ఫిట్‌నెస్ ట్రాకర్‌గా పనిచేసే స్మార్ట్ రింగ్‌ను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్ భారతదేశంలో విడుదల చేసింది. చేతి వేళ్లకు ధరించగలిగేలా తయారు చేసిన రింగ్ యూజర్ల బయోమెట్రిక్స్, రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్‌ను పర్యవేక్షిస్తుంది.
ఈ స్మార్ట్ రింగ్ నీరు, చెమట నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వ్యాయామ సెషన్‌లు లేదా నీళ్లలో యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా ధరించవచ్చు. స్టెప్ కౌంట్, నడిచిన దూరం, కేలరీలు ఎంత మేర కరిగాయి, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలతో సహా అనేక రకాల ఆరోగ్య కొలమానాలను ఈ స్మార్ట్ రింగ్ ట్రాక్ చేస్తుంది.
ఇందులో బాడీ రికవరీ ట్రాకింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ బీట్ వేరియబిలిటీ అనాలిసిస్‌తో పాటు ఓవరాల్ యాక్టివిటీ రికార్డులను ఉపయోగించి యూజర్ల మొత్తం ఆరోగ్య స్థితి గురించి తెలియజేస్తుంది. శారీరక శ్రమను ట్రాక్ చేయడంతో పాటు నిద్రను కూడా ఈ స్మార్ట్ రింగ్ పర్యవేక్షిస్తుంది. మొత్తం నిద్ర వ్యవధి, వివిధ నిద్ర దశలలో గడిపిన సమయం సంభావ్య నిద్ర భంగం వంటి అంశాలను కవర్ చేస్తూ సమగ్ర స్లీప్ డేటాను అందిస్తుంది.
ఇక రుతుక్రమం ఉన్న మహిళల కోసం రుతు చక్రాలను ట్రాక్ చేసే, అంచనా వేసే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ సమాచారాన్ని నేరుగా యూజర్ల ఫోన్‌కు నోటిఫికేషన్‌లు, రిమైండర్ రూపంలో అందిస్తుంది. ఈ మొత్తం డేటా బోట్ రింగ్ యాప్‌లో స్టోర్ అవుతుంది. దీంతో యూజర్లు తమ ఆరోగ్య ప్రమాణాలను, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. అయితే ఈ స్మార్ట్ ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని బోట్ సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment