mill
-
క్వింటాల్ ధాన్యం సగటున రూ.1,685
సాక్షి, హైదరాబాద్: మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం విక్రయానికి మరో అడుగు ముందుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా మిల్లుల్లోని 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు ఆన్లైన్లో గత నెలలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, 11 సంస్థలు 54 బిడ్స్ దాఖలు చేశాయి. ఈనెల 14న టెక్నికల్ బిడ్స్ తెరిచిన పౌరసరఫరాల సంస్థ ఈ 11 సంస్థల్లో హరియాణాకు చెందిన గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీ బిడ్‌ను తిరస్కరించింది. మిగతా అర్హత పొందిన 10 సంస్థలకు సంబంధించి శనివారం ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచారు. ఇందులో క్వింటాల్ ధాన్యానికి కనిష్టంగా రూ.1,618, గరిష్టంగా రూ.1,732 కింద బిడ్స్ వేసిన 10 సంస్థలకు 25 లాట్లు అప్పగించారు. మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున రూ.1,685 లెక్కన విక్రయించారు. నష్టం క్వింటాల్‌కు రూ. 375 రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో క్వింటాల్ ధాన్యాన్ని గరిష్ట మద్దతు ధర (ఎంఎస్పీ) రూ.2,060 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. యాసంగిలో మొత్తంగా 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల నూకల శాతం ఎక్కువగా వస్తుందని మిల్లర్లు సీఎంఆర్‌కు నిరాకరించారు. దీంతో ఈ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే వచ్చే నూకలకు నష్టపరిహారంగా క్వింటాల్ ధాన్యానికి రూ. 280 వరకు కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినా, మిల్లర్లు ససేమిరా అనడంతో తప్పక విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సగటున ధాన్యం క్వింటాల్‌కు రూ.1,800 వరకు విక్రయించేందుకు బిడ్స్ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తర్వాత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున క్వింటాల్‌కు రూ. 1,685 మాత్రమే బిడ్స్ ఫైనల్ అయ్యాయి. అంటే ఎంఎస్పీ రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 375 ప్రభుత్వానికి నష్టం. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 37 కోట్ల చొప్పున 25 ఎల్ఎంటీకి రూ. 925 కోట్ల నష్టం. కాగా ఈ ఫైనాన్షియల్ బిడ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఆమోదించాల్సి ఉంది. 25 లాట్లు దక్కించుకున్న 10 సంస్థలు ఇవే కేంద్రీయబండార్, సామ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, పట్టాబి ఆగ్రోఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్‌ఫుడ్ ఇండస్ట్రీ లిమిటెడ్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటేనింగ్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నోచా ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బగదీయ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిద్దరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీలలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, శంభుదయాల్ జైన్ అండ్ కంపెనీ. -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్‌గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్‌గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్‌కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
ప్రాణం తీసిన పిండిమిల్లు
సాక్షి, (ఖమ్మం)బూర్గంపాడు: లక్ష్మీపురం గ్రామానికి చెందిన మారం చౌడమ్మ(65) గురువారం తన ఇంట్లోని పిండిమిల్లును నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ చీర మరలో చిక్కుకుంది. ఈ క్రమంలో ఆమె చీరతో పాటుగా పిండిమరలోకి జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. చౌడమ్మ, రామిరెడ్డి దంపతులు గత కొన్నేళ్లుగా లక్ష్మీపురంలో పిండిమిల్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీవనాధారమైన పిండిమిల్లే చౌడమ్మ ప్రాణం తీయడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ఎస్ఐ జితేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రిల్లింగ్ పనిచేస్తుండగా విద్యుదాఘాతం అన్నపురెడ్డిపల్లి: రాజాపురం గ్రామానికి చెందిన చింతల రాజు(32)గురువారం ఎర్రగుంటలోని ఓ పాత భవనం పిల్లర్లను తొలగించే పనికి వెళ్లాడు. డ్రిల్లింగ్ మిషన్‌తో ఇనుప చువ్వలను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మృతదేహం వద్ద తల్లి సోమమ్మ కన్నీరుమున్నీరుగా విపలించింది. ఎస్సై తిరుపతి కేస -
మూతపడి 30 ఏళ్లు
రామగుండం : అంతర్గాం వీవింగ్ మిల్లు 1987 మే ఒకటవ తేదీన లాకౌట్‌గా ప్రకటించి మంగళవారం నాటికి (మేడే) ముప్పై ఏళ్లు పూర్తయింది. బర్మా, శ్రీలంక, కాందీశీకుల శాశ్వత పునరావాస కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 1967న కేంద్ర, రాష్ట్ర (అప్పటి ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు అవకాశం కల్పించింది. అంతర్గాంలో టెక్స్టైల్ టౌన్షిప్ (టీటీఎస్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు గాను 502 ఎకరాల భూ విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ పునరావాస ఆర్థిక నిధులు రూ.1.05 కోట్లతో దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ సహకార రంగంలో టెక్స్ౖటైల్ సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో జూలై 7, 1971న స్థానిక, స్థానికేతర 509 మంది కార్మికులతో టెక్స్టైల్ వీవింగ్ మిల్లు సొసైటీగా రూపాంతరం చెందింది. ఇందులో కార్మికులు విధులు నిర్వహిస్తూ 1976 వరకు లాభాల బాటలో పయనించిన వీవింగ్ సొసైటీ క్రమంగా నష్టాల బాటన పడింది. దీనికి కారణం యాజమాన్యం అవినీతి, పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల బాటలోకి చేరింది. అప్పటికే పలుమార్లు, లేఆఫ్, లాకౌట్లను ప్రకటించిన యాజమాన్యం కార్మికుల ఆందోళనలతో నెట్టుకురాగా కొంతకాలం తర్వాత ప్రభుత్వం ముడిసరుకు లేదనే సాకుతో 1987 మే (మేడే) ఒకటిన శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లాకౌట్‌ను ప్రకటిస్తున్నట్లు 1987 మే డే రోజున రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ రాజ్‌భవన్ సాక్షిగా ఆమోదముద్ర వేయడం కార్మిక చట్టాలను అపహస్యం చేయడమేనని కార్మిక లోకం గళమెత్తింది. 1987 నుంచి ప్రారంభమైన ఆకలి చావులు... 1987 మేడే రోజున మూతపడిన వీవింగ్ మిల్లు కార్మికులకు అప్పటికే రెండేళ్ల నుంచి వేతనాలు సకాలంలో చెల్లించకపోగా, పలువురు కార్మికులు అప్పటికే అనారోగ్యం బారినపడ్డారు. ఎక్కువగా దూదిలో నుంచి వచ్చే ధూళి కణాలతో ఊపిరితిత్తుల వ్యాధులకు ఎక్కువగా గురయ్యేవారు. 1987 అక్టోబర్‌లో వెలగాల మహాలక్ష్మి అనే కార్మికురాలు ఆకలిచావుతో మతి చెందడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆనాటి నుంచి నేటి వరకు 134 మంది కార్మికులు తమకు రావాల్సిన బకాయిలు స్వీకరించకుండానే మృతిచెందారు. కార్మికులకు అందని బకాయిలు.. వీవింగ్ మిల్లు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో ప్రభుత్వం కూడా కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించలేని స్థితిలోకి చేరింది. ఈ క్రమంలో వీవింగ్ మిల్లును తుక్కు కింద విక్రయించి వచ్చిన నగదును కార్మికులకు చెల్లించేందుకు జాయింట్ కలెక్టర్‌కు లిక్విడేటర్ హోదాను అప్పగించింది. అప్పటి నుంచి నేటి వరకు 18 మంది లిక్విడేటర్లు మారినప్పటికీ కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం అందలేదు. శాశ్వత పునరావాస కల్పనకు శ్రీలంక, బర్మా దేశాల నుంచి వచ్చిన తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డున పడేశాయని పలుమార్లు నిరాహార దీక్షలు సైతం చేశాయి. ఇందుకు కనీసం తమకు నివేశన స్థలాల కింద ఇప్పుడున్న క్వార్టర్‌తో కలుపుకొని పది గుంటల స్థలం తమ పేరుతో పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం సొసైటీకి చెందిన భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. సొసైటీ భూముల్లో పరిశ్రమ స్థాపించాలి... అంతర్గాం సొసైటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వాటిని ప్రభుత్వం సర్వే చేయించి అన్యాక్రాంతమైన భూములను గుర్తించి హద్దు రాళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పాటుపడాలి. – రామారావు, కాందీశీకుల సంఘం ప్రతినిధి జీవితాన్ని నాశనం చేసుకున్నాం... నేను, నా భర్త అప్పారావు కలిసి వీవింగ్ మిల్లులో కార్మికులుగా చేరాం. భర్త 1998లో టీబీ వ్యాధితో మృతిచెందాడు. ఇప్పుడు నేను దంత క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. వీవింగ్ మిల్లుల్లో పని చేయడంతోనే తమ బతుకులు చావుబారిన పడ్డాం. మిల్లు మూతపడే నాటికే నా భర్తకు రూ.57,004 తనకు రూ.56,692 బకాయిలు రావాల్సి ఉంది. – కర్రి పద్మ, వీవింగ్ మిల్లు కార్మికురాలు. -
ప్రాణం తీసిన మినుము బస్తాలు
అనంతపల్లి (నల్లజర్ల) : నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిల్వ ఉంచిన మినుము బస్తాల లాటు కూలి వ్యాపారి మృతి చెందాడు. శుక్రవారం వేకువజామున జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తూర్పుచోడవరం గ్రామానికి చెందిన యడవల్లి వెంకటేశ్వరరావు కుమారుడు రవిశంకర్‌కుమార్ (28) ఐదేళ్లుగా అనంతపల్లిలో ఉంటూ రాజ్యలక్ష్మి ఆయిల్, ఫ్లోర్‌మిల్ నిర్వహిస్తూ అపరాలు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన మినుము బస్తాలను మిల్లు బయట నిల్వ ఉంచారు. రాత్రి వేళ వాటికి కాపలాగా తానే నిద్రపోతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి యధావిధిగా రెండు లాట్లు కట్టిన బస్తాల మధ్య మడత మంచం వేసుకొని నిద్రపోయాడు. తెల్లవారేసరికి ఒక లాటులో బస్తాలు అతను నిద్రిస్తున్న మంచంపై పడ్డాయి. ఉదయం చుట్టుపక్కల వారు చూసేసరికి బస్తాల కింద రవిశంకర్‌కుమార్ అచేతనంగా పడిఉన్నాడు. బస్తాలు తొలగించి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. ఘటనపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులందరికీ సహాయ సహకారాలు అందించే రవిని విగత జీవిగా చూసిన వాళ్లు చలించిపోయారు. మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎంపీపీ జమ్ముల సతీష్, ఆత్మ చైర్మన్ గన్నమని కృష్ణమోహన్, బళ్ల ప్రభాకరరావు, ఓలిరెడ్డి సతీష్ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఐ సూర్యప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి ప్రత్తిపాటి మిల్లు బస్సు దగ్ధం
నకరికల్లు : రాష్ట్ర మంత్రి భాగస్వామ్యంతో నడుస్తున్న ఓ టెక్స్టైల్ మిల్లుకు చెందిన మినీబస్సు సోమవారం తెల్లవారుజామున దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... చిలుకలూరిపేట సమీపంలోని గణపవరంలో గల శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో మండలంలోని పలు గ్రామాల కూలీలు పనిచేస్తుంటారు. వీరిని కంపెనీకి చెందిన బస్సులో తీసుకెళ్తుంటారు. సోమవారం యథావిధిగా కూలీల కోసం ఏపీ07టీడీ 3893 నంబరు బస్సు బయలుదేరింది. మార్గంమధ్యలో రూపెనగుంట్ల–దేచవరం గ్రామాల మధ్య సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకSసిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో కూలీలు ఎవరూ లేకపోవడం, డ్రైవర్ కూడా కిందకు దూకడంతో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంలో సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఆ టెక్స్‌టైల్స్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భాగస్వామి అని అధికారులు తెలిపారు. -
జూట్ మిల్లు తెరవాల్సిందే..
అధికారులకు తేల్చిచెప్పిన పరిరక్షణ సమితి నేతలు గుంటూరు (పట్నంబజారు) : కార్మికులకు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడమే కష్టంగా ఉంది.. అందుకే పోరుబాట పట్టాం.. మిల్లు తెరవాలనే డిమాండ్ తప్ప మరో ఆలోచన లేదు.. దశాబ్దాల చరిత్ర కలిగిన మిల్లును తెరిపించే తీరుతామని భజరంగ్ జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కార్మిక శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం జూట్‌మిల్లు వ్యవహారంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు అడిషనల్ కమిషనర్ సూర్యప్రకాశరావు, మూడు జిల్లాల అధికారి లక్ష్మీనారాయణతో పాటు మరికొంతమంది అధికారులు మిల్లుకు వచ్చారు. తొలుత కార్మికులను పిలిచి వారి అభిప్రాయాలను సేకరించారు. ఏడాదిన్నరగా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఆఖరికి చిన్నారులకు పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 2,500 మంది కార్మికులు ఉన్నారు... అనంతరం పరిరక్షణ సమితి నేతలతో అధికారులు భేటీ అయ్యారు. కార్మికులు లేరన్న ఒకే ఒక్క కారణంతో మిల్లు లాకౌట్ చేశారని, 2,500 మంది కార్మికులు ఉన్నప్పటికీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరి స్తున్నారని నేతలు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనేక పోరాటాల అనంతరం దీక్షలకు పూనుకుంటున్న తరుణంలో జిల్లా అధికారుల సూచన మేరకు విరమించినట్లు చెప్పారు. మిల్లు తెరవటం తప్ప మరో ఆలోచన లేదని, కచ్చితంగా మిల్లు తెరవాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం మిల్లు యజమాని బ్రిజ్గోపాల్ లునానీతో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక : అడిషనల్ కమిషనర్ కార్మికులు, పరిర క్షణ సమితి, యాజమాన్యం వాదనలపై పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని అడిషనల్ కమిషనర్ సూర్యప్రకాశరావు తెలిపారు. రెండోరోజుల్లో విచారణపై నివేదికను కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నవంబర్ మూడున వెలగపూడిలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మిల్లును తెరిపించి ఉపాధి కల్పించేలా చూస్తామని, లేబర్‌కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో తీర్పు వెలువడేవరకు వేచి ఉండాల్సిందేనని చెప్పారు. ప్రభుత్వానికి, కార్మిక శాఖకు తెలియపరచకుండా మిల్లు మూసివేయటం నిబంధనలకు విరుద్ధమేనన్నారు. పూర్తి వివరాలను మంత్రి అచ్చెన్నాయుడికి అందజేస్తామని తెలిపారు. -
మిల్లు తెరిపించకుంటే ఆమరణ దీక్షే..
* భజరంగ్ జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి * వాయిదా వేసుకోవాలని కోరిన కలెక్టర్ కాంతిలాల్ దండే * వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ గుంటూరు (పట్నంబజారు): రోజురోజుకు భజరంగ్ జూట్‌మిల్లు అంశం వేడెక్కుతోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గత సంవత్సరం అక్టోబరు 2వ తేదీన మిల్లు తెరిపిస్తామని హామీ ఇచ్చి నేటికి సంవత్సరం గడుస్తోంది. ఈ నేపథ్యంలో జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధపడిన విషయం విధితమే. ఆదివారం నుంచి దీక్షకు దిగుతున్నట్లు పరిరక్షణ సమితి సభ్యులు శనివారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి తెలియజేశారు. ఈలోగా సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ మిల్లు మూసి 15 నెలలు గడుస్తుంటే కనీసం ఆ కార్మికుల కడుపులు కాలుతున్న సంగతి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒకటికి పలుమార్లు హామీలు ఇవ్వడమే తప్ప, చేస్తోంది ఏమీ లేదని మండిపడ్డారు. యాజమాన్యం నిరంకుశ వైఖరిపై పోరుబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కులేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రాణాలు విడిచి అయినా మిల్లు తెరిపించుకునేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. పరిరక్షణ సమితి సభ్యులతో చర్చించిన కలెక్టర్ మిల్లు యాజమాన్యం మరోమారు చర్చకు సానుకూలంగా ఉందని చెప్పారు. పరిరక్షణ సమితి సభ్యులు, కార్మికులు, సహనాన్ని పాటించాలని కోరారు. వారం రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతానికి దీక్షను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అప్పిరెడ్డి సమస్య పరిష్కారం అవుతుందంటే దీక్షను కచ్ఛితంగా వాయిదా వేస్తామన్నారు. సమస్య పరిష్కారం కాని నేపథ్యంలో ఆమరణ దీక్ష చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పరిరక్షణ సమితి సభ్యులు న్యాయవాది వైకే, ఎన్.భావన్నారాయణ, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ జానీ, ఎబ్బూరి పాండురంగ తదితరులున్నారు.