ప్రాణం తీసిన మినుము బస్తాలు
Published Sat, Dec 17 2016 1:47 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
అనంతపల్లి (నల్లజర్ల) : నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిల్వ ఉంచిన మినుము బస్తాల లాటు కూలి వ్యాపారి మృతి చెందాడు. శుక్రవారం వేకువజామున జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తూర్పుచోడవరం గ్రామానికి చెందిన యడవల్లి వెంకటేశ్వరరావు కుమారుడు రవిశంకర్‌కుమార్ (28) ఐదేళ్లుగా అనంతపల్లిలో ఉంటూ రాజ్యలక్ష్మి ఆయిల్, ఫ్లోర్‌మిల్ నిర్వహిస్తూ అపరాలు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన మినుము బస్తాలను మిల్లు బయట నిల్వ ఉంచారు. రాత్రి వేళ వాటికి కాపలాగా తానే నిద్రపోతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి యధావిధిగా రెండు లాట్లు కట్టిన బస్తాల మధ్య మడత మంచం వేసుకొని నిద్రపోయాడు. తెల్లవారేసరికి ఒక లాటులో బస్తాలు అతను నిద్రిస్తున్న మంచంపై పడ్డాయి. ఉదయం చుట్టుపక్కల వారు చూసేసరికి బస్తాల కింద రవిశంకర్‌కుమార్ అచేతనంగా పడిఉన్నాడు. బస్తాలు తొలగించి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. ఘటనపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులందరికీ సహాయ సహకారాలు అందించే రవిని విగత జీవిగా చూసిన వాళ్లు చలించిపోయారు. మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎంపీపీ జమ్ముల సతీష్, ఆత్మ చైర్మన్ గన్నమని కృష్ణమోహన్, బళ్ల ప్రభాకరరావు, ఓలిరెడ్డి సతీష్ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ సూర్యప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement