సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను రెండోసారి విజయవంతంగా పరీక్షించడం ద్వారా.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్‌ల తర్వాత.. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ సామర్థ్యం సాధించిన దేశంగా గత ఏడాదే నిలిచిన భారత్ తాజా ప్రయోగంతో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ విజయం వచ్చే ఏడాది ప్రయోగించనున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3కి మరింత ఊతమివ్వనుంది. మార్క్ 3 రాకెట్‌తో నాలుగు టన్నుల కంటే ఎక్కువ బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం లభిస్తుంది.
ఇస్రో 17 ఏళ్ల కృషి..: రెండు టన్నుల కన్నా అధిక బరువు గల భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపించటానికి క్రయోజనిక్ ఇంజన్లు కీలకమైనవి. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ల విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల దశాబ్దాల శ్రమ ఉంది. 1990 ప్రాంతంలో అమెరికా ఆంక్షల కారణంగా ఈ సంక్లిష్టమైన టెక్నాలజీ మనకు అందకుండా పోయింది. అగ్రరాజ్యం ఒత్తిళ్లకు తలొగ్గిన రష్యా తయారీ టెక్నాలజీ బదలాయింపునకు చేసుకున్న ఒప్పందాన్ని కూడా కాదని ఏడు ఇంజన్లను అందించి చేతులు దులుపుకుంది.
అప్పటి నుంచే ఈ ఇంజన్లను సొంతంగా తయారుచేసుకోవాలని ఇస్రో శాస్త్రవేత్తలు సంకల్పించా రు. 1994లో మొదలైన ఈ ప్రాజెక్టు 2010 నాటికి తొలి పరీక్షకు సిద్ధమైంది. అప్పుడు జీఎస్‌ఎల్‌వీ డీ3లో ఉపయోగించిన తొలి దేశీ క్రయోజనిక్ ఇంజన్ అసలు మండలేదు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు ఇస్రో ఎంతో కృషి చేసింది. శాస్త్రవేత్తలు ఎంతో పట్టుదలతో 37 రకాల పరీక్షలు నిర్వహించి క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేశారు.
నాలుగేళ్ల తర్వాత 2014 జనవరి 5న జీఎస్‌ఎల్‌వీ-డీ5 ద్వారా స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను ఇస్రో దిగ్విజయంగా వినియోగించింది. మళ్లీ ఇప్పుడు స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను వినియోగించి చేసిన ప్రయోగం కూడా సఫలమవటంతో.. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై భారత్ పూర్తిపట్టు సాధించినట్లేనని భావిస్తున్నారు.
సంక్లిష్టమైన టెక్నాలజీ..: అంతరిక్ష ప్రయోగాలకు టన్నుల కొద్దీ ఇంధనం అవసరమవుతుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తిని పొందేందుకు క్రయోజనిక్ ఇంజన్లు మేలైనవి. కానీ ఈ టెక్నాలజీ చాలా సంక్లిష్టమైంది. రాకెట్ ఇంధనాలుగా వాడే హైడ్రోజన్ మైనస్ 253, ఆక్సిజన్ మైనస్ 183 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవరూపంలోకి మారతాయి. ఇంతటి అత్యంత శీతలమైన స్థితిలో వీటిని నిల్వ చేయడం, ఇంజన్లలో వాడటం కత్తిమీద సామే. రాకెట్‌లోని ఇతర ఇంజన్ల నుంచి వెలువడే వేడి దీన్ని తాకకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అమెరికా 1969లోనే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని చంద్రుడిపైకి ప్రయోగించిన రాకెట్‌లో ఉపయోగించింది.
ఇక భారీ ప్రయోగాలే లక్ష్యం
వాణిజ్యపరంగా ముందంజ: ఇస్రో చైర్మన్
సూళ్లూరుపేట: క్రయోజనిక్ ఇంజన్ రెండోసారి విజయవంతం కావడం తో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా వాణిజ్య ప్రయోగాలు చేయడానికి మార్గం సుగమం అయిందని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. జీఎస్‌ఎల్ వీ డి6 ప్రయోగం తరువాత విలేకరులతో మాట్లాడుతూ అమెరికాఅంతరిక్ష సంస్థ ఆంట్రిక్స్ కార్పొరేషన్‌తో 20 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో ఒప్పందం చేసుకుందన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ30 ద్వారా 4 నాసా ఉపగ్రహాలను పంపనున్నామన్నారు. క్రయోజనిక్ దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ జీఎస్‌ఎల్‌వీ మార్క్4 ద్వారా నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని పంపే స్థాయికి పెంచుతామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రోశాట్, డిసెంబర్‌లో సింగపూర్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలతో పాటు 2016 మార్చిలోఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో 3 ఉపగ్రహాలను ప్రయోగిస్తామన్నారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 ప్రయోగానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.
రెండో విజయం
Published Fri, Aug 28 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM
Advertisement
Advertisement