కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన మధ్యాహ్న భోజన వర్కర్లు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను అక్షయపాత్ర సంస్థకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ నాలుగు రోజులుగా మధ్యాహ్న భోజన వర్కర్లు దీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మిగతా కార్మికులు దీక్ష శిబిరానికి తరలివచ్చారు. వారికి సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. అందరూ కలిసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకోగా.. గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. అయినా పట్టు వీడలేదు. చివరకు డీఆర్వో బయటకొచ్చి ఆందోళనకారులను శాంతింపజేశారు.
చుంచుపల్లి : నియోజక వర్గంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న వర్కర్లను కాదని కొత్తగా అక్షయపాత్రను ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్న భోజన వర్కర్లు ఆందోళన, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో అక్షయపాత్రను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా దీక్షలు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్ల దీక్షా శిబిరానికి వివిధ ప్రాంతాలకు చెందిన వర్కర్లు భారీగా తరలివచ్చారు. భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న భోజన వర్కర్లతో సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు కలెక్టరేట్ ముట్టడికి కదిలారు. అప్పటికే పరిస్థితులను అంచనా వేసిన పోలీసులు భారీ బలగాలను కలెక్టరేట్ వరకు ఏర్పాటు చేశా రు.
దీక్షా శిబిరం నుంచి భారీగా భోజన వర్కర్లు కదంతొక్కడంతో వారిని కలెక్టరేట్ వరకు వెళ్లకుండానే వారించడానికి పోలీసు లు ప్రయత్నించడంతో తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులను, బారీకేడ్లను తొలగించుకొని కలెక్టరేట్ గేటువద్దకు వర్క ర్లు చేరుకున్నారు. గేట్లు నెట్టుకొని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వర్కర్లను పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని మధ్యాహ్న భోజన వర్కర్లు నినాదాలు చేశారు. పరిస్థితులను గమనిం చిన డీఆర్వో కిరణ్‌కుమార్ బయటకు వచ్చి కార్మికుల సమస్యలను విన్నారు. తమకు న్యాయం జరిగేవరకూ ఇక్కడి నుంచి కదలమని చెప్పడంతో డీఆర్వో కలుగచేసు కొని కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళతానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించుకున్నారు.
మధ్యాహ్న భోజన వర్కర్లకు అన్యాయం జరిగితే సహించేది లేదు: నాయకులు
మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పజెప్పి వర్కర్ల పొట్టగొట్టాలని ప్రభుత్వం చూస్తుందని, వారికి అన్యా యం జరిగితే సహించేది లేదని శుక్రవారం మధ్యాహ్న భోజన వర్కర్ల దీక్ష శిబిరానికి హాజరైన పలు పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 17ఏళ్లుగా అనేక వ్యయ ప్రయాసలకు లోనవుతూ పథకాన్ని నిర్విరామంగా నడుపుతున్నా రని అన్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో దాదాపు మూడు వేల మంది మధ్యాహ్న భోజన వర్కర్ల జీవితాలు రోడ్డు పడనున్నా యని అన్నారు. మానుకోని పక్షం లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మాజీ మంత్రి వనమావెంకటేశ్వరరావు, వనమా రాఘ వ, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, జేఏసీ చైర్మన్ మల్లెల రామనాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడారు. జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్, బ్రహ్మచారి, తాటిపర్తి అనిల్, భూక్యా రమేష్, జి.రాజు, వీరన్న, వాసం రామకృష్ణ, నలమలపు సత్యనారాయణ, మధ్యాహ్న భోజన వర్కర్లు రాధమ్మ, జైతున్‌భీ, చిట్టెమ్మ, ధనలక్ష్మి, చిలకమ్మ, రాధమ్మ, భాగ్య, మాళవిక,స్వరూప, మధ్యాహ్న వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment