custodians
-
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
ఏటీఎంల కేంద్రంగా భారీ స్కామ్స్
సాక్షి, సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాలు కస్టోడియన్లకు ‘కల్పతరువులుగా’ మారుతున్నాయి. వాటిలో నింపాల్సిన నగదును చాకచక్యంగా కాజేస్తున్నారు. ఈ తరహా ఫ్రాడ్స్ తెలుగు రాష్ట్రాల్లో తరచు వెలుగుచూస్తున్నాయి. ఒక్క నగరంలోనే గతంలో రూ. 14.46 కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సీఎంఎస్‌లో రూ. 2.6 కోట్లు, ఆర్సీఐ సంస్థలో రూ. 9.98 కోట్లు, ట్రాన్స్ ట్రెజర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 1.88 కోట్ల స్కామ్స్ చోటు చేసుకున్నాయి. తాజాగా బీటీఐ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన రూ. 1.23 కోట్ల స్కామ్ బయటపడింది. ఇలాంటి నేరాలు జరగడానికి వ్యవస్థాగతంగా ఉన్న చిన్న చిన్న లోపాలే కారణమని గుర్తించామని, వాటిని సరిదిద్దు కోవాలని కోరుతూ బ్యాంకులకు లేఖ రాస్తామని పోలీసులు గతంలో ప్రకటించారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాకోపోవడం గమనార్హం. ఏపీలోనూ రెండు ఉదంతాలు... హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. 2014లో నెల్లూరు కేంద్రంగా పని చేస్తే సంస్థలో రూ. 57 లక్షలు, 2015లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంస్థ నుంచి రూ. 31 లక్షల్ని ఏటీఎం మిషన్లలో నగదు నింపే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కస్టోడియన్లు కాజేశారు. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకు మాత్రం సంస్కరణలు పట్టించుకోవట్లేదని స్పష్టమవుతోంది. సీసీఎస్‌లో నమోదైన ‘ఆర్సీఐ’ ఫ్రాడ్‌లో కస్టోడియన్లతో పాటు ఏకంగా యాజమాన్యం పాత్ర సైతం వెలుగులోకి రావడంతో పోలీసులే ముక్కున వేలేసుకుటున్నారు. ఔట్సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే కాంట్రాక్టును ఆయా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా నడిపే ప్రైవేట్ సంస్థలకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకుంది. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన కేంద్రాల నుంచి రూ. కోట్లును సంస్థల వాహనాల్లో తరలించే టీమ్ సభ్యులు ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో డిపాజిట్ చేస్తుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు ఔట్సోర్సింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. సాంకేతికతకు ఆమడదూరం... ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది ఈ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్‌తో కూడిన ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్ చేస్తే కంప్యూటర్లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఎంత మేర డిపాజిట్ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు. అంతర్గత విచారణతో జాప్యం... ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు డ్యూటీ దిగిన తరవాత ఆయా సంస్థల ఉద్యోగులు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్ చేశామంటూ చెప్తున్న కస్టోడియన్లు ఏళ్ల పాటు గోల్మాల్ పాల్పడుతూ రూ. లక్షలు, రూ. కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్‌లో అసలు విషయం బయటకు వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గత విచారణ, చర్యల పేరుతో జాప్యం చేస్తున్నాయి. ఇవన్నీ జరిగిన తరవాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగానే అనేక అంశాల్లో దర్యాప్తు జఠిలంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు అనేక సంస్థాగతమైన లోపాలను గుర్తించారు. ఆ విధానాలు మారాల్సిందే.. ‘ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే అంశాలకు సంబంధించి ఆడిటింగ్ రెగ్యులర్‌గా జరగట్లేదు. మరోపక్క అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్ సైతం ఎప్పుడు, ఏ రూట్లో జరుగుతుంది అనేది కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు తెలిసిపోతోంది. ఈ లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. నగదు నింపే కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు ఆడిటింగ్ విషయం తెలియకూండా బ్యాంకులు నేరుగా జరపాలి. ఈ తనిఖీలు సైతం నిత్యం, ఆకస్మికంగా జరగాలి. అప్పుడే ‘ఏటీఎం ఫ్రాడ్స్’కు చెక్ చెప్పే ఆస్కారం ఉంటుంది. గతంలో చెప్పినా ఎవురూ పట్టించుకోలేదు. ఈసారి కీలక వివరాలన్నీ పొందుపరుస్తూ బ్యాంకులకు లేఖ రాయాలని భావిస్తున్నాం’ – పోలీసు అధికారులు -
ఏటీఎం మోసానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు
ఏటీఎంలో జమ చేయాల్సిన రూ. 10లక్షలు కాజేసిన కస్టోడియన్స్ ఆర్మూర్అర్బన్ : ఏటీఎంలలోని లొసుగులను ఆసరా చేసుకున్న ఇద్దరు కస్టోడియన్స్ రూ. 10 లక్షలను కాజేసిన సంఘటన ఆర్మూర్‌లో చోటు చేసుకుంది. వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో డబ్బులను జమ చేసే ఒక సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఈ మోసానికి పాల్పడ్డారు. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో సీతారాం వివరాలను వెల్లడించారు. నందిపేట్‌కు చెందిన చేపూర్ శ్రీకాంత్, మండలంలోని మంథనికి చెందిన గడ్డి లింబా ద్రి రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కస్టోడియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో డబ్బులను జమా చేయడం వీరి విధి. ఇందులో భాగంగా ఆర్మూర్‌లోని పిస మల్లన్న గుడి సమీపంలో గల రామ్‌నగర్ ఏటీఎంలో ఈనెల 7న రూ. 20 లక్షలు జమ చేయడానికి వచ్చారు. అనంతరం ఏటీఎంలో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకున్న ఇరువురు రూ. 10 లక్షలను మాత్రమే జమా చేసి రూ. 20 లక్ష లు జమా చేసినట్లుగా అందులో అంకెలను నిక్షిప్తం చేశారు. కాజేసిన రూ. 10 లక్షల నుంచి చెరో ఐదు లక్షలను పంచుకున్నారు. మళ్లీ ఇదే నెల 13న ఏటీఎంకు వచ్చి అందులో రూ. 10 లక్షలు మాత్ర మే ఉన్నాయని కంపెనీ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఏటీఎంకు చేరుకున్న మేనేజర్ రూ. 10 లక్షలు గల్లంతైన విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని ఈనెల 14న ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసు లు శుక్రవారం ఇద్దరిని ఏటీఎం వద్ద అ దుపులోకి తీసుకుని విచారించగా నేరా న్ని అంగీకరించారు. నిందితుల నుంచి రూ. 7 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. సమావేశం లో ఎస్సై సంతోష్ కుమార్, ఐడీ కానిస్టేబుళ్లు శ్రీను, రాములు పాల్గొన్నారు.