మిల్లు తెరిపించకుంటే ఆమరణ దీక్షే..
* భజరంగ్ జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి
* వాయిదా వేసుకోవాలని కోరిన కలెక్టర్ కాంతిలాల్ దండే
* వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ
గుంటూరు (పట్నంబజారు): రోజురోజుకు భజరంగ్ జూట్‌మిల్లు అంశం వేడెక్కుతోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గత సంవత్సరం అక్టోబరు 2వ తేదీన మిల్లు తెరిపిస్తామని హామీ ఇచ్చి నేటికి సంవత్సరం గడుస్తోంది. ఈ నేపథ్యంలో జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధపడిన విషయం విధితమే. ఆదివారం నుంచి దీక్షకు దిగుతున్నట్లు పరిరక్షణ సమితి సభ్యులు శనివారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి తెలియజేశారు. ఈలోగా సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ మిల్లు మూసి 15 నెలలు గడుస్తుంటే కనీసం ఆ కార్మికుల కడుపులు కాలుతున్న సంగతి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒకటికి పలుమార్లు హామీలు ఇవ్వడమే తప్ప, చేస్తోంది ఏమీ లేదని మండిపడ్డారు.
యాజమాన్యం నిరంకుశ వైఖరిపై పోరుబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కులేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రాణాలు విడిచి అయినా మిల్లు తెరిపించుకునేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. పరిరక్షణ సమితి సభ్యులతో చర్చించిన కలెక్టర్ మిల్లు యాజమాన్యం మరోమారు చర్చకు సానుకూలంగా ఉందని చెప్పారు. పరిరక్షణ సమితి సభ్యులు, కార్మికులు, సహనాన్ని పాటించాలని కోరారు. వారం రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతానికి దీక్షను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అప్పిరెడ్డి సమస్య పరిష్కారం అవుతుందంటే దీక్షను కచ్ఛితంగా వాయిదా వేస్తామన్నారు. సమస్య పరిష్కారం కాని నేపథ్యంలో ఆమరణ దీక్ష చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పరిరక్షణ సమితి సభ్యులు న్యాయవాది వైకే, ఎన్.భావన్నారాయణ, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ జానీ, ఎబ్బూరి పాండురంగ తదితరులున్నారు.