
ఐస్‌శాట్–2తో నింగిలోకి దూసుకెళ్తున్న డెల్టా–2 రాకెట్
లాస్ ఏంజిలెస్: ప్రపంచవ్యాప్తంగా కరిగిపోతున్న మంచుపై అధ్యయనం చేయడానికి నాసా అత్యాధునిక స్పేస్ లేజర్ ఆధారిత ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఐస్‌శాట్–2గా పిలుస్తున్న ఈ ఉపగ్రహాన్ని డెల్టా–2 రాకెట్ కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి శనివారం విజయవతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగానికి సుమారు రూ. 7 వేల కోట్లు వ్యయం చేసినట్లు నాసా వెల్లడించింది. భూతాపం, సముద్ర నీటి మట్టాల పెరుగుదలపై కచ్చితమైన అంచనాలు పొందేందుకు ఈ ఉపగ్రహం దోహదపడుతుందని భావిస్తున్నారు.
2003లో ప్రయోగించిన ఐస్‌శాట్ ఉపగ్రహం 2009 వరకు సేవలందించింది. గ్రీన్‌లాండ్, అంటార్కిటికా తీర ప్రాంతాల్లో మంచు పలకలు పలచనవుతున్న సంగతిని అది వెలుగులోకి తెచ్చింది.తాజాగా పంపిన ఐస్‌శాట్–2లో లేజర్ సాంకేతికతను వాడుతున్నారు కాబట్టి గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లోని అత్యంత సూక్ష్మ మందమైన మంచు పలకల్లో వస్తున్న మార్పులను అంచనావేయడానికి సరిపడ సమాచారాన్ని సమకూరుస్తుంది.