న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్‌లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్‌నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు.
అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్‌ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి.
అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్‌లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్‌ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment