సాక్షి, బెంగళూరు: ఇస్రో ప్రయోగం విఫలం కావడంపై సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలంకావడంపై స్పందించిన ఆయన ఇది మనందరికీ షాక్. కానీ షాక్ నుండి త్వరగా కోలుకుని, మళ్లీ ట్రాక్‌లో వస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో, వైఫల్యానికి మూల కారణాన్ని గుర్తించి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఇస్రో సిబ్బందికి అంతటి సామర్థ్యముందని నాయర్ పేర్కొన్నారు.
ఈ రకమైన ఎదురుదెబ్బలు అసాధారణమైనవేమీ కాదని, ధైర్యాన్ని కోల్పోవద్దంటూ ఇస్రోకు సూచించారు. క్రయోజెనిక్ టెక్నాలజీపై ప్రావీణ్యతను సాధించిన ఇస్రో దృఢత్వంపై తనకు విశ్వాసముందన్నారు. ఇది చాలా క్లిష్టమైన మిషన్ అని పేర్కొన్న ఆయన సాధారణంగా, అన్ని ఇతర రాకెట్ ప్రొపల్షన్‌లతో పోలిస్తే క్రయోజెనిక్ స్టేజ్ చాలా కష్టమైందని వెల్లడించారు. క్రయోజెనిక్ దశలో వైఫల్యం దాదాపు 20 శాతం పరిధిలో ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో యూరోపియన్ దేశాలు, రష్యాతో పోలిస్తే దాని ట్రాక్ రికార్డ్ బావుందని ఈ నేపథ్యంలో ఇస్రో తిరిగి పుంజుకుంటుందనే విశ్వాసాన్ని ప్రకటించారు.
కాగాజీఎస్‌ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుండి రాకెట్ ప్రయోగం తొలి, రెండో దశలో సాధారణంగానే ఉన్నప్పటికీ మూడో దశలో రాకెట్ గతి తప్పిందని తెలిపిందే. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తిన ఫలితంగా ఉద్దేశించిన మిషన్ పూర్తి కాలేదని స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. 2003 నుండి ఆరేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న మాధవన్ 25 మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment