Voyager-1: హస్త లా విస్తా.. బేబీ! | Voyager-1: NASA Farthest Man-Made Object in Space Faces Critical Glitch | Sakshi
Sakshi News home page

Voyager-1: హస్త లా విస్తా.. బేబీ!

Published Mon, Mar 11 2024 5:43 AM | Last Updated on Mon, Mar 11 2024 5:43 AM

Voyager-1: NASA Farthest Man-Made Object in Space Faces Critical Glitch - Sakshi

భూమి మీది జీవం, పలు భాషల్లో శుభాకాంక్షలు, ఆడియో–విజువల్‌ సందేశాలతో వోయేజర్‌–1 వ్యోమనౌకలో పంపిన గోల్డెన్‌ రికార్డు

బహుదూరపు బాటసారికి బై బై 

అవసాన దశలో వోయేజర్‌–1

నక్షత్రాంతర వ్యోమనౌకలో సాంకేతిక సమస్య

2,440 కోట్ల కి.మీ. దూరంలో స్పేస్‌ క్రాఫ్ట్‌

వోయేజర్‌–1. ఈ పేరే ఖగోళ శాస్త్రవేత్తలకు ఎనలేని స్ఫూర్తి. నింగికేసి ఉత్సాహంగా చూసేలా కొన్ని తరాలను పురి         గొలి్పన ప్రేరణ శక్తి. అలుపెరుగని యాత్ర. కోట్లాది కిలోమీటర్ల జైత్రయాత్ర. అర్ధ శతాబ్ద కాలపు వైజ్ఞానిక పరిశోధనల సారం. మానవాళి కలలుగన్న ‘సుదూర’ లక్ష్యపు సాకార రూపం. గ్రహాంతర హద్దులను దాటి నక్షత్రాంతర రోదసికెగసిగిన విశ్వవిఖ్యాత వ్యోమనౌక వోయేజర్‌–1. అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే.

1977 సెపె్టంబరు 5న అమెరికా ప్రయోగించిన ఈ వ్యోమనౌకది 46 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ జనవరి నాటికి అది భూమి నుంచి 2,440 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉంది. ఇప్పుడీ వ్యోమనౌకకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. గత నవంబరు నుంచి భూమికి సరైన సమాచారమివ్వడం లేదు. నాసాకు పిచ్చి పిచ్చి సందేశాలు పంపుతోంది. ఎలా చూసినా వోయేజర్‌–1 చరిత్ర ఇక ముగిసిన అధ్యాయమేనని అనిపిస్తోంది. అద్భుతమేదైనా జరిగితే తప్ప అది మనకిక హస్త లా విస్తా (వీడ్కోలు) చెప్పినట్టే!

వోయేజర్‌–1లోని ఓ కంప్యూటర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో కాలిఫోర్నియాలోని పసడెనాలో జెట్‌ ప్రొపల్షన్‌ లే»ొరేటరీలో ఉన్న గ్రౌండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వ్యోమనౌక నుంచి అర్థరహిత సమాచారం అందుతోంది. వోయేజర్‌–1ను నిర్మించి ప్రయోగించినప్పటి నాసా సిబ్బందిలో చాలామంది కాలం చేశారు. దాంతో తాజా సమస్యను పరిష్కరించి వ్యోమనౌకను మళ్లీ గాడిన పెట్టేందుకు దాని నిర్మాణం తాలూకు పాత పత్రాలను ముందేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కుస్తీలు పడుతున్నారు. ఈ సమస్య నుంచి వ్యోమనౌక బయటపడితే అద్భుతమేనని 2010 నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సుజానే డాడ్‌ అన్నారు.

సౌరవ్యవస్థను దాటి మున్ముందుకు!
హీలియోస్ఫియర్‌. సౌరవ్యవస్థ చుట్టూ సూర్యుడు నేరుగా ప్రభావం చూపే పొడవైన బుడగ లాంటి ప్రదేశం. దీని అంచును హీలియోపాజ్‌ అంటారు. వోయేజర్‌–1 2012లోనే ఈ హీలియోపాజ్‌నును దాటేసి నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించింది. అలా ఇంటర్‌ స్టెల్లార్‌ స్పేస్‌లోకి అడుగిడిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డుకెక్కింది. 2018లో వోయేజర్‌–2 కూడా ఇంటర్‌ స్టెల్లార్‌ స్పేస్‌లోకి ప్రవేశించింది. కాస్మిక్‌ కిరణాలు, నక్షత్రాంతర ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో అసాధారణ అలజడులు, ప్లాస్మా కణాలపై వోయేజర్‌–1 అధ్యయనం చేస్తోంది. భూమి నుంచి దానికి ఆదేశం పంపడానికి 22.5 గంటలు, దాన్నుంచి డేటా స్వీకరించడానికి మరో 22.5 గంటలు.. ఇలా సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి రమారమి రెండు రోజులు పడుతోంది.

జంట విజయాలు...
వోయేజర్‌ ప్రాజెక్టులో వోయేజర్‌–1, 2 భాగస్వాములు. వోయేజర్‌–2ను వోయేజర్‌–1 కంటే రెండు వారాల ముందు ప్రయోగించారు. నిజానికి వీటిది కేవలం నాలుగేళ్ల మిషన్‌. కానీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. వోయేజర్‌–2 ప్రస్తుతం పనిచేస్తున్నా దాన్నీ సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. పయనీర్‌–10, 11 వ్యోమనౌకల యాత్రలకు కొనసాగింపుగాం గురు, శని గ్రహాల అన్వేషణకు వోయేజర్‌ జంట నౌకలను పంపారు. వీటితో గురు గ్రహంపై పెద్ద ఎర్ర మచ్చ, శని వలయాలు, ఈ రెండు గ్రహాల కొత్త చంద్రుళ్లకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగు చూశాయి. వోయేజర్‌–1 1979లో గురుగ్రహాన్ని 3.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తిలకించింది. దాని చంద్రుడు ‘అయో’పై క్రియాశీల అగి్నపర్వతాలను గుర్తించింది.

భూమి మినహా సౌరకుటుంబంలోని తక్కిన ఖగోళ వస్తువుల్లో అగి్నపర్వత క్రియాశీలతను కనుగొనడం అదే తొలిసారి. 1990 ఫిబ్రవరి 14న సూర్యుడికి 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘లేత నీలి చుక్క’లా కనిపిస్తున్న భూమి ఫొటోను వోయేజర్‌–1 కెమెరా బంధించింది. ఆ సింగిల్‌ పిక్సెల్‌ ఫొటో ‘మానవాళి తనకుతాను గీసుకున్న స్వీయ చిత్తరువు’లా అనిపిస్తుంది. ఇక యురేనస్, నెప్ట్యూన్‌ గ్రహాలను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్‌–2 పేరుగాంచింది. శిలాగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడిని అంతర గ్రహాలంటారు. వాయుమయ గురు, శని, యురేనస్, నెప్ట్యూన్లను బాహ్య గ్రహాలుగా పిలుస్తారు. 4 బాహ్య గ్రహాలను దగ్గరగా సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్‌–2 1989లో రికార్డు సృష్టించింది.

– జమ్ముల శ్రీకాంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement