ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్
శ్రీహరికోట(సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) భవిష్యత్తు అంతా భారీ ప్రయోగాల మీదే దృష్టి పెట్టిందని, దీనికి ఇస్రో పనిచేసే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన వారికి షార్‌లోని ఎంఆర్ కురూప్ ఆడిటోరియంలో ఇస్రో ప్రతిభా పురస్కారాలను మంగళవారం సంస్థ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ అందజేశారు. 2010, 2011 సంవత్సరాల్లో నిర్వహించిన పలు ప్రాజెక్టుల్లో అత్యంత ప్రతిభా పాఠవాలను చూపించడమే కాకుండా క్లిష్టమైన వ్యవస్థలను రూపొందించిన శాస్త్రవేత్తలకు, వారి సహాయకులకు, సాంకేతిక నిపుణులకు 110 మందికి ఇస్రో ప్రతిభా పురస్కారాలను అందజేశారు.
షార్‌లో న్యూ మిషన్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం, భారీగా ద్రవ ఇంధనాన్ని నిల్వచేసే వసతులు, నూతన వాహకనౌక ఎల్‌వీఎం-3 అనుసంధానం, భూ అనువాద పరీక్షలు, సూర్యగ్రహణంపై పరిశోధన మొదలగు క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో పాలు పంచుకున్న చిరుద్యోగుల నుంచి ప్రముఖ శాస్త్రవేత్తల వరకు ఈ పురస్కారాలను అందుకున్నారు. షార్ అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, వ్యాస్ట్ డిప్యూటీ డెరైక్టర్ టీ సుబ్బారెడ్డి లాంటి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న వారు శాస్త్రవేత్తలైనా, చిరుద్యోగి అయినా సమానమేనన్నారు. షార్‌లో ఇక నుంచి సంవత్సరానికి 10 నుంచి 12 ప్రయోగాలు దాకా చేయాల్సి ఉంటుంది కాబట్టి, అందరూ దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో షార్ డెరైక్టర్ పీ కున్హికృష్ణన్, షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, గ్రూపు డెరైక్టర్ పీ విజయసారధి, విశ్వనాథ శర్మ పాల్గొన్నారు.
భారీ ప్రయోగాలకు సిద్ధం కావాలి
Published Wed, Aug 5 2015 4:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement