సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది.
25 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్‌ఎంటీ ఒక లాట్‌గా ఆన్‌లైన్‌లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి.
యాసంగిలో 66.85 ఎల్‌ఎంటీల ధాన్యం సేకరణ
రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్‌గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు.
దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్‌కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్‌ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment