వినువీధిలో మరో విజయం దక్కింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అత్యంత బరువైన రాకెట్‌ను ఆదివారం నాడు విజయవంతంగా గగనతలంలోకి పంపి, మరో మైలురాయిని చేరుకుంది. ‘జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3’ (జీఎస్‌ఎల్వీ ఎంకే 3) రాకెట్‌తో దాదాపు 6 టన్నుల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ‘ఎల్వీఎం3– ఎం2’ అని కూడా ప్రస్తావించే ఈ రాకెట్ ఏకంగా 36 ఉపగ్రహాలతో ఇంత బరువును విహాయసంలోకి తీసుకువెళ్ళడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి.
విజయవంతమైన ఈ ప్రయోగం మన అత్యాధునిక ఉపగ్రహ వాహక నౌక ‘ఎల్వీఎం3’ రాకెట్ ఆచరణీయతను మరోసారి ధ్రువీకరించింది. ఆసక్తితో చూస్తున్న ‘గగన్‌యాన్’ లాంటి వాటికి ఆ రాకెట్ అన్ని విధాలా తగినదని తేల్చిచెప్పింది. అంతేకాక, భారీ ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించిన విపణిలో ఇస్రో బలమైన అభ్యర్థి అని చాటిచెప్పింది.
ఈ పరిణామం అభినందనీయం. అందుకు అనేక కారణాలున్నాయి. భారత అంతరిక్ష విభాగ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్‌ఎస్‌ఐఎల్) వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలను చేపడుతోంది. ఆ ప్రయోగాలకు అంకితమైన రాకెట్ – ‘ఎల్వీఎం3’. 2017లో ఈ రాకెట్‌ను తొలిసారి ప్రయోగించారు. అప్పటి నుంచి మన దేశ కమ్యూనికేషన్ ఉపగ్రహాలనూ, ఇతర పేలోడ్‌లనూ నాలుగు సార్లు విజయవంతంగా వినువీధిలోకి పంపిన ఘనత ఈ రాకెట్‌ది. ఇప్పుడు తొలిసారిగా విదేశీ పేలోడ్‌ను వినువీధిలోకి పంపడానికి దీన్ని వినియోగించారు. జయకేతనం ఎగరే సిన ఈ రాకెట్ మనకు అందివచ్చిన అవకాశం. ఒకేసారి ఉపగ్రహాల్ని ఒక మండలంగా ప్రయోగిస్తూ పలు సంస్థల అవసరాల్ని తీర్చి, అంతర్జాతీయ విపణిలో ఆ ఖాళీ భర్తీకి ఇది ఉపకరిస్తుంది.
నిజానికి, అక్టోబర్ 23 నాటి ఈ అంతరిక్ష ప్రయోగం ఎన్‌ఎస్‌ఐఎల్‌కూ, బ్రిటన్‌కు చెందిన ‘వన్ వెబ్’కూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగం. భారతీ గ్లోబల్ భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ వన్ వెబ్‌కు దిగువ భూకక్ష్య (ఎల్‌ఈఓ)లో పలు ఉపగ్రహాలు అవసరం. ఆ అవసరాన్ని ఇస్రో ఇలా తీరుస్తోంది. తాజా 36 ఉపగ్రహాలు కాక, మరో 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను రెండో విడతగా 2023లో ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఇలా రెండు ప్రయోగాలతో మొత్తం 72 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి ఆ సంస్థ మన ఇస్రోకు రూ. 1000 కోట్లు చెల్లించింది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచవ్యాప్త టెలీకమ్యూనికేషన్లలో హైస్పీడ్ కనెక్టివిటీని అందించాలని వన్‌వెబ్ లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు మొత్తం 648 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపాలని సిద్ధమైంది. ఇప్పటికి 462 పంపగలిగింది.
తాజా ప్రయోగంలో ఓ తిరకాసుంది. ప్రతి రెంటికీ మధ్య కనీసం 137 మీటర్ల దూరం ఉండేలా మొత్తం 36 ఉపగ్రహాలనూ 601 కి.మీ. కక్ష్యలో అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టాలి. వన్‌వెబ్‌కు ఉన్న ఈ అవసరాన్ని అతి సమర్థంగా నెరవేర్చడం ఇస్రో సాధించిన ఘనత. థ్రస్టర్లను ఉపయోగించి, క్రయో దశలోనే పదే పదే దిశానిర్దేశంతో, ఈ విన్యాసాన్ని ఇస్రో చేసిచూపింది. ఇస్రోకు మరిన్ని వాణిజ్య ఒప్పందాలు రావాలంటే – ఇప్పటి ప్రయోగం, అలాగే వచ్చే ఏటి రెండో విడత ప్రయోగం సక్సెస్ కావడం కీలకం. తాజా విజయం మన అంతరిక్ష ప్రయోగ సామర్థ్యానికి మరో మచ్చుతునక. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల గిరాకీకి తగ్గట్టు మన ఉపగ్రహ వాహక జవనాశ్వమైన ఎల్వీఎం3 రాకెట్ల తయారీని వేగవంతం చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.
అసలు ఇలా ఒకేసారి ఉపగ్రహ మండలంగా పలు ఉపగ్రహాలను ఒకే కక్ష్యలోకి వాణిజ్యపరంగా పంపే వాహక నౌకల కొరత అంతర్జాతీయంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆ ఉపగ్రహా లను రక్షణ ప్రయోజనాలకు వాడబోమని హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టి, రష్యా ఈ వన్ వెబ్ అవకాశం వదులుకుంది. చైనా రాకెట్ల వాణిజ్య సత్తాను పాశ్చాత్యలోకంం అంగీకరించదు. ఫ్రాన్స్‌లో వీటి అభివృద్ధి ఆలస్యమైంది. ఇవన్నీ మనకు కలిసొచ్చాయి.
ప్రస్తుతం అంతరిక్ష వాణిజ్య విపణిలో అంతర్జాతీయంగా భారత వాటా 2 శాతమే. తాజా ప్రయోగ విజయంతో దాన్ని గణనీయంగా పెంచుకొనే వీలు చిక్కింది. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో వద్ద పీఎస్‌ఎల్వీ మాత్రమే ఉంది. తాజా ఎల్వీఎం3–ఎం2 రాకెట్‌తో రెండో అస్త్రం చేరింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రాకెట్ ‘చంద్రయాన్–2’ సహా 4 ప్రయోగాల్ని సక్సెస్ చేసింది. మనిషిని విహాయసంలో విహరింపజేసే ‘గగన్‌యాన్’కూ దీన్నే స్వల్ప మార్పులతో సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏటి ‘చంద్రయాన్–3’కీ, సూర్య గ్రహ అధ్యయనమైన ‘ఆదిత్య ఎల్1’కూ సన్నాహాలు సాగుతుండడం గర్వకారణం.
రాబోయే రోజుల్లో ఉపగ్రహ సేవలనేవి అతి పెద్ద వ్యాపారం. 5జీ వస్తున్నవేళ టెలికామ్ సేవలకు కీలకమైన ఎల్‌ఈఓ ఉపగ్రహాలను గగనంలోకి పంపే విపణిలో ఆటగాడిగా మనం అవతరించడం శుభసూచకం. మనకూ ఉపయుక్తం. ఇదే ఊపు కొనసాగితే వచ్చే 2025 కల్లా మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 1300 కోట్ల డాలర్ల (రూ.1.07 లక్షల కోట్ల) ఆదాయాన్ని అందుకుంటుందట. ఉపగ్రహ సేవల విపణి 500 కోట్ల డాలర్లకూ, గ్రౌండ్ సేవలు 400 కోట్ల డాలర్లకూ చేరుకుంటాయని లెక్క.
వెరసి, రాగల మూడేళ్ళలో ఉపగ్రహ, ప్రయోగ సేవల్లో మనం మునుపెన్నడూ లేనట్టు 13 శాతం అత్యధిక వార్షిక వృద్ధి రేటు సాధిస్తామన్న మాట ఈ ఆనందానికి మరిన్ని రెక్కలు తొడుగుతోంది. దేశీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం శ్రీకారం చుట్టుకుంది. అంతరిక్ష వాణిజ్య సేవల రంగంలో దేశంలో రానున్న పెనుమార్పులకు స్వాగతం... శుభ స్వాగతం!
ఇక... వాణిజ్య గ‘ఘనమే’!
Published Thu, Oct 27 2022 1:49 AM | Last Updated on Thu, Oct 27 2022 1:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment