ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ యువకుడు మృతి చెందాడు. సౌదీ అరేబియాలోని రబ్ అల్ ఖలీ అనే ఎడారిలో చిక్కుకుని 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఎడారిలో దారితప్పి..ఎటు వెళ్లాలో తెలియక.. మరోవైపు తాగేందుకు నీరు, తినేందుకు ఆహరం లేక ఐదు రోజులుపాటు నరకయాతన అనుభవించి అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు.
వివరాల్లోకెళ్తే..కరీంనగర్‌కి చెంఇన 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్ సక్రమంగా పనిచేయలేదు.
జీపీఎస్ పనిచేయకపోవడంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రుబా అల్ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్ అయిపోయింది. తాము దారితప్పామనే విషయం మేనేజ్‌మెంట్‌కు చెబుదామన్నా కూడా ఇద్దరి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అయ్యాయి. నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న రుబా అల్ ఖలీ ఎడారిని అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా చెబుతుంటారు.
దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్ ఖాన్, అతని సహచరుడు అనుకున్నప్పటికీ.. ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు.
సర్వీస్ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో వారి వాహనం పక్కనే విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
(చదవండి: వైద్యుడి రూపంలోని రాక్షసుడు)
Comments
Please login to add a commentAdd a comment