జూట్ మిల్లు తెరవాల్సిందే..
జూట్ మిల్లు తెరవాల్సిందే..
Published Wed, Oct 19 2016 5:35 PM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM
అధికారులకు తేల్చిచెప్పిన
పరిరక్షణ సమితి నేతలు
గుంటూరు (పట్నంబజారు) : కార్మికులకు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడమే కష్టంగా ఉంది.. అందుకే పోరుబాట పట్టాం.. మిల్లు తెరవాలనే డిమాండ్ తప్ప మరో ఆలోచన లేదు.. దశాబ్దాల చరిత్ర కలిగిన మిల్లును తెరిపించే తీరుతామని భజరంగ్ జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కార్మిక శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం జూట్‌మిల్లు వ్యవహారంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు అడిషనల్ కమిషనర్ సూర్యప్రకాశరావు, మూడు జిల్లాల అధికారి లక్ష్మీనారాయణతో పాటు మరికొంతమంది అధికారులు మిల్లుకు వచ్చారు. తొలుత కార్మికులను పిలిచి వారి అభిప్రాయాలను సేకరించారు. ఏడాదిన్నరగా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఆఖరికి చిన్నారులకు పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
2,500 మంది కార్మికులు ఉన్నారు...
అనంతరం పరిరక్షణ సమితి నేతలతో అధికారులు భేటీ అయ్యారు. కార్మికులు లేరన్న ఒకే ఒక్క కారణంతో మిల్లు లాకౌట్ చేశారని, 2,500 మంది కార్మికులు ఉన్నప్పటికీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరి స్తున్నారని నేతలు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనేక పోరాటాల అనంతరం దీక్షలకు పూనుకుంటున్న తరుణంలో జిల్లా అధికారుల సూచన మేరకు విరమించినట్లు చెప్పారు. మిల్లు తెరవటం తప్ప మరో ఆలోచన లేదని, కచ్చితంగా మిల్లు తెరవాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం మిల్లు యజమాని బ్రిజ్‌గోపాల్ లునానీతో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రెండు రోజుల్లో నివేదిక : అడిషనల్ కమిషనర్
కార్మికులు, పరిర క్షణ సమితి, యాజమాన్యం వాదనలపై పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని అడిషనల్ కమిషనర్ సూర్యప్రకాశరావు తెలిపారు. రెండోరోజుల్లో విచారణపై నివేదికను కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
నవంబర్ మూడున వెలగపూడిలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మిల్లును తెరిపించి ఉపాధి కల్పించేలా చూస్తామని, లేబర్‌కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో తీర్పు వెలువడేవరకు వేచి ఉండాల్సిందేనని చెప్పారు. ప్రభుత్వానికి, కార్మిక శాఖకు తెలియపరచకుండా మిల్లు మూసివేయటం నిబంధనలకు విరుద్ధమేనన్నారు. పూర్తి వివరాలను మంత్రి అచ్చెన్నాయుడికి అందజేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement