![ISRO plans after Chandrayaan-3 mission - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/24/WHAT-NEXT.jpg.webp?itok=ziB_D8oT)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన రెండో ప్రయత్నంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేయడంలో విజయం సాధించింది. భవిష్యత్తు ఏమిటన్న విషయానికి క్లుప్తంగా ఇవ్వగలిగిన సమాధానం ఆకాశమే హద్దుగా అంతరిక్ష రంగంలో మనదైన ముద్రను వేయడమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే రష్యా, ఇజ్రాయెల్‌లు రెండూ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు విఫలయత్నం చేశాయి. భారత్ మాత్రమే విజయం సాధించగలిగింది.
కచ్చితంగా ఇది భారత శాస్త్రవేత్తల సునిశిత ప్లానింగ్, ఆలోచన, నిబద్ధతలకు ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి చంద్రయాన్–3 తరువాత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో వైపు చూసే దేశాల సంఖ్య నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత అంతరిక్ష ప్రయోగ మార్కెట్ విలువ దాదాపు 800 కోట్ల డాలర్లని అంచనా. 2040 నాటికి ఇది ఐదు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే ఒక అంచనా ఉండగా.. చంద్రయాన్–3 విజయం ఈ లక్ష్యాన్ని మరింత ముందుగానే అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కొన్నేళ్లుగా భారత అంతరిక్ష రంగం ఇతర దేశాల కంటే రెట్టింపు వేగంతో ఎదుగుతున్న విషయం తెలిసిందే.
కలిసొచ్చే జుగాడ్...
చంద్రయాన్ –3 ఖర్చు రూ.600 కోట్లు ఉంటే.. ఇంతే స్థాయి అంతరిక్ష ప్రయోగానికి విదేశాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందనేది ఇప్పటికే మనకు అనుభవమైన విషయం. అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చగలగడం ఇస్రో ప్రత్యేకతగా మారింది. కాబట్టి సొంతంగా ఉపగ్రహాలు పంపుకోలేని చాలా దేశాలిప్పుడు భారత్‌ను ఆశ్రయిస్తాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం.
ఇస్రోకు నేరుగా ప్రయోజనం కలిగితే ఈ సంస్థకు విడిభాగాలు, సామాన్లు సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలు బోలెడన్ని లాభాలు చవిచూస్తాయి. రక్షణ రంగంతోపాటు అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్శించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చంద్రయాన్–3 విజయం చాలా కీలకం కానుంది. విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, లేదా సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు, ఇతర అవసరాలకు వేర్వేరు శక్తిసామర్థ్యాలు కలిగిన జియోసింక్రనస్ లాంఛ్ వెహికల్ కలిగి ఉండటం ఇస్రోకు లాభించే ఇంకో అంశం.
భవిష్యత్తు అవసరాల కోసం?
1972 తరువాత భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై మనిషి కాలుపెట్టలేదు. అయితే అక్కడ నీరు ఉందన్న విషయం స్పష్టమైన తరువాత చాలా దేశాలు వ్యోమగాములను పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికా తన ఆర్టిమిస్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఏడాదికల్లా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, అక్కడే ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. జాబిల్లిపై నీటితోపాటు చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
కాలుష్యరహితమైన, అత్యంత సమర్థమైన హీలియం–3 ఆ వనరుల్లో ఒకటి. భవిష్యత్తులో జాబిల్లిపైని వనరులను వాడుకునే అవకాశం లభిస్తే (శుద్ధి, రవాణా వంటి వాటికి తగిన టెక్నాలజీలు అభివృద్ధి చేసుకోవాలి) అందులో భారత్‌కూ భాగస్వామ్యం లభించేందుకు చంద్రయాన్–3 విజయం సాయపడుతుంది. అలాగే జాబిల్లిని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను అన్వేషించాలని, అంగారకుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనిషి చాలాకాలంగా ఆలోచిస్తున్నాడు.
ఈ ప్రస్థానంలో జాబిల్లి దక్షిణ ధ్రువం మాదిరిగా ఇతర గ్రహాలపైని అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని వ్యోమనౌకలను ల్యాండ్ చేయడమెలా అన్నది తెలిసిన వారి అవసరం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇస్రో ఇప్పటికే అనేక దేశాలతో కలిసి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది. పరిశోధనల్లోనూ భాగస్వామిగా నిలిచింది. ఈ అనుభవమంతా భవిష్యత్తులో అంతరిక్షాన్ని మన అవసరాల కోసం ఉపయోగించుకునే సందర్భంలో ఉపయోగపడుతుంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత ప్రకటిత లక్ష్యానికి తగిన విధానాలను రూపొందించవచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment