సాక్షి, సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాలు కస్టోడియన్లకు ‘కల్పతరువులుగా’ మారుతున్నాయి. వాటిలో నింపాల్సిన నగదును చాకచక్యంగా కాజేస్తున్నారు. ఈ తరహా ఫ్రాడ్స్ తెలుగు రాష్ట్రాల్లో తరచు వెలుగుచూస్తున్నాయి. ఒక్క నగరంలోనే గతంలో రూ. 14.46 కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సీఎంఎస్‌లో రూ. 2.6 కోట్లు, ఆర్సీఐ సంస్థలో రూ. 9.98 కోట్లు, ట్రాన్స్ ట్రెజర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 1.88 కోట్ల స్కామ్స్ చోటు చేసుకున్నాయి. తాజాగా బీటీఐ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన రూ. 1.23 కోట్ల స్కామ్ బయటపడింది. ఇలాంటి నేరాలు జరగడానికి వ్యవస్థాగతంగా ఉన్న చిన్న చిన్న లోపాలే కారణమని గుర్తించామని, వాటిని సరిదిద్దు కోవాలని కోరుతూ బ్యాంకులకు లేఖ రాస్తామని పోలీసులు గతంలో ప్రకటించారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాకోపోవడం గమనార్హం.
ఏపీలోనూ రెండు ఉదంతాలు...
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. 2014లో నెల్లూరు కేంద్రంగా పని చేస్తే సంస్థలో రూ. 57 లక్షలు, 2015లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంస్థ నుంచి రూ. 31 లక్షల్ని ఏటీఎం మిషన్లలో నగదు నింపే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కస్టోడియన్లు కాజేశారు. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకు మాత్రం సంస్కరణలు పట్టించుకోవట్లేదని స్పష్టమవుతోంది. సీసీఎస్‌లో నమోదైన ‘ఆర్సీఐ’ ఫ్రాడ్‌లో కస్టోడియన్లతో పాటు ఏకంగా యాజమాన్యం పాత్ర సైతం వెలుగులోకి రావడంతో పోలీసులే ముక్కున వేలేసుకుటున్నారు.
ఔట్‌సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ...
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే కాంట్రాక్టును ఆయా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా నడిపే ప్రైవేట్ సంస్థలకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకుంది. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన కేంద్రాల నుంచి రూ. కోట్లును సంస్థల వాహనాల్లో తరలించే టీమ్ సభ్యులు ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో డిపాజిట్ చేస్తుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు ఔట్‌సోర్సింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి.
సాంకేతికతకు ఆమడదూరం...
ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది ఈ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్‌తో కూడిన ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్ చేస్తే కంప్యూటర్‌లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్‌లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఎంత మేర డిపాజిట్ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు.
అంతర్గత విచారణతో జాప్యం...
ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు డ్యూటీ దిగిన తరవాత ఆయా సంస్థల ఉద్యోగులు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్ చేశామంటూ చెప్తున్న కస్టోడియన్లు ఏళ్ల పాటు గోల్‌మాల్ పాల్పడుతూ రూ. లక్షలు, రూ. కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్‌లో అసలు విషయం బయటకు వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గత విచారణ, చర్యల పేరుతో జాప్యం చేస్తున్నాయి. ఇవన్నీ జరిగిన తరవాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగానే అనేక అంశాల్లో దర్యాప్తు జఠిలంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు అనేక సంస్థాగతమైన లోపాలను గుర్తించారు.
ఆ విధానాలు మారాల్సిందే..
‘ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే అంశాలకు సంబంధించి ఆడిటింగ్ రెగ్యులర్‌గా జరగట్లేదు. మరోపక్క అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్ సైతం ఎప్పుడు, ఏ రూట్‌లో జరుగుతుంది అనేది కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు తెలిసిపోతోంది. ఈ లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. నగదు నింపే కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలకు ఆడిటింగ్ విషయం తెలియకూండా బ్యాంకులు నేరుగా జరపాలి. ఈ తనిఖీలు సైతం నిత్యం, ఆకస్మికంగా జరగాలి. అప్పుడే ‘ఏటీఎం ఫ్రాడ్స్’కు చెక్ చెప్పే ఆస్కారం ఉంటుంది. గతంలో చెప్పినా ఎవురూ పట్టించుకోలేదు. ఈసారి కీలక వివరాలన్నీ పొందుపరుస్తూ బ్యాంకులకు లేఖ రాయాలని భావిస్తున్నాం’ – పోలీసు అధికారులు
Comments
Please login to add a commentAdd a comment