మంత్రి ప్రత్తిపాటి మిల్లు బస్సు దగ్ధం
నకరికల్లు : రాష్ట్ర మంత్రి భాగస్వామ్యంతో నడుస్తున్న ఓ టెక్స్‌టైల్ మిల్లుకు చెందిన మినీబస్సు సోమవారం తెల్లవారుజామున దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... చిలుకలూరిపేట సమీపంలోని గణపవరంలో గల శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో మండలంలోని పలు గ్రామాల కూలీలు పనిచేస్తుంటారు. వీరిని కంపెనీకి చెందిన బస్సులో తీసుకెళ్తుంటారు. సోమవారం యథావిధిగా కూలీల కోసం ఏపీ07టీడీ 3893 నంబరు బస్సు బయలుదేరింది. మార్గంమధ్యలో రూపెనగుంట్ల–దేచవరం గ్రామాల మధ్య సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకSసిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో కూలీలు ఎవరూ లేకపోవడం, డ్రైవర్ కూడా కిందకు దూకడంతో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంలో సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఆ టెక్స్‌టైల్స్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భాగస్వామి అని అధికారులు తెలిపారు.