![PM Narendra Modi holds talks with Elon Musk](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/modi.jpg.webp?itok=4yRmxHuV)
వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్‌లో తనతో భేటీకి స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ పిల్లలను తీసుకురావడంతో వారిని పలకరిస్తున్న ప్రధాని మోదీ
ఆవిష్కరణలు,అంతరిక్ష రంగంపై చర్చలు
వాషింగ్టన్: ప్రధాని మోదీ గురువారం స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరూ ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణలు, భారత్‌లో టెస్లా విస్తరణ వంటి అంశాలే కేంద్రంగా చర్చలు జరిపారు. ‘అంతరిక్ష రంగం, రవాణా, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు మస్క్‌తో సుహుృద్భావపూర్వక భేటీలో చర్చకు వచ్చాయి. మస్క్ ఆమితాసక్తి చూపే ఈ అంశాలపై ఆయనతో లోతుగా చర్చించా. పాలనా యంత్రాంగంలో భారత్ తలపెట్టిన సంస్కరణల గురించి వివరించా.
అతితక్కువ ప్రభుత్వ జోక్యం.. హెచ్చుగా పాలన అవే మా లక్ష్యమని తెలిపా’ అని మోదీ ’ఎక్స్’లో పేర్కొన్నారు. వీరి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే తెలియరాలేదు. బ్లెయిర్ హౌస్‌లో జరిగిన ఈ భేటీకి మస్క్ తన ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్‌లను తీసుకు రావడం విశేషం. ఉన్నత స్థాయి సమావేశాలకు సైతం తన పిల్లలను వెంటబెట్టుకు వెళ్లడం మస్క్ ప్రత్యేకత.
వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్‌లో తనతో భేటీకి స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ పిల్లలను తీసుకురావడంతో వారిని పలకరిస్తున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని మోదీతో తమ తండ్రి చర్చలు జరుపుతుండగా పక్కనే కూర్చుని ఉన్న ముగ్గురు పిల్లలూ ఆసక్తిగా తిలకిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. వీరిలో ఎక్స్ సరదాగా కనిపించగా, మిగతా ఇద్దరూ అలెర్ట్‌గా ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు అంతరిక్ష రంగాల్లో భారత్ కీలకంగా మారుతున్న తరుణంలో మోదీ, మస్క్‌ల భేటీతో భారత్ మార్కెట్‌తో మస్క్ కంపెనీల బంధం బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)కి మస్క్ సారథ్యం వహిస్తుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment