ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పదవీ విరమణ
సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో మరిన్ని ప్రయోగాలతో విజయాలు సాధించి భారత్‌ను ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలపాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఇస్రో చైర్మన్‌గా తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి చేపట్టిన ప్రయోగాలను విజయవంతం చేసేందుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇస్రో చైర్మన్‌గా పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన బుధవారం బెంగళూరు కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాల డెరైక్టర్లతో మాట్లాడారు. మధ్యాహ్నం 3.30కి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి శైలేశ్ నాయక్‌కు అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆయన పదవిలో కొనసాగుతారు. అంతరిక్ష శాఖ కార్యదర్శి ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, సీనియర్ శాస్త్రవేత్తను కాకుండా శైలేశ్‌ను అంతరిక్ష శాఖ కార్యదర్శిగా నియమించడంపై ఇస్రో వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ పదవికి షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, కిరణ్ కుమార్‌ల పేర్లను కమిటీ ఇదివరకే సూచించింది. అయితే, ప్రధాని మోదీ బిజీగా ఉండటం వల్ల ఇస్రో చైర్మన్ ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఇది తాత్కాలిక నియామకమేనని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి.