న్యూఢిల్లీ: భారత తొలి అంగారక యాత్ర గతేడాది దిగ్విజయం అయినప్పటికీ అంతరిక్ష విభాగానికి తాజా బడ్జెట్‌లో గతేడాది మాదిరిగా అంతే ప్రాధాన్యం ఇచ్చారు. అంతరిక్ష శాఖకు రూ. 6000 కోట్లు కేటాయించారు. వీటిలో రూ. 2148 కోట్ల నిధులు ఉపగ్రహ వాహక నౌకల తయారీ ప్రాజెక్టులకే కేటాయించారు. ఉపగ్రహాల ట్రాకింగ్‌కు, ప్రయోగాలకు మద్దతు కోసం రూ. 651 కోట్లు, ఇన్‌శాట్, జీశాట్ ఉపగ్రహాల నిర్వహణకు రూ. 1281 కోట్లు ఇచ్చారు.
జీశాట్-15 ఉపగ్రహ ప్రయోగానికి రూ. 165 కోట్లను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని షార్ అంతరిక్ష కేంద్రంలో మూడో ప్రయోగ వేదిక నిర్మాణం కోసం రూ. 385 కోట్లు ఇచ్చారు. చంద్రయాన్-2 కోసం రూ. 40 కోట్లు, ఆదిత్య ఉపగ్రహ ప్రాజెక్టు కోసం రూ. 20 కోట్లను కేటాయించారు. గతేడాది బడ్జెట్‌లో అంతరిక్ష శాఖకు రూ. 6 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే దానిని రూ. 4500 కోట్లకు కుదించారు.