నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్09
శ్రీహరికోట : జీఎస్‌ఎల్‌వీ ఎఫ్09 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించారు. దీనికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రయోగాన్ని 20మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీ షార్ నుంచి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు.
కాగా ఈ రాకెట్ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటివరకు నిర్వహిం చిన 10 ప్రయోగాల్లో 3 విఫలం కాగా 7 విజయవం తమయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. కాగా షార్ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.