ముంబై: ఉద్యోగ మార్కెట్‌పై జూన్ త్రైమాసికం(క్యూ1)లో ద్రవ్యోల్బణ ప్రభావం ఏమీ లేదని ఇండీడ్ ఇండియా క్వార్టర్లీ హైరింగ్ ట్రాకర్ నివేదిక తెలిపింది. తమ నియామకాలు, ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం ప్రభావం లేదని 89 శాతం కంపెనీలు చెప్పాయి. ఉద్యోగార్థుల్లో ప్రతి 10 మందికి గాను ఆరుగురు తమపై ద్రవ్యోల్బణ ప్రభావం లేదని చెప్పినట్టు ఇండీడ్ తన నివేదికలో తెలిపింది. 1,229 ఉద్యోగ సంస్థలు, 1,508 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఇండీడ్ పరిగణనలోకి తీసుకుంది.
ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీల ఉద్యోగ నియామకాల్లో 29 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం మార్చి త్రైమాసికంలో వృద్ధి 20 శాతాన్ని మించింది. 37 శాతం మంది ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం చూడడం లేదంటే సంస్థను మార్చాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మార్చి త్రైమాసికంలో 46 శాతంగా ఉంది. ఐటీ, హెల్త్‌కేర్, ఈకామర్స్ ఇక ముందూ వృద్ధిని చూపిస్తాయని.. 5జీ రాకతో రానున్న త్రైమాసికాల్లో టెలికంలోనూ ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని ఇండీడ్ నివేదిక అంచనా వేసింది.
ఫుల్‌టైమ్ కోరుకునే వారు 63 శాతం మంది
ఉద్యోగాలు కోరుకునే వారిలో 63 శాతం మంది ఫుల్‌టైమ్ పనికోసం చూస్తున్నారు. పార్ట్‌టైమ్ పనిని కోరుకునే వారు 26 శాతంగానే ఉన్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగాల కోసం చూస్తున్నవారు 11 శాతంగా ఉన్నారు. జూన్ త్రైమాసికంలో 19 శాతం కంపెనీలు కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ రంగం ఎక్కువ మందికి ఉపాధినిచ్చింది. ఈ రంగంలో 91 శాతం కంపెనీలు జూన్ క్వార్టర్‌లో నియమకాలు చేపట్టాయి. మార్చి త్రైమాసికంలో 83 శాతం కంపెనీలే నియామకాలు చేపట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment