అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయపరంపర వాణిజ్యపరంగా కాసుల వర్షం కురిపించటం కొత్తేం కాదు. అంతరిక్షంలో మనకన్నా చాలాముందే అనేక విజయాలు నమోదు చేసుకున్న దేశాలకు సైతం ఈ విషయంలో మన ఇస్రో సంస్థ దీటుగా నిలిచిన వైనం కూడా పాత కథే. మరోసారి దీన్ని అంతర్జాతీయ అంతరిక్ష సలహా సంస్థ నోవాస్పేస్ నివేదిక ధ్రువపరిచింది. గత పదేళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ కొచ్చిన ఆదాయం 6,300 కోట్ల డాలర్లని నివేదిక తెలిపింది.
అంటే మన జీడీపీ వృద్ధిలో ఇస్రో పాత్ర ఎనలేనిదన్న మాట. ఈ రంగం నానాటికీ విస్తరిస్తోంది. అవసరాలు పెరుగుతున్న కారణంగా అవకాశాలు కూడా ఊహకందని రీతిలో విస్తరిస్తున్నాయి. మన అంతరిక్ష రంగంలో ప్రత్యక్షంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 96,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా... మొత్తంగా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు. రానున్న కాలంలో ప్రైవేటు రంగ పెట్టు బడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలను గమనిస్తే మున్ముందు ఉద్యోగావ కాశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించవచ్చు.
అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడు లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిరుడు నిర్ణయించింది. పర్యవసానంగా 2020లో 54 స్టార్టప్‌లుండగా ఇప్పుడవి 200కు చేరుకున్నాయి. మన దేశం మాత్రమే కాదు... లాభదాయకమని తేలడంతో పలు దేశాలు సైతం అంతరిక్ష రంగ పెట్టుబడులపై శ్రద్ధ పెడుతున్నాయి. ఆ రంగాన్ని విస్తరించ టానికి కృషి చేస్తున్నాయి. వచ్చే పదేళ్లలో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 18 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని ఆమధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కేసింది. పెట్టుబడుల రీత్యా మన అంతరిక్ష రంగం ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది.
అంతిమంగా అతి పెద్ద విజయం సాధించటానికి ముందు తప్పులు దొర్లటం అతి సహజమనీ, ఏ విజయానికైనా ఇలాంటి చరిత్రే ఉంటుందనీ ప్రముఖ అణు శాస్త్రవేత్త నీల్స్ బోర్ ఎప్పుడో చెప్పారు. మన అంతరిక్ష రంగం కూడా ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. 1975లో ఆర్యభట్ట ఉప గ్రహ ప్రయోగం తర్వాత మన అంతరిక్ష కార్యక్రమం పట్టాలెక్కడానికి పదేళ్లు పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ సమస్య అయినా అత్యంత క్లిష్టమైనదని చెప్పడానికి రాకెట్ సైన్స్‌తో పోలుస్తుంటారు. ఒక రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోవాలన్నా, నిర్దిష్ట కక్ష్యలో ఉపగ్రహాన్ని ఉంచాలన్నా ఎన్నో సూక్ష్మ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
సాంకేతికంగా రాకెట్‌లోని వ్యవస్థలూ, ఉప వ్యవస్థలూ ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవాలి. చిన్న లోపమైనా చోటుచేసుకోకూడదు. ఒక ఉపగ్రహాన్ని పంపటానికే ఇంత సంక్లిష్ట ప్రక్రియ అవసరం కాగా, ఒకేసారి బహుళ ఉపగ్రహాలను ప్రయోగించటం అంటే మాటలు కాదు. ఇస్రో ఇలాంటి విన్యాసాలను అవలీలగా పూర్తి చేయగలిగిందంటే దాని వెనకున్న దశాబ్దాల కృషి సామాన్యమైనది కాదు.
పైగా అగ్రరాజ్యాలు ఉపగ్రహాలనుపంపటానికి వసూలు చేసే సొమ్ముతో పోలిస్తే ఇస్రో ధర ఎంతో చవక. అందువల్లే అనేక దేశాలు తమ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోను ఎన్నుకుంటున్నాయి. వేరే అంతరిక్ష ప్రయోగ సంస్థలతో పోలిస్తే ఇస్రో చేసే వ్యయం అతి తక్కువ. మన దేశం గత దశాబ్దంలో 1,300 కోట్ల డాలర్లు వ్యయం చేయగా 6,300 కోట్ల డాలర్ల ఆదాయం రావటం ఇందుకే. 2014లో ఈ ఆదాయం కేవలం 3,800 కోట్ల డాలర్లని గుర్తుపెట్టుకుంటే మనవాళ్లు సాధించిన ఘనతేమిటో అర్థమవుతుంది.
అంతరిక్ష పరిజ్ఞానం మన నిత్య జీవితంతో అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. టెలికాంరంగం ప్రస్తుతం 6జీ వైపుగా అడుగులేస్తున్నదంటే అది మన ఉపగ్రహాల సమర్థత వల్లనే. రిసోర్స్ శాట్, కార్టోశాట్ వంటివి పంట భూమి స్వభావం, మట్టిలో తేమ శాతం, పంటల తీరుతెన్నులు తది తర అంశాల్లో ఎప్పటికప్పుడు రైతుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వారు తగిన ప్రణాళికలు రూపొందించుకునేందుకు, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడి సాగు దిగుబడిని పెంచటానికి దోహదం చేస్తున్నాయి.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తం చేయటానికి, ఏదైనా అనుకోని దుర్ఘటన సంభవిస్తే తక్షణం సహాయ సిబ్బంది రంగంలోకి దిగటానికి ఉపగ్రహాలు సమాచారమిస్తున్నాయి. నిత్యం దేశంలో 8 లక్షలమంది మత్స్యకారులు ఈ ఉపగ్రహాలు అందించే సమాచారంతో లబ్ధి పొందుతున్నారు. పట్టణప్రాంత ప్రణాళికలకూ, మౌలిక సదుపాయాల పర్య వేక్షణకూ ఇస్రో పంపిన ఉపగ్రహాల సమాచారం ఉపయోగపడుతోంది. ఇస్రో అంతరిక్ష రంగ కార్య కలాపాలను రానున్నకాలంలో మరింత విస్తృతం చేయదల్చుకుంది.
ప్రపంచ అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థలో ఇస్రో వాటా ప్రస్తుతం 2 శాతం. దీన్ని 2034 నాటికి 10 శాతానికి పెంచాలన్నది ఇస్రో లక్ష్యం. అంతరిక్ష సాంకేతికతల్లో స్వావలంబన సాధించే దిశగా ఇప్పటికే అనేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉపగ్రహాలకు అవసరమైన హార్డ్‌వేర్ కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తున్నది. ఆ విషయంలో సాగుతున్న పరిశోధన, అభివృద్ధి పర్యవసానంగా ఇప్పటికే ఎన్నో కొత్త సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి.
అయితే అంతరిక్షంలో ఆధిపత్యాన్ని సాధించి అందరినీ శాసించేందుకు ఇప్పటికే అమెరికా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. తనకు అనుకూలంగా అంతర్జాతీయ అంతరిక్ష న్యాయనిబంధనలు రూపొందేలా పావులు కదుపుతోంది. కనుక మనం అప్రమత్తంగా ఉండటం, అందుకు తగిన వ్యూహ రచన చేయటం ముఖ్యం. ఇస్రో ఏర్పడిన ఈ అర్థ శతాబ్దపు కాలంలో ఆ సంస్థ చేసిన కృషి అసాధా రణమైనదీ, అనుపమానమైనదీ. దాన్ని మరింత విస్తృతపరుచుకుంటేనే గగనవీధుల్లో విజయపరంపర నిరంతరం సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment