satellite launch
-
ఎస్ఎస్ఎల్వీ డీ–3 ప్రయోగం నేడే
సూళ్లూరుపేట/తిరుమల: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3) ప్రయోగించేందుకు సిద్ధమైంది. ప్రయోగాన్ని 16.56 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తి చేసే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్న మయ్యారు.ఏదైనా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ సమయం కొద్దిగా మార్పు చేసే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. మధ్యా హ్నం ఒంటి గంటకు మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి ఏడు గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.17 కౌంట్ డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ ఏడు గంటల కౌంట్ డౌన్ ప్రక్రియలో నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపడంతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారన్నమాట. అయితే ఈ ప్రయోగంలో మూడు దశలూ ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. దీనికి కౌంట్‌డౌన్ సమయాన్ని అతికొద్ది గంటలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ప్రయోగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ వివరాలు.. ప్రయోగమిలా..ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ 34 మీటర్లు పొడువు రెండు మీటర్లు వెడల్పు 119 టన్నుల బరువుతో నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాన్ని 16 (994 సెకన్లు) నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లకు పూర్తి చేయనున్నారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లకు, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లకు పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 808 సెకన్లకు 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ) ఈఓఎస్–08) మొదటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఎస్ఆర్–0 డెమోశాట్ అనే ఉపగ్రహాన్ని 994 సెకన్లు భూమికి 475 కిలో మీటర్లు ఎత్తులోని లియో అర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తి చేసేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. కౌంట్‌డౌన్ వ్యవధి తక్కువ..ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్‌కు కౌంట్‌డౌన్ సమయాన్ని తక్కువగా అంటే ఏడు గంటల వ్యవ«ధి మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాకెట్ మొదటి మూడు దశలు ఘన ఇంధనాన్ని ఉపయోగించి చేయనున్నారు. అంటే ఘన ఇంధనాన్ని ముందుగానే నింపి రాకెట్‌ను అనుసంధానం చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపేందుకు మాత్రమే కౌంట్‌డౌన్ సమయాన్ని తీసుకున్నారు. ఈ ప్రయోగంలో నాలుగోదశలో 0.05 టన్నులు మాత్రమే ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నారు. అందుకే ఏడు గంటల కౌంట్‌డౌన్ సమయం వ్యవధిలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి ఈ తక్కువ సమయాన్ని తీసుకున్నారు. ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగమిది. షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగం కావడం విశేషం. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలుతిరుమల శ్రీవారి సన్నిధిలో ఎస్ఎస్ఎల్వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలకు ఇస్రో అధికారులు గురువారం ప్రత్యేక పూజలు చేయించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోదతో కలసి శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా
వాషింగ్టన్: శత్రుదేశాలైన అమెరికా, రష్యా అంతరిక్ష యుద్ధానికి తెరతీస్తున్నాయా? ఇప్పటి పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. రష్యా అంతరిక్ష సంస్థ ఈ నెల 16న భూదిగువ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ మంగళవారం చెప్పారు. ఇది అంతరిక్షంలోని ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం కలదని వెల్లడించారు. ఇప్పటికే అదే కక్ష్యలో ఉన్న తమ ప్రభుత్వ ఉపగ్రహం ’యూఎస్ఏ 314’ను దెబ్బతీయడానికే రష్యా ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు. దీనిపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా స్పందించారు. ఈ నెల 17న సోయుజ్–2.1బీ వాహక నౌక ద్వారా ‘కాస్మోస్ 2576’ ప్రయోగించిన మాట నిజమేనని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అమెరికా ఉపగ్రహం, రష్యా తాజాగా ప్రయోగించిన ఉపగ్రహం ఒకే కక్ష్యలో ఉన్నాయని అంతరిక్ష నిపుణులు చెప్పారు. ఉక్రెయిన్ సైన్యానికి సహకరించే అమెరికా శాటిలైట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని రష్యా ఇటీవలే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశో«ధనలే లక్ష్యంగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగవేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి వున్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? ► ఆదిత్య–ఎల్1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది. ఆదిత్య–ఎల్1లో పేలోడ్స్ ఇవే.. సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) ఉంటాయి. -
మన ఉపగ్రహం మీద ఎవరో నిఘా పెట్టి ఇలా చేస్తున్నారేమోననిపిస్తోంది సార్!
మన ఉపగ్రహం మీద ఎవరో నిఘా పెట్టి ఇలా చేస్తున్నారేమోననిపిస్తోంది సార్! -
మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
వాషింగ్టన్: చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు మళ్లింది. ప్రపంచ దేశాలు భారత్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నాసా-ఇస్రో SAR (NISAR) ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రో చేతులకు అప్పజెప్పింది నాసా. భూమి యొక్క కక్ష్యను పరిశీలించే నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో దీనికి తుది మెరుగులు దిద్దుతోంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, NISAR 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి తాత్కాలికమైనా కూడా స్థిరమైన సమాచారాన్ని అందిస్తుంది. NISAR L, S డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చ్యుర్ రాడార్ (SAR)ని కలిగి ఉంటుంది. ఇందులో L బ్యాండ్ SARను కాలిఫోర్నియా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ డెవలప్ చేయగా S బ్యాండ్ SARను మాత్రం ISRO అభివృద్ధి చేసింది. ఇది స్వీప్ SAR టెక్నిక్‌తో పనిచేస్తూ హై రిజొల్యూషన్ డేటాను అందిస్తుంది. SAR పేలోడ్లు ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ (ఐరిస్)పై అమర్చబడ్డాయి. SUV-పరిమాణంలో ఉండే పేలోడ్‌ను ప్రత్యేక కార్గో కంటైనర్‌లో బెంగళూరుకు తరలించినట్లు యూఎస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. బెంగళూరులోని యూ.ఆర్.రావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహం తుదిమెరుగులు దిద్దుకుని 2024లో ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రణాళిక రూపొందించింది నాసా. Touchdown in Bengaluru! @ISRO receives NISAR (@NASA-ISRO Synthetic Aperture Radar) on a @USAirforce C-17 from @NASAJPL in California, setting the stage for final integration of the Earth observation satellite, a true symbol of #USIndia civil space collaboration. #USIndiaTogether pic.twitter.com/l0a5pa1uxV — U.S. Consulate General Chennai (@USAndChennai) March 8, 2023 ఇది కూడా చదవండి:ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు! -
ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
సియోల్: ఉత్తరకొరియా రెండో సారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత మేలో చేపట్టిన నిఘా ఉపగ్రహం మొదటి ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్లే గురువారం పసిఫిక్ సముద్ర జలాల్లో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే చొల్లిమ–1 రాకెట్ కూలిందని వివరించింది. వచ్చే అక్టోబర్‌లో మూడోసారి మరింత మెరుగ్గా ఈ ప్రయోగం చేపడతామని ఉత్తరకొరియా గురువారం ప్రకటించింది. ఈ ప్రయోగం కారణంగా జపాన్ ప్రభుత్వం ఒకినావా దీవుల్లోని తన ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తరకొరియాలోని తొంగ్చాంగ్–రి తీరం నుంచి గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణకొరియా మిలటరీ తెలిపింది. -
ISRO PSLV-C56: ఇస్రో మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక ఆదివారం ఉదయం 6.31 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాదిలో ఇస్రో మూడో వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీనిని ప్రయోగించాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో చేపట్టిన 58 ప్రయోగాల్లో ఇది 56వ విజయం కావడం గమన్హాం. పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌కు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 6.31 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 23 నిమిషాల వ్యవధిలో (1,381 సెకన్లకు) సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులోని నియో ఆర్బిట్ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 352 కిలోలు బరువు కలిగిన డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కేడ్, 23 కేజీల బరువున్న వెలాక్స్–ఏఎం, 12.8 కిలోల ఓఆర్బీ–12 స్ట్రయిడర్, 3.84 కేజీల గలాసియా–2, 4.1 కేజీల స్కూబ్–11, 3.05 కేజీల బరువైన న్యూలయన్ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. షార్ నుంచి చేసిన 90వ ప్రయోగమిది. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్–4 అక్కడ నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాల తదుపరి చెత్త తగ్గుతుంది. ఒకవేళ 530కి.మీ.ల ఎత్తులోనే ఉంటే కింది కక్ష్యలకు వచ్చి పడిపోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇప్పుడు కిందిస్థాయిలోనే ఉంది కనుక కేవలం రెండునెలల్లో పడిపోతుంది. ఆ కీలక భాగాల తయారీదారు హైదరాబాద్ సంస్థే పీఎస్ఎల్వీ సి–56లోని కీలక భాగాలు, వ్యవస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏటీఎల్) రూపొందించినవే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. పీఎస్ఎల్వీ సి–56 లాంఛ్ వెహికల్లో వాడిన నావిగేషన్ ఇంటర్ఫేస్ మాడ్యూళ్లు, ఇనెర్షియల్ సెన్సింగ్ యూనిట్లు, ఇంట్రా మాడ్యూల్ హార్నెస్, కంట్రోల్ ఎల్రక్టానిక్స్, పైరో కంట్రోల్ సిస్టమ్స్, ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్, ఇంధన వ్యవస్థల రూపకల్పనలో తమ సంస్థ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. ఇస్రో లాంఛ్ వెహికల్స్, శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్ పేలోడ్స్, గ్రౌండ్ సిస్టమ్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పీఎస్ఎల్వీ సి–56తో కలిపి ఇప్పటి వరకు అయిదు పీఎస్ఎల్వీ మిషన్లలో అత్యంత కీలకమైన సబ్ అసెంబ్లీ ప్రక్రియను ఏటీఎల్ నిపుణులు చేపట్టినట్లు వివరించారు. -
30న పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఈనెల 23న నిర్వహింయాల్సి ఉంది. చంద్రయాన్–3 మిషన్‌ను లూనార్ ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియలో ఇస్రో శాస్త్రవేత్తలంతా నిమగ్నమై ఉండడంతో ఈ ప్రయోగాన్ని 30కి పొడిగించారు. ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 351 కిలోల డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్–ఏఎం, 12.8 కిలోలు బరువు కలిగిన ఓఆర్బీ–12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్–11, 3.05 కేజీల నులయన్ అనే ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైంది కావడం విశేషం. -
స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయివేట్ సంస్థలకు..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇటీవలే అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు అప్పగించేందుకు ఆ సంస్థలకు ఆహ్వానం పలుకుతోంది. ప్రపంచ మార్కెట్లో చిన్న తరహా ఉపగ్రహాలకు వాణిజ్యపరంగా మంచి డిమాండ్ ఉండటంతో భూమికి అతి తక్కువ దూరంలో, అంటే లియో ఆర్బిట్‌లోకి వాటిని పంపేందుకు ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌కు రూపకల్పన చేశారు. ప్రపంచంలో అంతరిక్ష కేంద్రాలు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి దేశాలకు భారతదేశం అతి తక్కువ ధరకే చిన్న తరహా ఉపగ్రహ ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల దాకా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాల కోసమే ఎస్ఎస్ఎల్వీ రాకెట్లతో పాటు ప్రయోగ కేంద్రాన్ని కూడా తమిళనాడులో కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్నారు. ఇస్రో రూపొందించిన ఆరు రకాల రాకెట్ సిరీస్‌లలో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ మాత్రమే ప్రయివేట్ సంస్థలకు అప్పగించబోతున్నారన్న మాట. -
వన్‌వెబ్ మరోసారి ప్రయోగం
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్స్ రంగ కంపెనీ వన్‌వెబ్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో (ఇస్రో) కలిసి 36 ఉపగ్రహాలను మార్చి 26న ప్రయోగించనుంది. భూమికి తక్కువ కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్) వీటిని పంపుతారు. జూలై–ఆగస్ట్ నాటికి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధమని వన్‌వెబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఫిబ్రవరిలో వెల్లడించారు. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి కంపెనీకి లైసెన్స్ దక్కింది. అయితే ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించాల్సి ఉంది. ‘శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవి నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. వన్‌వెబ్ ఇప్పటికే 17సార్లు ఉపగ్రహాలను పంపింది. ఈ ఏడాది మూడవ పర్యాయం ప్రయోగిస్తోంది. మొదటి తరం లో ఎర్త్ ఆరిŠబ్ట్ (లియో) కూటమిని పూర్తి చేసి 2023లో కంపెనీ అంతర్జాతీయంగా కవరేజీని ప్రారంభించేందుకు ఈ ప్రయోగం వీలు కల్పిస్తుంది. కంపెనీ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి’ అని వన్‌వెబ్ తెలిపింది. -
వన్‌వెబ్ 40 ఉపగ్రహాల ప్రయోగం..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్‌వెబ్ తాజా స్పేస్ఎక్స్తో కలిసి 40 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని ప్రయోగించినట్లు వివరించింది. దీంతో తాము మొత్తం 582 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లయిందని పేర్కొంది. కనెక్టివిటీ సామర్థ్యాలను పెంచుకోవడంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయని వన్‌వెబ్ సీఈవో నీల్ మాస్టర్సన్ తెలిపారు. -
26న పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 26న ఉదయం 11.56 గంటలకు తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ54) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 960 కేజీల బరువు కలిగిన ఓషన్‌శాట్–3 (ఈవోఎస్–06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపనున్నారు. భారత్‌కే చెందిన తైబోల్ట్–1, తైబోల్ట్–2, ఆనంద్, ఇండియా–భూటాన్ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్ఎస్–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్ –2 పేరుతో 4 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. -
ఇక... వాణిజ్య గ‘ఘనమే’!
వినువీధిలో మరో విజయం దక్కింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అత్యంత బరువైన రాకెట్‌ను ఆదివారం నాడు విజయవంతంగా గగనతలంలోకి పంపి, మరో మైలురాయిని చేరుకుంది. ‘జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3’ (జీఎస్ఎల్వీ ఎంకే 3) రాకెట్‌తో దాదాపు 6 టన్నుల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ‘ఎల్వీఎం3– ఎం2’ అని కూడా ప్రస్తావించే ఈ రాకెట్ ఏకంగా 36 ఉపగ్రహాలతో ఇంత బరువును విహాయసంలోకి తీసుకువెళ్ళడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. విజయవంతమైన ఈ ప్రయోగం మన అత్యాధునిక ఉపగ్రహ వాహక నౌక ‘ఎల్వీఎం3’ రాకెట్ ఆచరణీయతను మరోసారి ధ్రువీకరించింది. ఆసక్తితో చూస్తున్న ‘గగన్‌యాన్’ లాంటి వాటికి ఆ రాకెట్ అన్ని విధాలా తగినదని తేల్చిచెప్పింది. అంతేకాక, భారీ ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించిన విపణిలో ఇస్రో బలమైన అభ్యర్థి అని చాటిచెప్పింది. ఈ పరిణామం అభినందనీయం. అందుకు అనేక కారణాలున్నాయి. భారత అంతరిక్ష విభాగ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలను చేపడుతోంది. ఆ ప్రయోగాలకు అంకితమైన రాకెట్ – ‘ఎల్వీఎం3’. 2017లో ఈ రాకెట్‌ను తొలిసారి ప్రయోగించారు. అప్పటి నుంచి మన దేశ కమ్యూనికేషన్ ఉపగ్రహాలనూ, ఇతర పేలోడ్లనూ నాలుగు సార్లు విజయవంతంగా వినువీధిలోకి పంపిన ఘనత ఈ రాకెట్ది. ఇప్పుడు తొలిసారిగా విదేశీ పేలోడ్‌ను వినువీధిలోకి పంపడానికి దీన్ని వినియోగించారు. జయకేతనం ఎగరే సిన ఈ రాకెట్ మనకు అందివచ్చిన అవకాశం. ఒకేసారి ఉపగ్రహాల్ని ఒక మండలంగా ప్రయోగిస్తూ పలు సంస్థల అవసరాల్ని తీర్చి, అంతర్జాతీయ విపణిలో ఆ ఖాళీ భర్తీకి ఇది ఉపకరిస్తుంది. నిజానికి, అక్టోబర్ 23 నాటి ఈ అంతరిక్ష ప్రయోగం ఎన్ఎస్ఐఎల్కూ, బ్రిటన్‌కు చెందిన ‘వన్ వెబ్’కూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగం. భారతీ గ్లోబల్ భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ వన్ వెబ్‌కు దిగువ భూకక్ష్య (ఎల్ఈఓ)లో పలు ఉపగ్రహాలు అవసరం. ఆ అవసరాన్ని ఇస్రో ఇలా తీరుస్తోంది. తాజా 36 ఉపగ్రహాలు కాక, మరో 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను రెండో విడతగా 2023లో ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఇలా రెండు ప్రయోగాలతో మొత్తం 72 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి ఆ సంస్థ మన ఇస్రోకు రూ. 1000 కోట్లు చెల్లించింది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచవ్యాప్త టెలీకమ్యూనికేషన్లలో హైస్పీడ్ కనెక్టివిటీని అందించాలని వన్‌వెబ్ లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు మొత్తం 648 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపాలని సిద్ధమైంది. ఇప్పటికి 462 పంపగలిగింది. తాజా ప్రయోగంలో ఓ తిరకాసుంది. ప్రతి రెంటికీ మధ్య కనీసం 137 మీటర్ల దూరం ఉండేలా మొత్తం 36 ఉపగ్రహాలనూ 601 కి.మీ. కక్ష్యలో అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టాలి. వన్‌వెబ్‌కు ఉన్న ఈ అవసరాన్ని అతి సమర్థంగా నెరవేర్చడం ఇస్రో సాధించిన ఘనత. థ్రస్టర్లను ఉపయోగించి, క్రయో దశలోనే పదే పదే దిశానిర్దేశంతో, ఈ విన్యాసాన్ని ఇస్రో చేసిచూపింది. ఇస్రోకు మరిన్ని వాణిజ్య ఒప్పందాలు రావాలంటే – ఇప్పటి ప్రయోగం, అలాగే వచ్చే ఏటి రెండో విడత ప్రయోగం సక్సెస్ కావడం కీలకం. తాజా విజయం మన అంతరిక్ష ప్రయోగ సామర్థ్యానికి మరో మచ్చుతునక. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల గిరాకీకి తగ్గట్టు మన ఉపగ్రహ వాహక జవనాశ్వమైన ఎల్వీఎం3 రాకెట్ల తయారీని వేగవంతం చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. అసలు ఇలా ఒకేసారి ఉపగ్రహ మండలంగా పలు ఉపగ్రహాలను ఒకే కక్ష్యలోకి వాణిజ్యపరంగా పంపే వాహక నౌకల కొరత అంతర్జాతీయంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆ ఉపగ్రహా లను రక్షణ ప్రయోజనాలకు వాడబోమని హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టి, రష్యా ఈ వన్ వెబ్ అవకాశం వదులుకుంది. చైనా రాకెట్ల వాణిజ్య సత్తాను పాశ్చాత్యలోకంం అంగీకరించదు. ఫ్రాన్స్‌లో వీటి అభివృద్ధి ఆలస్యమైంది. ఇవన్నీ మనకు కలిసొచ్చాయి. ప్రస్తుతం అంతరిక్ష వాణిజ్య విపణిలో అంతర్జాతీయంగా భారత వాటా 2 శాతమే. తాజా ప్రయోగ విజయంతో దాన్ని గణనీయంగా పెంచుకొనే వీలు చిక్కింది. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో వద్ద పీఎస్ఎల్వీ మాత్రమే ఉంది. తాజా ఎల్వీఎం3–ఎం2 రాకెట్‌తో రెండో అస్త్రం చేరింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రాకెట్ ‘చంద్రయాన్–2’ సహా 4 ప్రయోగాల్ని సక్సెస్ చేసింది. మనిషిని విహాయసంలో విహరింపజేసే ‘గగన్‌యాన్’కూ దీన్నే స్వల్ప మార్పులతో సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏటి ‘చంద్రయాన్–3’కీ, సూర్య గ్రహ అధ్యయనమైన ‘ఆదిత్య ఎల్1’కూ సన్నాహాలు సాగుతుండడం గర్వకారణం. రాబోయే రోజుల్లో ఉపగ్రహ సేవలనేవి అతి పెద్ద వ్యాపారం. 5జీ వస్తున్నవేళ టెలికామ్ సేవలకు కీలకమైన ఎల్ఈఓ ఉపగ్రహాలను గగనంలోకి పంపే విపణిలో ఆటగాడిగా మనం అవతరించడం శుభసూచకం. మనకూ ఉపయుక్తం. ఇదే ఊపు కొనసాగితే వచ్చే 2025 కల్లా మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 1300 కోట్ల డాలర్ల (రూ.1.07 లక్షల కోట్ల) ఆదాయాన్ని అందుకుంటుందట. ఉపగ్రహ సేవల విపణి 500 కోట్ల డాలర్లకూ, గ్రౌండ్ సేవలు 400 కోట్ల డాలర్లకూ చేరుకుంటాయని లెక్క. వెరసి, రాగల మూడేళ్ళలో ఉపగ్రహ, ప్రయోగ సేవల్లో మనం మునుపెన్నడూ లేనట్టు 13 శాతం అత్యధిక వార్షిక వృద్ధి రేటు సాధిస్తామన్న మాట ఈ ఆనందానికి మరిన్ని రెక్కలు తొడుగుతోంది. దేశీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం శ్రీకారం చుట్టుకుంది. అంతరిక్ష వాణిజ్య సేవల రంగంలో దేశంలో రానున్న పెనుమార్పులకు స్వాగతం... శుభ స్వాగతం! -
ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగంలో సందిగ్ధత
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. మూడో దశ తర్వాత ఈవోఎస్-2, ఆజాదీ ఉపగ్రహాలను రాకెట్ వదిలింది. సాంకేతిక లోపం కారణంగా ఉపగ్రహాల నుంచి కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ అందడం లేదని శాస్త్తవేత్తలు తెలిపారు. మూడు దశల ప్రయోగాలు పూర్తయ్యాయని.. నాలుగో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. తుది దశ సమాచార సేకరణలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది. చదవండి: ఆరోగ్య బీమాలో రెండో స్థానంలో ఏపీ చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగించారు. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది. బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్ కౌంటర్లు, సోలార్ ప్యానల్ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ–ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్ షరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. -
నేడే నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. రాకెట్ ప్రయోగంపై శనివారం ‘షార్’లో ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ పద్మకుమార్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి.. ప్రయోగ సమయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. షార్ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్ఎస్ఎల్వీ డీ1 సిరీస్‌లో ఇదే మొదటిది కావడం గమనార్హం. అంటే ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీ వంతు వచ్చింది. 7 గంటల కౌంట్‌డౌన్ 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్ఎస్ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ(ఈఓఎస్శాట్)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెడతారు. తర్వాత విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను ఉత్తేజితం చేయడానికి కౌంట్‌డౌన్‌ను 7 గంటలుగా నిర్ణయించారు. -
నెలాఖరులో నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ను ఈ నెలాఖరులో ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ద్వారా 142 కేజీల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ అనే ఉపగ్రహాన్ని రోదసి లోకి పంపేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధానం చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలు వాణిజ్యపరంగా మారిపోవడంతో పలు దేశాలు చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ఇస్రో ద్వారా ప్రయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బుల్లి ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయంలో భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇప్పటికే పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆ స్థానాన్ని నిలుపుకునేందుకు ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను రూపొందించింది. వాణిజ్య ప్రయోగాలకు వీలుగా ఎస్ఎస్ఎల్వీ.. ఇప్పటివరకు ఇస్రో.. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్3 అనే ఐదు రకాల రాకెట్లతో ఉపగ్రహాలను రోదసి లోకి పంపించింది. ప్రస్తుతం ఆరో రకం రాకెట్‌గా ఎస్ఎస్ఎల్వీని తయారు చేసింది. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీని మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించారు. ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. 2016లోనే ప్రతిపాదన.. 2016లో ప్రొఫెసర్ రాజారాం నాగప్ప నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ నివేదిక ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించుకునేందుకు వీలుగా ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను ప్రతిపాదించారు. 2016లో లిక్విడ్ ప్రొపల్షన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.సోమనాథ్(ప్రస్తుత ఇస్రో చైర్మన్) 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో పంపే వెహికల్ అవసరాన్ని గుర్తించారు. ► 2017 నవంబర్ నాటికి ఎస్ఎస్ఎల్వీ డిజైన్‌ను రూపొందించారు. కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 2018 డిసెంబర్ నాటికి ఎస్ఎస్ఎల్వీని పూర్తిస్థాయిలో తయారుచేశారు. ► 2020 డిసెంబర్ నుంచి 2022 మార్చి 14 వరకు రాకెట్ అన్ని దశలను విడివిడిగా ప్రయోగాత్మకంగా ప్రయోగించి తరువాత వెహికల్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి ప్రయోగానికి చర్యలు చేపట్టారు. ప్రయోగం ఇలా.. ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌లోని మొదటి, రెండు, మూడు దశలను ఘన ఇంధనంతోనే ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. ఇందులో ద్రవ ఇంధన దశ ఉండదు. నాలుగో దశలో వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశను కొత్తగా రూపకల్పన చేశారు. ఈ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. -
పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, శ్రీహరికోట: నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. చదవండి: సెట్టింగ్ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది.. ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి. -
14న పీఎస్ఎల్వీ–సీ52 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి 14వ తేదీ ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 25.30 గంటల ముందు అంటే ఈ నెల 13 తెల్లవారు జామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగంలో భాగంగా షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో నాలుగు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తిచేసి బుధవారం ఉదయం వ్యాబ్ నుంచి హుంబ్లికల్ టవర్‌కు తరలించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌ను ప్రయోగ వేదికకు అనుసంధానం చేసి నాలుగు రోజుల పాటు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. ఈ ప్రయోగంలో 1,710 కిలోల బరువున్న రాడార్ ఇమేజింగ్ శాటిలైట్(ఈఓఎస్–04) ఉపగ్రహంతో పాటు మరో రెండు చిన్న ఉప గ్రహాలను కూడా రోదసీలోకి పంపుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ) వారు రూపొందించిన ఇన్స్పైర్ శాట్–1, ఇండియా–భూటాన్ సంయుక్తంగా తయారు చేసిన ఐఎన్ఎస్–2బీ ఉపగ్రహాలనూ రోదసీలోకి పంపనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ను భూమికి 529 కి.మీ ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహ ప్రయోగం.. వాతావరణ పరిశోధన, వ్యవసాయం, అటవీశాఖ, వరదలు, విపత్తుల పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఈ నెల 12న మిషన్ రెడీనెస్ సమీక్ష నిర్వహిస్తారు. -
అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు
బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా తన దూకుడు తనాన్ని కొనసాగిస్తూనే ఉంది. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి చైనా నవంబర్ 6న 3 కొత్త రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు అధికారిక మీడియా తెలిపింది. యోగన్-35 విభాగానికి చెందిన ఈ ఉపగ్రహాలను లాంగ్ మార్చి-2డి క్యారియర్ రాకెట్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ సిరీస్ రాకెట్స్ ద్వారా చేపట్టిన 396వ మిషన్‌గా ఈ ప్రయోగం నిలిచింది. 2019 మార్చిలో లాంగ్ మార్చి 3బీ రాకెట్ విజయవంతం కావడంతో చైనా విజయవంతంగా పూర్తి చేసిన 300వ ప్రయోగంగా అది నిలిచింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన లాంగ్ మార్చ్ క్యారియర్ రాకెట్ సిరీస్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు 96.4 శాతం సక్సెస్ అయ్యాయి. లాంగ్ మార్చ్ రాకెట్ మొదటి 100 ప్రయోగాలను పూర్తి చేయడానికి 37 సంవత్సరాలు పడితే, 200 ప్రయోగాలను పూర్తి చేయడానికి 7.5 సంవత్సరాలు, చివరి 300ను చేరుకోవడానికి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే పట్టింది. సంవత్సరానికి సగటు ప్రయోగాల సంఖ్య 2.7 నుంచి 13.3కు, తర్వాత 23.5కు పెరిగింది. (చదవండి: ఈ కారును ఏడాదికి రెండు సార్లు ఛార్జ్ చేస్తే చాలు!) -
ఇస్రో ప్రయోగం విఫలం: మాజీ ఛైర్మన్ దిగ్భ్రాంతి
సాక్షి, బెంగళూరు: ఇస్రో ప్రయోగం విఫలం కావడంపై సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలంకావడంపై స్పందించిన ఆయన ఇది మనందరికీ షాక్. కానీ షాక్ నుండి త్వరగా కోలుకుని, మళ్లీ ట్రాక్‌లో వస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో, వైఫల్యానికి మూల కారణాన్ని గుర్తించి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఇస్రో సిబ్బందికి అంతటి సామర్థ్యముందని నాయర్ పేర్కొన్నారు. ఈ రకమైన ఎదురుదెబ్బలు అసాధారణమైనవేమీ కాదని, ధైర్యాన్ని కోల్పోవద్దంటూ ఇస్రోకు సూచించారు. క్రయోజెనిక్ టెక్నాలజీపై ప్రావీణ్యతను సాధించిన ఇస్రో దృఢత్వంపై తనకు విశ్వాసముందన్నారు. ఇది చాలా క్లిష్టమైన మిషన్ అని పేర్కొన్న ఆయన సాధారణంగా, అన్ని ఇతర రాకెట్ ప్రొపల్షన్‌లతో పోలిస్తే క్రయోజెనిక్ స్టేజ్ చాలా కష్టమైందని వెల్లడించారు. క్రయోజెనిక్ దశలో వైఫల్యం దాదాపు 20 శాతం పరిధిలో ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో యూరోపియన్ దేశాలు, రష్యాతో పోలిస్తే దాని ట్రాక్ రికార్డ్ బావుందని ఈ నేపథ్యంలో ఇస్రో తిరిగి పుంజుకుంటుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. కాగాజీఎస్‌ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుండి రాకెట్ ప్రయోగం తొలి, రెండో దశలో సాధారణంగానే ఉన్నప్పటికీ మూడో దశలో రాకెట్ గతి తప్పిందని తెలిపిందే. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తిన ఫలితంగా ఉద్దేశించిన మిషన్ పూర్తి కాలేదని స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. 2003 నుండి ఆరేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న మాధవన్ 25 మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. -
జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలమయ్యింది. మూడో దశలో రాకెట్ గతి తప్పింది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(జీఎస్ఎల్వీ ఎఫ్–10) ప్రయోగించేందుకు బుధవారం వేకువజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్‌ను ప్రయోగించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య రావడంతో ప్రయోగం విఫలమయ్యింది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్–03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ఉపయోగించాల్సి వుంది. ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్‌గా అమర్చారు. ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపించేవిధంగా రూపొందించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది. -
ఏప్రిల్ 18న నింగిలోకి జీఐశాట్–1
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐశాట్–1) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. గత ఏడాది నుంచి పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ శాటిలైట్ ప్రయోగాన్ని ఆదివారం (28వ తేదీ) నిర్వహించాల్సి ఉంది. అయితే మరోమారు వాయిదా వేసుకుని, ఏప్రిల్ 18న నిర్వహిస్తామని బెంగళూరులోని అంతరిక్ష కేంద్రం ప్రధాన కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటించారు. ఉపగ్రహంలో చిన్నపాటి సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగా వాయిదా వేశామని పేర్కొన్నారు. అనేక సార్లు వాయిదా.. షార్ ప్రణాళిక ప్రకారం ఈ ఉపగ్రహ ప్రయోగం 2020 జనవరి 15న నిర్వహించాల్సి ఉండగా, సాంకేతిక పరమైన కారణాలతో 2020 ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. సాంకేతిక లోపాలను సరిచేసే క్రమంలో ఫిబ్రవరి 25కు, తర్వాత మార్చి 5కు ప్రయోగాన్ని రెండు సార్లు వాయిదా వేశారు. 2020 మార్చి 5న కౌంట్‌డౌన్ ప్రక్రియను కూడా ప్రారంభించిన తరువాత ప్రయోగాన్ని నిలిపివేసి, వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా లాక్డౌన్ కారణంగా సుదీర్ఘకాలం వాయిదా పడింది. తిరిగి ఈ ఏడాదిలో రెండో ప్రయోగంగా దీనిని చేపట్టగా మళ్లీ వాయిదా పడటం విశేషం. ఇస్రో చరిత్రలో ఇదో నూతన అధ్యాయం జీఎస్ఎల్వీ ఎఫ్–10 (జీఎస్ఎల్వీ మార్క్–2) రాకెట్ ద్వారా 2,100 కిలోల బరువు కలిగిన సరికొత్త రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూర పరిశీలనా ఉపగ్రహం) ‘జీఐశాట్–1’ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ను భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో వున్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. మొట్ట మొదటిసారిగా జీఐశాట్–1ను భూస్థిర కక్ష్యలోకి పంపిస్తుండటం విశేషం. -
చిన్న ఉపగ్రహాల కోసం ఎస్ఎస్ఎల్వీ
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వదేశీ, విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.గత ఏడాదిలోనే ప్రయోగం చేపట్టాలని అనుకున్నప్పటికి కోవిడ్–19 లాక్డౌన్ ప్రభావంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రాకెట్ డిజైన్ చేసి చిన్న తరహా ఉపగ్రహాలను రెగ్యులర్‌గా ప్రయోగించేందుకు రూపొందించారు. ప్రపంచ మార్కెట్లో అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయం భారత్ నేడు ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా అవతరించింది. 2022 ఆఖరు నాటికి ఎస్ఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా వంద కిలోలు నుంచి 500 కిలోలు బరువు కలిగిన 6000 వేలు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే పీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా 33 దేశాలకు చెందిన 328 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవిర్భవించింది. నూతన ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కృషి కొత్త ప్రయోగాల కోసం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో కులశేఖర పట్నం అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థల పరిశీలన చేసి భూసేకరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాన్ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించాలని అనేక దేశాల నుంచి వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను పంపించాల్సిన వ్యవహారానికి మంచి డిమాండ్ ఉండడంతో దీనికోసమే ప్రత్యేకంగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను రూపొందిస్తున్నారు. ఎస్ఎస్ఎల్వీ రూపు రేఖలు ఇలా.. స్మాల్ శాటిలైట్ లాంఛింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. 34 మీటర్లు ఎత్తు, రెండు మీటర్లు వ్యాసార్థం కలిగి వుంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు దాకా వుంటుంది. 500 కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు. ఈ రాకెట్‌ను వర్టికల్ పొజిషన్లో పెట్టి ప్రయోగించనున్నారు. అంటే ఇస్రో మొదటి రోజుల్లో ఎస్ఎల్వీ రాకెట్‌ను కూడా వర్టికల్ పొజిషన్లోనే పెట్టి ప్రయోగించారు. దీనికి షార్ కేంద్రంలో పాత లాంచ్‌ప్యాడ్ కూడా సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ను కూడా పీఎస్ఎల్వీ రాకెట్ లాగానే నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్‌కు మొదటి, మూడో దశలు ఘన ఇంధనం, రెండు, నాలుగో దశలు ద్రవ ఇంధనంతో ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎస్ఎస్ఎల్వీ రాకెట్‌ను మాత్రం మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతోనే చేస్తారు. ఇందులో ద్రవ ఇంధనం దశమాత్రం వుండదు. నాలుగోదశలో మాత్రం వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశ కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెడతారన్నమాట. 2022 ఆఖరు నాటికి 6000 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఈ రాకెట్‌ను రూపొందించారు. ఇక విదేశీ ఉపగ్రహాలన్నింటిని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించనుండడం కొసమెరుపు. ఆస్ట్రోనాట్ విద్యార్థులకు అనుగుణంగా... దేశీయంగా పలు యూనివర్శిటీలకు చెందిన ఆస్ట్రోనాట్ విద్యార్థులు ఎక్స్ఫర్మెంటల్గా చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. వాణిజ్యపరంగా విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భవిష్యత్తులో ఈ రాకెట్ ఉపయోగపడనుంది. విద్యార్థులను అంతరిక్ష ప్రయోగాలల్లో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించి శాస్త్రవేత్తలుగా మార్చాలన్న లక్ష్యంతో ఇస్రో దృష్టిసారించింది. ఆ మేరకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. దేశ, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేసుకుని ముందుకొస్తే ఇస్రో ఉచితంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ఎస్‌ఎఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగంతో పాటు విద్యార్థులు తయారు చేసిన ఆనంద్–01 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
విదేశీ ఉపగ్రహ మార్కెట్‌పై ఇస్రో దృష్టి
సాక్షి, అమరావతి: ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్ఆర్–టబ్‌సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇస్రో స్వయం ప్రతిపత్తి... విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహ ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్ఎల్వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహాలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. పదేళ్లలో రూ.20,300 కోట్లు రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది.