space sector
-
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లకు మద్దతు
న్యూఢిల్లీ: అంతరిక్షరంగంలో స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని∙మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్‌తో దాదాపు 35 స్టార్టప్ కంపెనీలకు మద్దతు లభించే అవకాశం ఉంది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతోపాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో భారత్ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడతుందని చెబుతున్నారు. వేయి కోట్లతో నిధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్‌ల్లో రెండు దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో దశలో రూ.10 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతోపాటు ఉత్తర బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ. 6,798 కోట్లు. ఇందులో అమరావతిలో రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
అంతరిక్షంలో మన జైత్రయాత్ర
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. అంతరిక్ష రంగంలో భారత్ జైత్రయాత్రకు మార్గం సుగమమైంది. ఈ దిశగా పలు కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి, అక్కడ నమూనాలు సేకరించి, క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌కు ఆమోద ముద్రవేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,104.06 కోట్లు ఖర్చు చేయబోతోంది. చంద్రయాన్–4 స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్‌కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్–4ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ నిర్మించుకోవడంతోపాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్–4కు శ్రీకారం చుడుతోంది. ఈ మిషన్‌లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. ఎన్జీఎల్వీ సూర్య పాక్షిక పునరి్వనియోగ తదుపరి తరం లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ‘సూర్య’ అభివృద్ధికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్–3 కంటే మూడు రెట్లు అధికంగా పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్–3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50 శాతమే పెరుగుతుంది. ఎన్జీఎల్వీ ‘సూర్య’ అభివృద్ధికి ప్రభుత్వం రూ.8,240 కోట్లు కేటాయించింది. గగన్‌యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్లో మొదటి మాడ్యూల్(బీఏఎస్–1) అభివృద్ధికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. గగన్‌యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి ఎనిమిది మిషన్లు పూర్తిజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లు కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా రూ.11,170 కోట్లు కేటాయించింది. → బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్íÙప్ డెవలప్మెంట్(బయో–రైడ్) పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందించనుంది. ఈ పథకం అమలుకు రూ.9,197 కోట్లు కేటాయించారు. → యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(ఎన్సీఓఈ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ఇండియాను కంటెంట్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. → 2024–25 రబీ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రూ.24,474.53 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తంచేసింది. ఈ రాయితీ వల్ల సాగు వ్యయం తగ్గుతుందని, రైతులకు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతన్నలకు కొరత లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. → ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్(పీఎం–ఆశా)కు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. రైతులకు తగిన మద్దతు ధర అందించడంతోపాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి 2025–26లో రూ.35,000 కోట్లతో ఈ పథకం అమలు చేస్తారు. పీఎం–ఆశాతో రైతులతోపాటు వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. → దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకానికి రూ.79,156 కోట్లు కేటాయించారు.‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ శుక్ర గ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. శుక్ర గ్రహం కక్ష్యలోకి సైంటిఫిక్ స్పేస్‌క్రాఫ్ట్ పంపించాలని నిర్ణయించారు. ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’కు కేంద్ర కేబినెట్ రూ.1,236 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తారు. -
అంతరిక్షంలో పైపైకి...
అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయపరంపర వాణిజ్యపరంగా కాసుల వర్షం కురిపించటం కొత్తేం కాదు. అంతరిక్షంలో మనకన్నా చాలాముందే అనేక విజయాలు నమోదు చేసుకున్న దేశాలకు సైతం ఈ విషయంలో మన ఇస్రో సంస్థ దీటుగా నిలిచిన వైనం కూడా పాత కథే. మరోసారి దీన్ని అంతర్జాతీయ అంతరిక్ష సలహా సంస్థ నోవాస్పేస్ నివేదిక ధ్రువపరిచింది. గత పదేళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ కొచ్చిన ఆదాయం 6,300 కోట్ల డాలర్లని నివేదిక తెలిపింది.అంటే మన జీడీపీ వృద్ధిలో ఇస్రో పాత్ర ఎనలేనిదన్న మాట. ఈ రంగం నానాటికీ విస్తరిస్తోంది. అవసరాలు పెరుగుతున్న కారణంగా అవకాశాలు కూడా ఊహకందని రీతిలో విస్తరిస్తున్నాయి. మన అంతరిక్ష రంగంలో ప్రత్యక్షంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 96,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా... మొత్తంగా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు. రానున్న కాలంలో ప్రైవేటు రంగ పెట్టు బడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలను గమనిస్తే మున్ముందు ఉద్యోగావ కాశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించవచ్చు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడు లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిరుడు నిర్ణయించింది. పర్యవసానంగా 2020లో 54 స్టార్టప్లుండగా ఇప్పుడవి 200కు చేరుకున్నాయి. మన దేశం మాత్రమే కాదు... లాభదాయకమని తేలడంతో పలు దేశాలు సైతం అంతరిక్ష రంగ పెట్టుబడులపై శ్రద్ధ పెడుతున్నాయి. ఆ రంగాన్ని విస్తరించ టానికి కృషి చేస్తున్నాయి. వచ్చే పదేళ్లలో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 18 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని ఆమధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కేసింది. పెట్టుబడుల రీత్యా మన అంతరిక్ష రంగం ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. అంతిమంగా అతి పెద్ద విజయం సాధించటానికి ముందు తప్పులు దొర్లటం అతి సహజమనీ, ఏ విజయానికైనా ఇలాంటి చరిత్రే ఉంటుందనీ ప్రముఖ అణు శాస్త్రవేత్త నీల్స్ బోర్ ఎప్పుడో చెప్పారు. మన అంతరిక్ష రంగం కూడా ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. 1975లో ఆర్యభట్ట ఉప గ్రహ ప్రయోగం తర్వాత మన అంతరిక్ష కార్యక్రమం పట్టాలెక్కడానికి పదేళ్లు పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ సమస్య అయినా అత్యంత క్లిష్టమైనదని చెప్పడానికి రాకెట్ సైన్స్‌తో పోలుస్తుంటారు. ఒక రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోవాలన్నా, నిర్దిష్ట కక్ష్యలో ఉపగ్రహాన్ని ఉంచాలన్నా ఎన్నో సూక్ష్మ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతికంగా రాకెట్‌లోని వ్యవస్థలూ, ఉప వ్యవస్థలూ ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవాలి. చిన్న లోపమైనా చోటుచేసుకోకూడదు. ఒక ఉపగ్రహాన్ని పంపటానికే ఇంత సంక్లిష్ట ప్రక్రియ అవసరం కాగా, ఒకేసారి బహుళ ఉపగ్రహాలను ప్రయోగించటం అంటే మాటలు కాదు. ఇస్రో ఇలాంటి విన్యాసాలను అవలీలగా పూర్తి చేయగలిగిందంటే దాని వెనకున్న దశాబ్దాల కృషి సామాన్యమైనది కాదు. పైగా అగ్రరాజ్యాలు ఉపగ్రహాలనుపంపటానికి వసూలు చేసే సొమ్ముతో పోలిస్తే ఇస్రో ధర ఎంతో చవక. అందువల్లే అనేక దేశాలు తమ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోను ఎన్నుకుంటున్నాయి. వేరే అంతరిక్ష ప్రయోగ సంస్థలతో పోలిస్తే ఇస్రో చేసే వ్యయం అతి తక్కువ. మన దేశం గత దశాబ్దంలో 1,300 కోట్ల డాలర్లు వ్యయం చేయగా 6,300 కోట్ల డాలర్ల ఆదాయం రావటం ఇందుకే. 2014లో ఈ ఆదాయం కేవలం 3,800 కోట్ల డాలర్లని గుర్తుపెట్టుకుంటే మనవాళ్లు సాధించిన ఘనతేమిటో అర్థమవుతుంది. అంతరిక్ష పరిజ్ఞానం మన నిత్య జీవితంతో అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. టెలికాంరంగం ప్రస్తుతం 6జీ వైపుగా అడుగులేస్తున్నదంటే అది మన ఉపగ్రహాల సమర్థత వల్లనే. రిసోర్స్ శాట్, కార్టోశాట్ వంటివి పంట భూమి స్వభావం, మట్టిలో తేమ శాతం, పంటల తీరుతెన్నులు తది తర అంశాల్లో ఎప్పటికప్పుడు రైతుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వారు తగిన ప్రణాళికలు రూపొందించుకునేందుకు, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడి సాగు దిగుబడిని పెంచటానికి దోహదం చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తం చేయటానికి, ఏదైనా అనుకోని దుర్ఘటన సంభవిస్తే తక్షణం సహాయ సిబ్బంది రంగంలోకి దిగటానికి ఉపగ్రహాలు సమాచారమిస్తున్నాయి. నిత్యం దేశంలో 8 లక్షలమంది మత్స్యకారులు ఈ ఉపగ్రహాలు అందించే సమాచారంతో లబ్ధి పొందుతున్నారు. పట్టణప్రాంత ప్రణాళికలకూ, మౌలిక సదుపాయాల పర్య వేక్షణకూ ఇస్రో పంపిన ఉపగ్రహాల సమాచారం ఉపయోగపడుతోంది. ఇస్రో అంతరిక్ష రంగ కార్య కలాపాలను రానున్నకాలంలో మరింత విస్తృతం చేయదల్చుకుంది. ప్రపంచ అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థలో ఇస్రో వాటా ప్రస్తుతం 2 శాతం. దీన్ని 2034 నాటికి 10 శాతానికి పెంచాలన్నది ఇస్రో లక్ష్యం. అంతరిక్ష సాంకేతికతల్లో స్వావలంబన సాధించే దిశగా ఇప్పటికే అనేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉపగ్రహాలకు అవసరమైన హార్డ్‌వేర్ కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తున్నది. ఆ విషయంలో సాగుతున్న పరిశోధన, అభివృద్ధి పర్యవసానంగా ఇప్పటికే ఎన్నో కొత్త సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి. అయితే అంతరిక్షంలో ఆధిపత్యాన్ని సాధించి అందరినీ శాసించేందుకు ఇప్పటికే అమెరికా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. తనకు అనుకూలంగా అంతర్జాతీయ అంతరిక్ష న్యాయనిబంధనలు రూపొందేలా పావులు కదుపుతోంది. కనుక మనం అప్రమత్తంగా ఉండటం, అందుకు తగిన వ్యూహ రచన చేయటం ముఖ్యం. ఇస్రో ఏర్పడిన ఈ అర్థ శతాబ్దపు కాలంలో ఆ సంస్థ చేసిన కృషి అసాధా రణమైనదీ, అనుపమానమైనదీ. దాన్ని మరింత విస్తృతపరుచుకుంటేనే గగనవీధుల్లో విజయపరంపర నిరంతరం సాగుతుంది. -
‘స్పేస్’లో మరిన్ని ఎఫ్‌డీఐలకు సై
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం కోసం స్పేస్పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మస్క్ పర్యటన నేపథ్యంలో.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్‌లింక్‌కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు. -
స్పేస్ స్టార్టప్‌లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్‌లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్‌ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్‌లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
అంతరిక్ష రంగంలోకి సులభతరంగా ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థలను ఆకర్షించే దిశగా కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళతరం చేయడంపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ రంగంలో విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉపగ్రహాల సంబంధ కార్యకలాపాల విభాగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నప్పటికీ అది ప్రభుత్వ అనుమతికి లోబడి ఉంటోంది. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో జీ–20 కూటమిలోని మూడు దేశాలు .. అంతరిక్ష రంగంలో భారత్‌తో కలిసి పని చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల కోసం ఉపయోగించే ఉపకరణాల తయారీ మొదలుకుని స్పేస్ హార్డ్‌వేర్, టెక్నాలజీ సేవలు మొదలైన వాటి దాకా అనేక అంశాలు అంతరిక్ష రంగ అవసరాల్లో ఉంటాయి. వివిధ నివేదికల ప్రకారం అంతర్జాతీయంగా అంతరిక్ష రంగం పరిమాణం 546 బిలియన్ డాలర్లుగా ఉంది. 2040 నాటికి ఇది 1 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. సాంకేతిక పురోగతి, వ్యయ నియంత్రణ చర్యలు మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి. -
అంతరిక్ష రంగానికి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: అంతరిక్ష(స్పేస్) సంబంధ రంగాలకు దన్నునిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకరించింది. తద్వారా స్పేస్ విభాగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు వీలు చిక్కనుంది. తాజా సవరణలతో స్పేస్ సంబంధ పరిశ్రమల్లో భారీ పెట్టుబడులకు వీలున్నట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రధానంగా సౌదీ అరేబియా కంపెనీలు ఏవియేషన్, ఫార్మా, బల్క్ డ్రగ్స్, రెనెవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్ తదితర రంగాలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ తదితర విభాగాలలో భారీస్థాయిలో సాంకేతిక సహకారాలకు తెరలేవనున్నట్లు అభిప్రాయపడ్డారు. స్పేస్ రంగంలో ప్రయివేట్ పెట్టుబడులతోపాటు.. విదేశీ పెట్టుబడులకూ అవకాశం కలి్పంచేలా నిబంధనలను మరింత సరళీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ సదస్సు సందర్భంగా సింగ్ ఇంకా పలు అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం స్పేస్ రంగంలో శాటిలైట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో ప్రభుత్వ అనుమతి ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐలకు వీలుంది. కాగా.. ఇప్పటికే సౌదీ కంపెనీలు సౌర, పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులు తీసుకువచి్చనట్లు సింగ్ ప్రస్తావించారు. ప్రభుత్వం సౌదీ కంపెనీలతో చేతులు కలిపేందుకు చూస్తున్నట్లు తెలియజేశారు. సౌదీ మిలటరీ పరిశ్రమలు, మేకిన్ ఇండియా కార్యక్రమాలు కలిసి సంయుక్తంగా రక్షణ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశమున్నదని వివరించారు. 2022–23కల్లా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 52.8 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. -
చంద్రయాన్ –3 తరువాత?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన రెండో ప్రయత్నంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేయడంలో విజయం సాధించింది. భవిష్యత్తు ఏమిటన్న విషయానికి క్లుప్తంగా ఇవ్వగలిగిన సమాధానం ఆకాశమే హద్దుగా అంతరిక్ష రంగంలో మనదైన ముద్రను వేయడమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే రష్యా, ఇజ్రాయెల్‌లు రెండూ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు విఫలయత్నం చేశాయి. భారత్ మాత్రమే విజయం సాధించగలిగింది. కచ్చితంగా ఇది భారత శాస్త్రవేత్తల సునిశిత ప్లానింగ్, ఆలోచన, నిబద్ధతలకు ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి చంద్రయాన్–3 తరువాత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో వైపు చూసే దేశాల సంఖ్య నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత అంతరిక్ష ప్రయోగ మార్కెట్ విలువ దాదాపు 800 కోట్ల డాలర్లని అంచనా. 2040 నాటికి ఇది ఐదు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే ఒక అంచనా ఉండగా.. చంద్రయాన్–3 విజయం ఈ లక్ష్యాన్ని మరింత ముందుగానే అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కొన్నేళ్లుగా భారత అంతరిక్ష రంగం ఇతర దేశాల కంటే రెట్టింపు వేగంతో ఎదుగుతున్న విషయం తెలిసిందే. కలిసొచ్చే జుగాడ్... చంద్రయాన్ –3 ఖర్చు రూ.600 కోట్లు ఉంటే.. ఇంతే స్థాయి అంతరిక్ష ప్రయోగానికి విదేశాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందనేది ఇప్పటికే మనకు అనుభవమైన విషయం. అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చగలగడం ఇస్రో ప్రత్యేకతగా మారింది. కాబట్టి సొంతంగా ఉపగ్రహాలు పంపుకోలేని చాలా దేశాలిప్పుడు భారత్‌ను ఆశ్రయిస్తాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇస్రోకు నేరుగా ప్రయోజనం కలిగితే ఈ సంస్థకు విడిభాగాలు, సామాన్లు సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలు బోలెడన్ని లాభాలు చవిచూస్తాయి. రక్షణ రంగంతోపాటు అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్శించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చంద్రయాన్–3 విజయం చాలా కీలకం కానుంది. విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, లేదా సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు, ఇతర అవసరాలకు వేర్వేరు శక్తిసామర్థ్యాలు కలిగిన జియోసింక్రనస్ లాంఛ్ వెహికల్ కలిగి ఉండటం ఇస్రోకు లాభించే ఇంకో అంశం. భవిష్యత్తు అవసరాల కోసం? 1972 తరువాత భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై మనిషి కాలుపెట్టలేదు. అయితే అక్కడ నీరు ఉందన్న విషయం స్పష్టమైన తరువాత చాలా దేశాలు వ్యోమగాములను పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికా తన ఆర్టిమిస్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఏడాదికల్లా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, అక్కడే ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. జాబిల్లిపై నీటితోపాటు చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాలుష్యరహితమైన, అత్యంత సమర్థమైన హీలియం–3 ఆ వనరుల్లో ఒకటి. భవిష్యత్తులో జాబిల్లిపైని వనరులను వాడుకునే అవకాశం లభిస్తే (శుద్ధి, రవాణా వంటి వాటికి తగిన టెక్నాలజీలు అభివృద్ధి చేసుకోవాలి) అందులో భారత్‌కూ భాగస్వామ్యం లభించేందుకు చంద్రయాన్–3 విజయం సాయపడుతుంది. అలాగే జాబిల్లిని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను అన్వేషించాలని, అంగారకుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనిషి చాలాకాలంగా ఆలోచిస్తున్నాడు. ఈ ప్రస్థానంలో జాబిల్లి దక్షిణ ధ్రువం మాదిరిగా ఇతర గ్రహాలపైని అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని వ్యోమనౌకలను ల్యాండ్ చేయడమెలా అన్నది తెలిసిన వారి అవసరం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇస్రో ఇప్పటికే అనేక దేశాలతో కలిసి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది. పరిశోధనల్లోనూ భాగస్వామిగా నిలిచింది. ఈ అనుభవమంతా భవిష్యత్తులో అంతరిక్షాన్ని మన అవసరాల కోసం ఉపయోగించుకునే సందర్భంలో ఉపయోగపడుతుంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత ప్రకటిత లక్ష్యానికి తగిన విధానాలను రూపొందించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా
రామచంద్రపురం: సైంటిస్ట్ ఆస్ట్రోనాట్‌గా ఎదగాలని కలలుగన్న ఓ యువతి ఆకాంక్షలకు ప్రభుత్వ సాయం తోడైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంగేటి జాహ్నవి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెకు అంతరిక్ష రంగంపై విపరీతమైన మక్కువ. అమెరికా నాసా శిక్షణకు ఎంపికైన ఈమెకు ఆర్థిక ఇబ్బంది తలెత్తింది. బీసీ సంక్షేమ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే సీఎం ఈ శిక్షణ కోసం ఆమెకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. దీంతో అమెరికాలోని నాసా అంతరిక్ష కేంద్రంలో నెల పాటు శిక్షణ పొందింది. ఇటీవల జాహ్నవి స్వస్థలం చేరుకుంది. మరికొన్నాళ్లు ఆమె శిక్షణ పొందాల్సి ఉంది. జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వేణును కలిసింది. చిరకాల స్వప్నమైన సైంటిస్ట్ ఆ స్ట్రోనాట్ కావడానికి సహకారాన్ని అందజేసిన సీఎం జగన్‌కు, మంత్రి వేణుకు కృతజ్ఞతలు తెలిపింది. -
Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విక్రమ్–ఎస్’ రాకెట్ ప్రయోగం మన దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నూతన సూర్యోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందన్నారు. ఆదివారం 95వ ‘మన్‌కీ బాత్’లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీ20కి సారథ్యం వహిస్తున్న దేశంగా ప్రపంచం ముందున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని చెప్పారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘స్పేస్’లో ప్రైవేట్ పాత్ర భేష్ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగం పాత్ర ప్రశంసనీయం. స్పేస్ సెక్టార్లో నవంబర్ 18న ‘కొత్త చరిత్రకు’ ప్రజలంతా సాక్షిభూతంగా నిలిచారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో డిజైన్ చేసి, రూపొందించిన తొలి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ రాకెట్‌ను తక్కువ ఖర్చుతో రూపొందించడం గొప్ప విషయం. స్పేస్ టెక్నాలజీలో భారత్ పరిమిత ఖర్చుతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంది. విక్రమ్–ఎస్ రాకెట్లో కొన్ని కీలక భాగాలను 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. ఈ రాకెట్ ప్రయోగం ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో నూతన సూర్యోదయం. కాగితాలతో విమానాలు తయారు చేసి, గాల్లోకి ఎగురవేసిన మన పిల్లలు ఇప్పుడు అసలైన విమానాలు తయారు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవాళ్లు ఇప్పుడు రాకెట్లు తయారు చేస్తున్నారు. విక్రమ్–ఎస్ ప్రయోగం భారత్–భూటాన్ సంబంధాలకు బలమైన నిదర్శనం. దేశమంతటా జీ20 కార్యక్రమాలు శక్తివంతమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహించనుండడం ప్రతి భారతీయుడికి గొప్ప అవకాశం. వసుధైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా జీ20కి ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్ ఇచ్చాం. జీ20కి సంబంధించిన కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా విదేశీయులు మన రాష్ట్రాలను సందర్శిస్తారు. మన విభిన్నమైన సంస్కృతి సంప్రదాయలను విదేశాలకు పరిచయం చేయొచ్చు. జీ20 కార్యక్రమాల్లో ప్రజలు.. ముఖ్యంగా యువత పాలుపంచుకోవాలి. యువత పరుగును ఆపడం కష్టం మన యువత గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్ప ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్షం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల విషయంలో సహచర యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. డ్రోన్ల తయారీలోనూ భారత్ వేగంగా పరుగులు తీస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవలే యాపిల్ పండ్లను డ్రోన్ల ద్వారా రవాణా చేశారు. నూతన ఆవిష్కరణ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుండడం సంతోషకరంమన యువత పరుగును ఆపడం ఇక కష్టం. ప్రపంచం నలు మూలలకూ మన సంగీతం సంగీత రంగంలోనూ భారత్ గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఎనిమిదేళ్లలో సంగీత పరికరాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకూ చేరుతోంది. తమ కళలు, సంస్కృతి, సంగీతాన్ని చక్కగా పరిరక్షించుకుంటున్న నాగా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ సూచించారు. యూపీలోని బన్సా గ్రామంలో ‘కమ్యూనిటీ లైబ్రరీ, రిసోర్స్ సెంటర్’ను స్థాపించిన జతిన్ లలిత్ సింగ్, జార్ఖండ్‌లో ‘లైబ్రరీ మ్యాన్’గా గుర్తింపు పొందిన సంజయ్ కశ్యప్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు
న్యూఢిల్లీ: ‘‘సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోంది. ఆ రంగాల్లో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించడాన్ని దేశానికి యువత ఇచ్చిన ప్రత్యేక దీపావళి కానుకగా అభివర్ణించారు. ఆదివారం నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వయంసమృద్ధి దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది తాజా తార్కాణం. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ రాకెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ మన శాస్త్రవేత్తలు దాన్ని సవాలుగా తీసుకుని దేశీయ పరిజ్ఞానం సాయంతోనే వాటిని నిర్మించి చూపించారు. ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా ఉపగ్రహాలను పంపి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో్ల భారత్ పెద్ద శక్తిగా నిలిచింది. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడంతో కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి’’ అన్నారు. మోదెరా స్ఫూర్తి: ప్రపంచమంతా పర్యావరణహిత సౌర విద్యుత్ కేసి మళ్లుతోందని మోదీ అన్నారు. ‘‘పీఎం కుసుమ్ యోజన ద్వారా ఎంతోమంది ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను విక్రయించి లాభపడుతున్నారు. గుజరాత్‌లోని మోదెరా దేశంలో తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో దేశమంతటా సూర్యగ్రామ్లు వెలుస్తాయి. ఇది త్వరలోనే భారీ ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. పాత సవాళ్లు వదిలేద్దాం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత సవాళ్లను ఇక వదిలేద్దామని, నూతన అవకాశాల నుంచి లబ్ధి పొందుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన రోజ్‌గార్ మేళానుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించాలని, కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందాలన్నదే తమ ఆశయమని ఉద్ఘాటించారు. మనమంతా కలిసి జమ్మూకశ్మీర్‌ను ఉన్నత శిఖరాలను చేర్చుదామని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో ప్రస్తుత దశాబ్దం జమ్మూకశ్మీర్ చరిత్రలో చాలా ముఖ్యమైన దశాబ్దమని చెప్పారు. పాత సవాళ్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికై, రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న 3,000 మంది యువతకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరో 700 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. తయారీ హబ్‌గా భారత్ వడోదర: రవాణా విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద తయారీ హబ్‌గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు. కొత్త మైండ్‌సెట్, కొత్త వర్క్‌కల్చర్‌తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’తోపాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఆ దిశగా ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. -
ఇక... వాణిజ్య గ‘ఘనమే’!
వినువీధిలో మరో విజయం దక్కింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చరిత్రలోనే అత్యంత బరువైన రాకెట్‌ను ఆదివారం నాడు విజయవంతంగా గగనతలంలోకి పంపి, మరో మైలురాయిని చేరుకుంది. ‘జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3’ (జీఎస్ఎల్వీ ఎంకే 3) రాకెట్‌తో దాదాపు 6 టన్నుల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ‘ఎల్వీఎం3– ఎం2’ అని కూడా ప్రస్తావించే ఈ రాకెట్ ఏకంగా 36 ఉపగ్రహాలతో ఇంత బరువును విహాయసంలోకి తీసుకువెళ్ళడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. విజయవంతమైన ఈ ప్రయోగం మన అత్యాధునిక ఉపగ్రహ వాహక నౌక ‘ఎల్వీఎం3’ రాకెట్ ఆచరణీయతను మరోసారి ధ్రువీకరించింది. ఆసక్తితో చూస్తున్న ‘గగన్‌యాన్’ లాంటి వాటికి ఆ రాకెట్ అన్ని విధాలా తగినదని తేల్చిచెప్పింది. అంతేకాక, భారీ ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించిన విపణిలో ఇస్రో బలమైన అభ్యర్థి అని చాటిచెప్పింది. ఈ పరిణామం అభినందనీయం. అందుకు అనేక కారణాలున్నాయి. భారత అంతరిక్ష విభాగ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలను చేపడుతోంది. ఆ ప్రయోగాలకు అంకితమైన రాకెట్ – ‘ఎల్వీఎం3’. 2017లో ఈ రాకెట్‌ను తొలిసారి ప్రయోగించారు. అప్పటి నుంచి మన దేశ కమ్యూనికేషన్ ఉపగ్రహాలనూ, ఇతర పేలోడ్లనూ నాలుగు సార్లు విజయవంతంగా వినువీధిలోకి పంపిన ఘనత ఈ రాకెట్ది. ఇప్పుడు తొలిసారిగా విదేశీ పేలోడ్‌ను వినువీధిలోకి పంపడానికి దీన్ని వినియోగించారు. జయకేతనం ఎగరే సిన ఈ రాకెట్ మనకు అందివచ్చిన అవకాశం. ఒకేసారి ఉపగ్రహాల్ని ఒక మండలంగా ప్రయోగిస్తూ పలు సంస్థల అవసరాల్ని తీర్చి, అంతర్జాతీయ విపణిలో ఆ ఖాళీ భర్తీకి ఇది ఉపకరిస్తుంది. నిజానికి, అక్టోబర్ 23 నాటి ఈ అంతరిక్ష ప్రయోగం ఎన్ఎస్ఐఎల్కూ, బ్రిటన్‌కు చెందిన ‘వన్ వెబ్’కూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగం. భారతీ గ్లోబల్ భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ వన్ వెబ్‌కు దిగువ భూకక్ష్య (ఎల్ఈఓ)లో పలు ఉపగ్రహాలు అవసరం. ఆ అవసరాన్ని ఇస్రో ఇలా తీరుస్తోంది. తాజా 36 ఉపగ్రహాలు కాక, మరో 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను రెండో విడతగా 2023లో ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఇలా రెండు ప్రయోగాలతో మొత్తం 72 ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి ఆ సంస్థ మన ఇస్రోకు రూ. 1000 కోట్లు చెల్లించింది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచవ్యాప్త టెలీకమ్యూనికేషన్లలో హైస్పీడ్ కనెక్టివిటీని అందించాలని వన్‌వెబ్ లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు మొత్తం 648 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపాలని సిద్ధమైంది. ఇప్పటికి 462 పంపగలిగింది. తాజా ప్రయోగంలో ఓ తిరకాసుంది. ప్రతి రెంటికీ మధ్య కనీసం 137 మీటర్ల దూరం ఉండేలా మొత్తం 36 ఉపగ్రహాలనూ 601 కి.మీ. కక్ష్యలో అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టాలి. వన్‌వెబ్‌కు ఉన్న ఈ అవసరాన్ని అతి సమర్థంగా నెరవేర్చడం ఇస్రో సాధించిన ఘనత. థ్రస్టర్లను ఉపయోగించి, క్రయో దశలోనే పదే పదే దిశానిర్దేశంతో, ఈ విన్యాసాన్ని ఇస్రో చేసిచూపింది. ఇస్రోకు మరిన్ని వాణిజ్య ఒప్పందాలు రావాలంటే – ఇప్పటి ప్రయోగం, అలాగే వచ్చే ఏటి రెండో విడత ప్రయోగం సక్సెస్ కావడం కీలకం. తాజా విజయం మన అంతరిక్ష ప్రయోగ సామర్థ్యానికి మరో మచ్చుతునక. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల గిరాకీకి తగ్గట్టు మన ఉపగ్రహ వాహక జవనాశ్వమైన ఎల్వీఎం3 రాకెట్ల తయారీని వేగవంతం చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. అసలు ఇలా ఒకేసారి ఉపగ్రహ మండలంగా పలు ఉపగ్రహాలను ఒకే కక్ష్యలోకి వాణిజ్యపరంగా పంపే వాహక నౌకల కొరత అంతర్జాతీయంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆ ఉపగ్రహా లను రక్షణ ప్రయోజనాలకు వాడబోమని హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టి, రష్యా ఈ వన్ వెబ్ అవకాశం వదులుకుంది. చైనా రాకెట్ల వాణిజ్య సత్తాను పాశ్చాత్యలోకంం అంగీకరించదు. ఫ్రాన్స్‌లో వీటి అభివృద్ధి ఆలస్యమైంది. ఇవన్నీ మనకు కలిసొచ్చాయి. ప్రస్తుతం అంతరిక్ష వాణిజ్య విపణిలో అంతర్జాతీయంగా భారత వాటా 2 శాతమే. తాజా ప్రయోగ విజయంతో దాన్ని గణనీయంగా పెంచుకొనే వీలు చిక్కింది. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో వద్ద పీఎస్ఎల్వీ మాత్రమే ఉంది. తాజా ఎల్వీఎం3–ఎం2 రాకెట్‌తో రెండో అస్త్రం చేరింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రాకెట్ ‘చంద్రయాన్–2’ సహా 4 ప్రయోగాల్ని సక్సెస్ చేసింది. మనిషిని విహాయసంలో విహరింపజేసే ‘గగన్‌యాన్’కూ దీన్నే స్వల్ప మార్పులతో సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏటి ‘చంద్రయాన్–3’కీ, సూర్య గ్రహ అధ్యయనమైన ‘ఆదిత్య ఎల్1’కూ సన్నాహాలు సాగుతుండడం గర్వకారణం. రాబోయే రోజుల్లో ఉపగ్రహ సేవలనేవి అతి పెద్ద వ్యాపారం. 5జీ వస్తున్నవేళ టెలికామ్ సేవలకు కీలకమైన ఎల్ఈఓ ఉపగ్రహాలను గగనంలోకి పంపే విపణిలో ఆటగాడిగా మనం అవతరించడం శుభసూచకం. మనకూ ఉపయుక్తం. ఇదే ఊపు కొనసాగితే వచ్చే 2025 కల్లా మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 1300 కోట్ల డాలర్ల (రూ.1.07 లక్షల కోట్ల) ఆదాయాన్ని అందుకుంటుందట. ఉపగ్రహ సేవల విపణి 500 కోట్ల డాలర్లకూ, గ్రౌండ్ సేవలు 400 కోట్ల డాలర్లకూ చేరుకుంటాయని లెక్క. వెరసి, రాగల మూడేళ్ళలో ఉపగ్రహ, ప్రయోగ సేవల్లో మనం మునుపెన్నడూ లేనట్టు 13 శాతం అత్యధిక వార్షిక వృద్ధి రేటు సాధిస్తామన్న మాట ఈ ఆనందానికి మరిన్ని రెక్కలు తొడుగుతోంది. దేశీయ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం శ్రీకారం చుట్టుకుంది. అంతరిక్ష వాణిజ్య సేవల రంగంలో దేశంలో రానున్న పెనుమార్పులకు స్వాగతం... శుభ స్వాగతం! -
అంతరిక్షంలో ‘ధృవ’
సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో... కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్ఎస్ఐఎల్)లో హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష ఇంజనీరింగ్ పరిష్కారాల ఆవిష్కర్త ‘ధృవ స్పేస్ ప్రైవేటు లిమిటెడ్’ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అంతరిక్ష రంగంలో తొలిసారి ప్రైవేటుగా వాణిజ్య ప్రయోగ సేవల్ని ‘ధృవ స్పేస్’అందించనుంది. స్పేస్‌క్రాఫ్ట్ ప్లాట్ఫారం, నియంత్రణ, సమాచార, విద్యుత్ వ్యవస్థలు, సోలార్ ప్యానెళ్లతో ఉపగ్రహ ప్రయోగ రంగంలో ‘ధృవ స్పేస్ ఆర్బిటల్ డిప్లాయర్స్’(డీఎస్‌ఓడీ) పేరిట కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఉపగ్రహ వాహక నౌకల్లో భద్రతా ప్రమాణాలు, కచ్చితత్వం నెలకొల్పడంతో పాటుగా వాటిని మరింత సులువుగా ప్రయోగించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. ఒప్పందానికి తొలిమెట్టు డీఎస్‌ఓడీ టెక్నాలజీ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ), స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ)లో ధృవ తన డీఎస్‌ఓడీ సాంకేతికత ద్వారా ప్రయోగ సేవలు అందించడానికి ఇది తొలిమెట్టు. ఒప్పం దం మేరకు ధృవ తొలుత ‘డీఎస్‌ఓడీ –1యు ç పరీ క్షించనున్నారు. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరింది లేనిదీ కచ్చితంగా తెలిపే సెన్సర్లు ఈ సాంకేతికతలో కీలకంగా పరిగణిస్తున్నారు. మరో ఏడాది కాలంలో మరింత సామర్థ్యంతో కూడిన డీఎస్‌ఓడీ 3యు, 6యు, 12యు డిప్లాయర్స్ పనితీరునూ ‘ధృవ’ పరీక్షించనుంది. ఇన్‌స్పేస్, ఇస్రో, కేంద్ర అంతరిక్ష విభాగం నుంచి లభించిన మద్దతుతో స్మాల్ శాటిలైట్ సాంకేతికతలో దేశీయ ఆవిష్కరణలకు చోటు లభించిందని ధృవ స్పేస్ సీఈఓ సంజయ్ నెక్కంటి వ్యాఖ్యానించారు. దీంతో భారతీయ అంతరిక్ష స్టార్టప్‌లకు మరింత ఊతం లభిస్తుందని ఎన్ఎస్ఐఎల్ సీఎండీ డాక్టర్ రాధాకృష్ణ దురైరాజ్ చెప్పారు. -
భారత అంతరిక్షరంగంలోకి ప్రైవేటు కంపెనీలు..!
న్యూఢిల్లీ: భారత్‌ను అంతరిక్ష రంగంలో అగ్రదేశాల సరసన నిలిచేందుకు ఇస్రో ఎంతగానో కృషి చేసింది. పలు మైలురాళ్లను జయించి భారత్‌ను అంతరిక్షరంగ చరిత్రపుటల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఇస్రో నెలకొల్పింది. ఇస్రో ప్రభుత్వ రంగ సంస్థ తెలిసిన విషయమే.. స్పేస్ సెక్టార్‌లోకి ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తే మరిన్ని విజయాలను సాధించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అంతరిక్షరంగంలోకి ప్రైవేటు కంపెనీలు భవిష్యత్తులో రానున్నాయి. ప్రైవేటు సంస్థలు రాకెట్ ప్రయోగాలను, లాంచింగ్ స్టేషన్లను దేశ భూభాగంలో లేదా ఇతర దేశాల్లో ప్రయోగాలను చేసే వెసులబాటును కేంద్రం ప్రభుత్వం కల్పించనుంది. కేంద్ర అంతరిక్ష మంత్రిత్వ శాఖ (డీవోఎస్) ఆధీనంలోని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనే స్వతంత్ర సంస్థ నుంచి ప్రైవేటు సంస్థలు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-2020 పేరుతో తెచ్చిన ముసాయిదాలో ప్రైవేటు కంపెనీలు రాకెట్ ప్రయోగాల కోసం లాంచింగ్ స్టేషన్లను సొంతంగా, లేదా లీజు ద్వారా భూమిని సేకరించుకోవచ్చునని తెలిపింది. ఈ ముసాయిదాపై ప్రముఖ భారత ప్రైవేటు కంపెనీలు అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఎరోస్పేస్ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. కేంద్ర తెచ్చిన ముసాయిదాతో రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన స్టేషన్లను, లాంచింగ్ ప్యాడ్లను సులువుగా ఏర్పాటుచేసుకునే అవకాశం ఉందని కంపెనీలు పేర్కొన్నాయి. అగ్నికుల్ కాస్మోస్ చిన్న ఉపగ్రహలను భూ నిర్ణీత కక్ష్యలోకి ప్రయోగిస్తోంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ చిన్నచిన్న రాకెట్ నౌకలను తయారు చేస్తోంది. చదవండి: వ్యోమగాములను సైతం అవాక్కయేలా చేయనున్న టైడ్! -
అవినాశ్ చందర్ కు ఆర్యభట్ట అవార్డు
సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష రంగంతోపాటు వైమానిక రంగంలో చేసిన విశేష సేవలకుగాను డీఆర్డీవో మాజీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అవినాశ్ చందర్ ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు అందుకున్నారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్లో గురువారం జరిగిన ఏఎస్ఐ-ఇస్రో అవార్డుల కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆర్.చిదంబరం, ఇస్రో చైర్మన్ డాక్టర్ కిరణ్‌కుమార్ చేతుల మీదుగా అవినాశ్ చందర్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం లభిస్తాయి. బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తికి రాకెట్ టెక్నాలజీ అవార్డు హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అసోసియేట్ డెరైక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తికి రాకెట్, రాకెట్ సంబంధిత టెక్నాలజీల అభివృద్ధి అవార్డు లభించింది. రాకెట్లలోని కంప్యూటర్ల డిజైనింగ్, మిసైల్ లాంచ్ ప్రాసెస్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించినందుకు గాను నారాయణమూర్తికి ఈ అవార్డు అందజేశారు. -
అంతరిక్షానికి అంతే!
న్యూఢిల్లీ: భారత తొలి అంగారక యాత్ర గతేడాది దిగ్విజయం అయినప్పటికీ అంతరిక్ష విభాగానికి తాజా బడ్జెట్లో గతేడాది మాదిరిగా అంతే ప్రాధాన్యం ఇచ్చారు. అంతరిక్ష శాఖకు రూ. 6000 కోట్లు కేటాయించారు. వీటిలో రూ. 2148 కోట్ల నిధులు ఉపగ్రహ వాహక నౌకల తయారీ ప్రాజెక్టులకే కేటాయించారు. ఉపగ్రహాల ట్రాకింగ్‌కు, ప్రయోగాలకు మద్దతు కోసం రూ. 651 కోట్లు, ఇన్శాట్, జీశాట్ ఉపగ్రహాల నిర్వహణకు రూ. 1281 కోట్లు ఇచ్చారు. జీశాట్-15 ఉపగ్రహ ప్రయోగానికి రూ. 165 కోట్లను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని షార్ అంతరిక్ష కేంద్రంలో మూడో ప్రయోగ వేదిక నిర్మాణం కోసం రూ. 385 కోట్లు ఇచ్చారు. చంద్రయాన్-2 కోసం రూ. 40 కోట్లు, ఆదిత్య ఉపగ్రహ ప్రాజెక్టు కోసం రూ. 20 కోట్లను కేటాయించారు. గతేడాది బడ్జెట్లో అంతరిక్ష శాఖకు రూ. 6 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే దానిని రూ. 4500 కోట్లకు కుదించారు. -
ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పదవీ విరమణ
సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో మరిన్ని ప్రయోగాలతో విజయాలు సాధించి భారత్‌ను ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలపాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఇస్రో చైర్మన్‌గా తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి చేపట్టిన ప్రయోగాలను విజయవంతం చేసేందుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో చైర్మన్‌గా పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన బుధవారం బెంగళూరు కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాల డెరైక్టర్లతో మాట్లాడారు. మధ్యాహ్నం 3.30కి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి శైలేశ్ నాయక్‌కు అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆయన పదవిలో కొనసాగుతారు. అంతరిక్ష శాఖ కార్యదర్శి ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, సీనియర్ శాస్త్రవేత్తను కాకుండా శైలేశ్‌ను అంతరిక్ష శాఖ కార్యదర్శిగా నియమించడంపై ఇస్రో వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ పదవికి షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, కిరణ్ కుమార్ల పేర్లను కమిటీ ఇదివరకే సూచించింది. అయితే, ప్రధాని మోదీ బిజీగా ఉండటం వల్ల ఇస్రో చైర్మన్ ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఇది తాత్కాలిక నియామకమేనని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి.