేటాను అందిస్తుంది. ఇక రుతుక్రమం ఉన్న మహిళల కోసం రుతు చక్రాలను ట్రాక్ చేసే, అంచనా వేసే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ సమాచారాన్ని నేరుగా యూజర్ల ఫోన్‌కు నోటిఫికేషన్లు, రిమైండర్ రూపంలో అందిస్తుంది. ఈ మొత్తం డేటా బోట్ రింగ్ యాప్‌లో స్టోర్ అవుతుంది. దీంతో యూజర్లు తమ ఆరోగ్య ప్రమాణాలను, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. అయితే ఈ స్మార్ట్ ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని బోట్ సంస్థ పేర్కొంది. -
ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?
ముంబై: ఉద్యోగ మార్కెట్‌పై జూన్ త్రైమాసికం(క్యూ1)లో ద్రవ్యోల్బణ ప్రభావం ఏమీ లేదని ఇండీడ్ ఇండియా క్వార్టర్లీ హైరింగ్ ట్రాకర్ నివేదిక తెలిపింది. తమ నియామకాలు, ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం ప్రభావం లేదని 89 శాతం కంపెనీలు చెప్పాయి. ఉద్యోగార్థుల్లో ప్రతి 10 మందికి గాను ఆరుగురు తమపై ద్రవ్యోల్బణ ప్రభావం లేదని చెప్పినట్టు ఇండీడ్ తన నివేదికలో తెలిపింది. 1,229 ఉద్యోగ సంస్థలు, 1,508 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఇండీడ్ పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీల ఉద్యోగ నియామకాల్లో 29 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం మార్చి త్రైమాసికంలో వృద్ధి 20 శాతాన్ని మించింది. 37 శాతం మంది ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం చూడడం లేదంటే సంస్థను మార్చాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మార్చి త్రైమాసికంలో 46 శాతంగా ఉంది. ఐటీ, హెల్త్‌కేర్, ఈకామర్స్ ఇక ముందూ వృద్ధిని చూపిస్తాయని.. 5జీ రాకతో రానున్న త్రైమాసికాల్లో టెలికంలోనూ ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని ఇండీడ్ నివేదిక అంచనా వేసింది. ఫుల్‌టైమ్ కోరుకునే వారు 63 శాతం మంది ఉద్యోగాలు కోరుకునే వారిలో 63 శాతం మంది ఫుల్‌టైమ్ పనికోసం చూస్తున్నారు. పార్ట్‌టైమ్ పనిని కోరుకునే వారు 26 శాతంగానే ఉన్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగాల కోసం చూస్తున్నవారు 11 శాతంగా ఉన్నారు. జూన్ త్రైమాసికంలో 19 శాతం కంపెనీలు కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ రంగం ఎక్కువ మందికి ఉపాధినిచ్చింది. ఈ రంగంలో 91 శాతం కంపెనీలు జూన్ క్వార్టర్లో నియమకాలు చేపట్టాయి. మార్చి త్రైమాసికంలో 83 శాతం కంపెనీలే నియామకాలు చేపట్టడం గమనార్హం. -
కరోనా ట్రాకర్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి కోరలు చాచడంతో లాక్డౌన్ కారణంగా దేశమంతా ఇంటికే పరిమితమైంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇదే సమయంలో ఏ నగరంలో ఎక్కడ ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇలా తెలుసుకోవడం వల్ల ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే, మీ పరిసరాల్లో ఎంత మంది కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు గోవాకు చెందిన విద్యార్థులు కరోనా ట్రాకర్ (www.cosonatracker.in) వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇది యాప్ రూపంలోనూ లభిస్తుంది. గోవాకు చెందిన 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి శ్రీ కెనీ, అతని స్నేహితులు సలీల్ నాయక్, నికేత్ కామత్, రిషికేశ్ భండారీ, సాకేత్ మరాఠేతో కలసి కరోనా ట్రాకర్‌ను డిజైన్ చేశాడు. హప్కిన్స్ యూనివర్సిటీ మరికొన్ని నమ్మకమైన ఎన్జీవోలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ యాప్‌లో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన.. ఆ ప్రాంతాలను మార్క్ చేసి చూపిస్తుంది. మనదేశంలో ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది కోలుకున్నారు? మరణాలు, రికవరీ రేటు, డెత్ రేటు తదితరాలు పొందుపరిచారు. వయసులవారీగా ఎంతమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందో కూడా గ్రాఫ్‌ల ద్వారా చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ యాప్ ఆధారంగా.. దేశంలో మొత్తం 1,199 మందికి పాజిటివ్ రాగా, అందులో 20–30 ఏళ్లవారు దాదాపు 130 మంది ఉన్నారు. 30–40 ఏళ్లవారు సుమారు 90 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు చూసుకోవచ్చు. అంతేకాకుండా కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ వెబ్సైట్/యాప్ ద్వారా వివరించారు. అంతేకాదు, ఈ వెబ్సైట్ ద్వారా విరాళాలు కూడా పంపవచ్చు. ఆన్లైన్, యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా విరాళాలు అందించవచ్చు. -
వివరాలన్నీ ఒడిసిపట్టే సరికొత్త ట్రాకర్
గుండె కొట్టుకునే వేగం, వేసిన అడుగులు, ఖర్చయిన కేలరీల వివరాలు ఎప్పటికప్పుడు చూపగలిగే హెల్త్ ట్రాకర్స్ గురించి మీరు వినే ఉంటారు. ఫొటోలో కనిపిస్తోందే.. ఇదీ అలాంటిదే. కాకపోతే మన శరీరానికి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రమే ఇవ్వడంతో ఆగిపోదు ఇది. రక్త కణాల సంఖ్యను కూడా లెక్కకట్టి చెప్పగల సూపర్ హెల్త్ ట్రాకర్ ఇది. తయారు చేసింది.. రట్గర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. బయో సెన్సర్ సాయంతో ఇది రక్త కణాల, బ్యాక్టీరియా సంఖ్యను లెక్కగట్టగలదని, అలాగే గాల్లోని కాలుష్య కణాలకూ లెక్కచెప్పగలదని అంటున్నారు మెహదీ జావాన్మర్ద్. ఇందుకు తగ్గట్టుగా ఈ గాడ్జెట్‌లో సూక్ష్మస్థాయి ద్రవాలను విశ్లేషించగల మైక్రోఫ్లుయిడిక్ సెన్సర్ ఒకటి ఉంటుందని, దీంతోపాటే ఉండే బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా మొత్తం వివరాలను స్మార్ట్‌ఫోన్ యాప్‌కు పంపవచ్చునని వివరించారు. భవిష్యత్తులో ఈ గాడ్జెట్‌ను మరింత అభివద్ధి పరచడం ద్వారా అన్ని రకాల వివరాలను ఎప్పటికప్పుడు పొందేలా చేస్తామని చెప్పారు. లుకేమియా వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్త కణాల మోతాదును ఎప్పటికప్పుడు లెక్కించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. -
ఫిట్నెస్ కోసం మరో స్మార్ట్ వాచీ!
టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగానే స్మార్ట్ వాచీల పరంపర కొనసాగుతోంది. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన సౌకర్యంతో స్మార్ట్ వాచీలను రూపొందిస్తున్నాయి. పోటాపోటీగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ వాచీలు మార్కెట్లో అందుబాటులో ఉండగా... తాజాగా గార్మిన్ ఇండియా వ్యాయామానికి పనికొచ్చే మరో కొత్త స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. గుండె కొట్టుకునే రేటుతోపాటు, ఫిట్నెస్ను సూచించే స్మార్ట్ నోటిఫికేషన్స్ టెక్నాలజీతో కూడిన 'వావోస్మార్ట్ హెచ్ ఆర్' యాక్టివిటీ ట్రాకర్‌ను విడుదల చేసింది. టచ్ స్క్రీన్ తో కూడిన వావోస్మార్ట్ యాక్టివిటీ ట్రాకర్‌లో ఇంచుమించుగా స్మార్ట్ ఫోన్లో ఉండే టెక్స్ట్, కాల్స్, ఈ మెయిల్, క్యాలెండర్, సోషల్ మీడియా అలర్ట్స్, మ్యూజిక్ వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అతిపెద్ద సన్ లైట్ రీడబుల్ డిస్ ప్లే తో 'వావ్ స్మార్ట్ హెచ్ ఆర్' ట్రాకర్ ఎప్పుడూ పనిచేస్తుంది. 24 గంటలూ పనిచేసే ట్రాకర్... గుండె కొట్టుకునే రేటు, నడక, మెట్లు ఎక్కడం, కేలరీలు తగ్గడం వంటి లెక్కలన్నింటినీ ఎప్పటికప్పుడు సూచిస్తుంటుంది. రోజువారీ జీవితంలోని కార్యకలాపాలు, సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేవారికి వావ్ స్మార్ట్ హెచ్ ఆర్ విప్లవాత్మక ఉత్పత్తిగా చెప్పుకోవచ్చని గార్మిన్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ అలి రిజ్వి చెప్తున్నారు. ఏ సమయంలోనైనా చేతికి పెట్టుకోగలిగేలా ఎంతో తేలిగ్గా, సౌకర్యవంతంగా ఈ ట్రాకర్ ఉంటుందన్నారు. ఒకసారి చార్జి చేస్తే ఏడు రోజుల పాటు పనిచేస్తుందని, ఈ పరికరాన్ని వినియోగించే వారు చేతి నుంచి తీయాల్సిన పని కూడా పెద్దగా ఉండదని అంటున్నారు. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ట్రాకర్ రూ. 14,999కు అందుబాటులో ఉంచారు.