మధ్యాహ్న మంటలు
మధ్యాహ్న మంటలు
Published Fri, Jan 20 2017 1:35 AM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒక నాయకుడికి లబ్ది చేకూర్చేందుకు 200 మంది మహిళల ఉపాధిని పణంగా పెట్టారు. పైకి సేవలాగే కనపడుతున్నా దీని వెనుక పెద్దఎత్తున దోపిడీకి రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. జిల్లాలో మొదటి దశలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ డీఈవో డి.మధుసూదనరావు ఆదేశాలు జారీ చేయడం ప్రకంపనలు రేపుతోంది. తొలి దశలో 65 హైస్కూల్స్‌ను ఆ సంస్థకు కేటాయించాలని నిర్ణయించగా ఉండి, ఉంగుటూరు ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతానికి తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లోని 35 హైస్కూల్స్‌ను అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అ««దl్యక్షుడిగా ఉన్న గోదావరి విద్యా వికాస్ చైతన్య సొసైటీతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం శుక్రవారం నుంచి జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో గల 35 స్కూల్స్‌కు మధ్యాహ్న భోజనం ఈ సొసైటీ నుంచి అందుతుందని డీఈవో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ సొసైటీలో రైస్‌మిల్లర్లతో పాటు స్వచ్ఛంద సేవ చేసేవారు ఉన్నారని, పథకం అమలు బాధ్యతను వారికి అప్పగించడం వల్ల మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, ఇరగవరం, అత్తిలి, నల్లజర్ల, భీమవరం మండలాల్లో సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని 15,210 మంది విద్యార్థులకు ఈ సొసైటీ మధ్యాహ్న భోజనం అందజేస్తుంది. ప్రస్తుతం హాజరైన విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా స్కూళ్లలోనే వంటచేసి భోజనం వడ్డిస్తున్నారు. 17 ఏళ్లుగా ఈ పథకం నడుస్తుండగా.. అప్పటినుంచి డ్వాక్రా సంఘాల ద్వారా ఎంపికైన మహిళలే ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. వారే వంట సామగ్రి సమకూర్చుకుని.. స్కూల్ ఆవరణలోనే వంట చేసి విద్యార్థులకు వేడిగా వడ్డిస్తున్నారు. ఇందులో చిన్నపాటి లోపాలున్నా పథకం పూర్తిస్థాయిలోనే అమలవుతోంది.
ఇకపై తాడేపల్లిగూడెం నుంచి సరఫరా
కొత్తగా ఒప్పందం చేసుకున్న సంస్థ తాడేపల్లిగూడెంలో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేస్తుంది. అక్కడే వంటలు చేసి భోజనాన్ని పాఠశాలలకు పంపిస్తారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి స్కూల్‌లో ఆ రోజు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా బియ్యం ఎంత వేయాలి, ఎంత కందిపప్పు వాడాలన్నది కచ్చితంగా నిర్ధారించి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు వాటిని ఇస్తున్నారు. ఇద్దరు టీచర్లు అక్కడే ఉండి వంట చేయిస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ కిచెన్‌లో ఎంతమందికి భోజనం వండుతారు, ఎంత పరిమాణంలో బియ్యం, కందిపప్పు వంటి సరుకులు కేటాయిస్తారనేది స్పష్టత లేదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆయా స్కూళ్లలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికీ భోజనం పంపిస్తారు. అంటే.. విద్యార్థులు తక్కువ సంఖ్యలో పాఠశాలకు హాజరైనా.. ఆ పాఠశాలలో చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఆధారంగా భోజనం వండి పంపిస్తారు. ప్రస్తుతం పాఠశాలల్లో నడుస్తున్న విధానానికి ఇది పూర్తి వ్యతిరేకం. 15వేల మంది విద్యార్థులకు భోజనం పంపించాలంటే ఉదయాన్నే వంట చేయాల్సి వస్తుంది. దీనివల్ల వేడి అన్నం వడ్డించడం సాధ్యం కాదు. స్థానికంగా ఉన్న అవకాశాలను వదులుకుని ప్రైవేట్ సంస్థకు బాధ్యత అప్పగించడాన్ని చూస్తే.. దశలవారీగా ఈ పథకాన్ని పెద్ద సంస్థలకు కట్టబెట్టడానికే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వర్కర్లు ఇంటికే..
ప్రస్తుతం గోదావరి విద్యా వికాస్ చైతన్య సొసైటీకి అప్పగించిన 35 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వండటానికి సుమారు 200 మంది వర్కర్లు పని చేస్తున్నారు. ఆ పాఠశాలలను ఆ సంస్థకు అప్పగించడంతో అక్కడ పనిచేస్తున్న ఆ వర్కర్స్ అంతా ఉపాధి కోల్పోయి ఇంటిముఖం పట్టాల్సి వస్తుంది. వీరి పరిస్థితి ఏమిటనే దానిపై డీఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదిలావుంటే.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ 35 స్కూల్స్‌కు చెందిన మధ్యాహ్న భోజన కార్యకర్తలు గురువారం ఏలూరులో డీఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. శుక్రవారం జిల్లావ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.
ఉపాధి పోగొడుతున్నారు
15 ఏళ్లుగా మధ్యాహ్నభోజన కార్మికులుగా పనిచేస్తున్నాం. ఈ పథకాన్ని ఎన్నో కష్టాలకు, నష్టాలకు ఓర్చి అప్పులు చేసి మరీ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం దారుణం. ఈ ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారి వెంటనే రద్దు చేయాలి.
– ఎ.శ్యామలారాణి, జిల్లా కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్
ఉపసంహరించుకోవాలి
కార్మికులు జీవనోపాధి కోల్పోయేలా డీఈవో ఉత్తర్వులు జారీ చేయడం అమానుషం. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. చైతన్య సొసైటీ ప్రభుత్వం నుంచి అన్ని ఖర్చులకు సొమ్ములు, మెటీరియల్ తీసుకుని ఈ పథకాన్ని నిర్వహిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకుంటూ సేవ చేస్తున్నామని సొసైటీ ప్రతినిధులు చెప్పడం విడ్డూరం.
– షేక్ మదీనాబీబీ, యూనియన్ కార్యవర్గ సభ్యురాలు
ఆందోళన ఉధృతం చేస్తాం
పేద కుటుంబాలకు చెందిన డ్వాక్రా గ్రూపు మహిళలు మధ్యాహ్న భోజన పథకం కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వేలాది రూపాయలు అప్పులు చేసి ఈ పథకాన్ని నిర్వహిస్తుంటే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధిని నిరోధిస్తున్నారు. దీనిపై ఉద్యమిస్తాం.
– ఆర్.మంగతాయారు, భోజన పథకం వర్కర్, వీరవాసరం
Advertisement
Advertisement