ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సన్నాహాలు | Preparations for collection of Kharif grain | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సన్నాహాలు

Published Sat, Sep 16 2023 4:29 AM | Last Updated on Sat, Sep 16 2023 6:56 PM

Preparations for collection of Kharif grain - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్‌లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్‌ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది.

రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్‌ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒక్కో ఆర్బీకే క్లస్టర్‌లో పది వాహనాలు..
రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్‌లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్‌లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్‌ గోడౌన్లకు తరలిస్తారు. 

ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ..
ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొను­గోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కె­ట్‌లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొను­గోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది.

దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కా­లిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకా­శాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. 

ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం
ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధా­రంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వ­స్తా­యో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌­లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివ­రాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసు­కు­ని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖ­మెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది.

ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్‌టీ (గన్నీ లేబర్‌ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. 

రైతులు మిల్లుకు వెళ్లొద్దు..
రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్‌టీఓ (ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్‌టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్‌ స్థాయి అధికారిని కస్టోడియన్‌ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్‌ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం.
– హెచ్‌. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ

మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే..
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్‌ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్‌ మిల్లింగ్‌ నుంచి తొలగిస్తాం.
– వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement