బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయోత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO).. సూర్యుడిపై తొలిసారిగా ప్రయోగానికి సిద్ధమైంది. భగభగలాడే సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య- ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహాన్ని శ్రీహరి కోట(ఏపీ) అంతరిక్ష కేంద్రం షార్ వేదిక నుంచి ప్రయోగించబోతోంది. కాసేపట్లో ఇస్రో రాకెట్ ‘పీఎస్‌ఎల్‌వీ సీ-57 ఆదిత్య ఎల్-1ను నింగిలోకి మోసకెళ్లనుంది. ఈ క్రమంలో ఈ మిషన్ ప్రత్యేకతలు ఓసారి చూద్దాం..
సౌర వ్యవస్థలో భూమి నుంచి సూర్యుడి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఇస్రో ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనలకు ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఆ ప్రవేశపెట్టే ఎల్-1(లాగ్‌రేంజ్) పాయింట్.. భూమి నుంచి 9లక్షల మైళ్ల దూరం(15 లక్షల కి.మీల)లో ఉంది. భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అదే భూమి నుంచి చంద్రుడి దూరంతో పోలిస్తే.. నాలుగు రెట్లు ఎక్కువ.
మిషన్ ఇలా..
‘ఆదిత్య-ఎల్ 1’ వ్యోమనౌకను తొలుత దిగువ భూకక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ పయనించిన అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగించి ఎల్1 పాయింట్ వైపు మళ్లిస్తుంది ఇస్రో. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం (ఎస్‌ఓఐ) నుంచి బయటపడి, చివరికి ఎల్1 చుట్టూ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది.
- లాగ్‌రేంజ్ 1 ప్రాంతానికి చేరుకునేందుకు ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది.
- విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ).. ఆదిత్య-ఎల్1లో కీలకం. ఇది సూర్యుడికి సంబంధించి ఇది ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలు ఇస్రోకు చేరవేస్తుంది.
- మొత్తంగా ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ)’తో పాటు సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటో మీటర్ ఉన్నాయి.
- సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి.
శక్తివంతమైన రాకెట్
‘ఆదిత్య-ఎల్ 1’ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్‌వీ (ఎక్స్‌ఎల్) రకం రాకెట్‌ను వినియోగిస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీలో ఇది అత్యంత శక్తిమంతమైనది. 2008లో చంద్రయాన్-1 మిషన్‌లో, 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)లో ఈ రకం రాకెట్‌లనే వినియోగించారు.
సూర్యుడే టార్గెట్ ఎందుకంటే..
అంత దూరంలో ఉన్నప్పటికీ.. సూర్యుడే మనకు సమీప నక్షత్రం. భూమిపై సమస్త జీవరాశి మనుగడకు ఆధారం కూడా. అందువల్ల మిగతా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయడం మనకు అవసరం. పైగా ‘పాలపుంత’తో పాటు ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడొచ్చు.
మరోవైపు.. సూర్యుడిపై విస్ఫోటాల ద్వారా సౌర వ్యవస్థలోకి అపారమైన శక్తి విడుదలవుతుంటుంది. ఇది భూమి వైపు మళ్లినట్లయితే.. మన సమీప అంతరిక్ష వాతావరణంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. కాబట్టి.. ఇటువంటి ఘటనలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. తద్వారా దిద్దుబాటు చర్యలకు అవకాశం లభిస్తుంది అని ఇస్రో భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment