shaar
-
PROBA-3: అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. రెండు ఉపగ్రహాలు... ఒకటిగా! ‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఎందుకీ ప్రయోగం? సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.ఉపయోగాలేమిటి? → సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. → విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. → గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. → కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. – జమ్ముల శ్రీకాంత్ -
ఇస్రో అమ్ములపొదిలోకి మరో రాకెట్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమ్ముల పొదిలోకి మరో రాకెట్ చేరింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డి–3 ప్రయోగాన్ని శుక్రవారం ఉదయం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–08), ఎస్ఆర్–0 డెమోశాట్ అనే రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి శుక్రవారం తెల్లవారుజామున 2.47 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఆరున్నర గంటలపాటు కౌంట్‌డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు ఎస్ఎస్ఎల్వీ డి–3 రాకెట్ నింగివైపునకు దూసుకెళ్లింది. రాకెట్‌లోని మొత్తం నాలుగు దశలు సక్రమంగా పనిచేయడంతో 16.56 నిమిషాల్లోనే ప్రయోగం విజయవంతంగా ముగిసింది. భూమికి 475 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లో 37.2 డిగ్రీల వృత్తాకారపు కక్ష్యలోకి విజయవంతంగా ఉప గ్రహాలను ప్రవేశపెట్టారు. మొదట ఈవోఎస్–08ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇస్రో చిన్న తరహా ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా గుర్తింపు పొందింది. ఇవీ ఉపయోగాలు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–08లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం–రిప్లెక్టోమెట్రీ, ఎస్ఐసీ యూవీ డొసిమీటర్ అనే మూడు రకాల పేలోడ్స్‌ను అమర్చారు. వీటి ద్వారా ఈ ఉపగ్రహం భూమి మీద వాతావరణ పరిస్థితులు(¿ౌగోళిక–పర్యావరణం)పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమాచారాన్ని చేరవేస్తుంది. ముఖ్యంగా అటవీ, వ్యవసాయం, భూమి స్వభావం, నీరు అధ్యయనాలకు సంబం«ధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం ఒక్క ఏడాదే సేవలు అందిస్తుంది. వాణిజ్యపరంగా కూడా వినియోగిస్తాంఎస్ఎస్ఎల్వీ డి–3 ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ ఇస్రోలో సరికొత్తగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్ చేరిందని చెప్పారు. ఇప్పటిదాకా ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ఐదు రకాల రాకెట్లు మాత్రమే ఉండేవని తెలిపారు. 2022 ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ డి–1 రాకెట్ విఫలం కావడంతో అందులో ఏర్పడిన లోపాలను సరిచేసి.. ముందస్తు పరీక్షలు నిర్వహించి ఎస్ఎస్ఎల్వీ డి–3 ప్రయోగానికి సిద్ధమయ్యామన్నారు. దీనికోసం అహరి్నశలు పనిచేసిన ఇస్రోలోని అన్ని విభాగాలకు అభినందనలు తెలిపారు. వాణిజ్యపరంగా కూడా ఈ రాకెట్‌ను వినియోగిస్తామని చెప్పారు. వెహికల్ డైరెక్టర్ ఎస్ఎస్ వినోద్, శాటిలైట్ డైరెక్టర్ ఎ.ఆవినాష్ మాట్లాడుతూ ఉపగ్రహం నుంచి నిర్దేశించిన విధంగా సిగ్నల్స్ అందాయని తెలిపారు.ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలుసాక్షి, అమరావతి: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డి–3ని విజయవంతంగా ప్రయోగించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–08), ఎస్ఆర్–0 డెమోశాట్ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఈ విజయం ఇస్రోను ప్రపంచ వేదికపై నిలిపిందని ఆయన పేర్కొన్నారు. -
ఎస్ఎస్ఎల్వీ డీ–3 ప్రయోగం నేడే
సూళ్లూరుపేట/తిరుమల: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3) ప్రయోగించేందుకు సిద్ధమైంది. ప్రయోగాన్ని 16.56 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తి చేసే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్న మయ్యారు.ఏదైనా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ సమయం కొద్దిగా మార్పు చేసే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. మధ్యా హ్నం ఒంటి గంటకు మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి ఏడు గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.17 కౌంట్ డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ ఏడు గంటల కౌంట్ డౌన్ ప్రక్రియలో నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపడంతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారన్నమాట. అయితే ఈ ప్రయోగంలో మూడు దశలూ ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. దీనికి కౌంట్‌డౌన్ సమయాన్ని అతికొద్ది గంటలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ప్రయోగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ వివరాలు.. ప్రయోగమిలా..ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ 34 మీటర్లు పొడువు రెండు మీటర్లు వెడల్పు 119 టన్నుల బరువుతో నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాన్ని 16 (994 సెకన్లు) నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లకు పూర్తి చేయనున్నారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లకు, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లకు పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 808 సెకన్లకు 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ) ఈఓఎస్–08) మొదటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఎస్ఆర్–0 డెమోశాట్ అనే ఉపగ్రహాన్ని 994 సెకన్లు భూమికి 475 కిలో మీటర్లు ఎత్తులోని లియో అర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తి చేసేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. కౌంట్‌డౌన్ వ్యవధి తక్కువ..ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్‌కు కౌంట్‌డౌన్ సమయాన్ని తక్కువగా అంటే ఏడు గంటల వ్యవ«ధి మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాకెట్ మొదటి మూడు దశలు ఘన ఇంధనాన్ని ఉపయోగించి చేయనున్నారు. అంటే ఘన ఇంధనాన్ని ముందుగానే నింపి రాకెట్‌ను అనుసంధానం చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపేందుకు మాత్రమే కౌంట్‌డౌన్ సమయాన్ని తీసుకున్నారు. ఈ ప్రయోగంలో నాలుగోదశలో 0.05 టన్నులు మాత్రమే ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నారు. అందుకే ఏడు గంటల కౌంట్‌డౌన్ సమయం వ్యవధిలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి ఈ తక్కువ సమయాన్ని తీసుకున్నారు. ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగమిది. షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగం కావడం విశేషం. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలుతిరుమల శ్రీవారి సన్నిధిలో ఎస్ఎస్ఎల్వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలకు ఇస్రో అధికారులు గురువారం ప్రత్యేక పూజలు చేయించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోదతో కలసి శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
గగన్‌యాన్‌కు ముందు నింగిలోకి టీవీ–డీ1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మానవ సహిత గగన్‌యాన్ ప్రాజెక్టుకు ముందు ఈనెల 21న మానవ రహిత ప్రయోగం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్ సిస్టం (వ్యోమగాముల గది)తో కూడిన గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)ను శనివారం ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదికనుంచి ప్రయోగించనున్నారు. ఇప్పటికే పలు రకాల భూస్థిర పరీక్షలను నిర్వహించారు. ఇందులోని మోటార్ల పనితీరును నిర్థారించుకున్నారు. ఎంఎస్‌టీలో టీవీ–డీ1 రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తి చేశారు. ఈ టీవీ–డీ1 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ సిస్టంను భూమికి సుమారు 17 కిలో మీటర్ల దూరంలోని అంతరిక్షంలోకి పంపించి తిరిగి దాన్ని సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ సిస్టంను అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 పారాచూట్ల సాయంతో శ్రీహరికోట తీరం నుంచి 10 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దించి.. నేవీ సాయంతో ప్రత్యేక బోట్లో అక్కడ నుంచి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించే ప్రయోగం ఇది అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగం ఇప్పటికే ఒక రూపానికి వచ్చిందని, ఆ ప్రయోగంలో టీవీ–డీ1 మొట్టమొదటి అంకమని ఆయన చెప్పారు. టీవీ–డీ1 ప్రయోగమిలా.. ♦ టీవీ–డీ1 ప్రయోగాన్ని 531.8 సెకన్లకు పూర్తి చేయనున్నారు. 34.954 మీటర్లు పొడవు కలిగిన టీవీ–డీ1 రాకెట్ ప్రయోగ సమయంలో 44 టన్నుల బరువు ఉంటుంది. ♦ ప్రయోగం ప్రారంభమైన 60.6 సెకన్లకు టెక్నికల్ వెహికల్ నుంచి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం విడిపోతుంది. ♦ 90.6 సెకన్లకు క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. ♦ ఆ తరువాత 95.9 సెకన్లకు ఏసీఎస్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్ను సురక్షితంగా భూమివైపుకు తీసుకొస్తుంది. ♦ 96.2 సెకన్లకు అపెక్స్ కవర్ విడిపోతుంది. 98.2 సెకన్లకు డ్రోగ్ పారాచూట్ విచ్చుకుంటుంది. ♦ 296.1 సెకన్ల తరువాత డ్రోగ్ పారాచూట్ విడిపోతుంది. ♦ 296.3 సెకన్లకు పైలట్ పారాచూట్ విచ్చుకుంటుంది. ♦ 296.5 సెకన్లకు మెయిన్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్ను సురక్షితంగా భూమివైపునకు తీసుకొస్తుంది. ♦ 531.8 సెకన్లకు క్రూమాడ్యూల్ బంగాళాఖాతంలో దిగడంతో టీవీ–డీ1 ప్రయోగం పూర్తవుతుంది. -
సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశో«ధనలే లక్ష్యంగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగవేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి వున్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? ► ఆదిత్య–ఎల్1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది. ఆదిత్య–ఎల్1లో పేలోడ్స్ ఇవే.. సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) ఉంటాయి. -
Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.?
జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని ఇస్రో సాధించింది. అసలు చంద్రయాన్–3 మిషన్ వల్ల మానవాళికి ఏం లాభం? ఈ ప్రయోగం లక్ష్యమేంటీ? చంద్రుడి గుట్టు విప్పేందుకే... ► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం... చంద్రయాన్–3లో ఏమేం ఉన్నాయి? ► ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు. ► చంద్రయాన్–2 లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే అమర్చారు. ► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు. దక్షిణ ధ్రువంపై దిగాలని... ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించారు. ► ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకటి, ల్యాండర్లో మూడు, రోవర్లో రెండు పేలోడ్ల చొప్పున చంద్రయాన్–3లో అమర్చారు. ► 2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్లో 1,696 కేజీల అపోజి ఇంధనం నింపారు. దీని సాయంతోనే ల్యాండర్, రోవర్లను మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లింది. ► చంద్రుని కక్ష్య నుంచి భూమిని, చంద్రున్ని అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్లో ఓ పరికరాన్ని అమర్చారు. ► చంద్రుని ఉపరితలం వాసయోగ్యమో, కాదో తేల్చడంతో పాటు చంద్రునిపై జరిగే మార్పుచేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది. ► రోవర్లో మూడు పేలోడ్లను పంపుతున్నారు. ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు మారుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తుంది. ► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజకల్ ఎక్స్పెరమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి దోహదపడుతుంది. ► ఇన్స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ పేలోడ్లు చంద్రుడి లాండింగ్ సైట్ చుట్టూ భూ కంపతను కొలుస్తాయి. ► అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్‌తో చంద్రునిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధించడంతో పాటు చంద్రుడిపై రసాయనాలున్నట్టు తేలితే వాటి జాబితా తయారీకి ఉపయోగిస్తారు. ► లేజర్ ప్రేరేపిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్ల వంటివున్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది, చుట్టూతా ఏముంది వంటివి శోధిస్తుంది. చంద్రయాన్–2 ల్యాండర్, రోవర్ క్రాషై పని చేయకపోయినా వాటిని తీసుకెళ్లిన ఆర్బిటార్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలో తిరుగుతూ అత్యంత విలువైన సమాచారం అందిస్తోంది. చంద్రుడిపై నీళ్లున్నట్టు చంద్రయాన్–2 కూడా ధ్రువీకరించింది. చంద్రయాన్–3 ముగియగానే సూర్యుడిపై పరిశోధనలకు ఆగస్టులో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. తద్వారా మిషన్ సూర్య, చంద్ర దిగ్విజయంగా పూర్తవుతాయి. -
బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3
దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్వీఎం–3 రాకెట్‌పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం.. –సాక్షి, నేషనల్ డెస్క్ మూడు కీలక దశలు ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్ వెహికల్స్‌లో అత్యంత శక్తివంతమైనది ఎల్వీఎం–3. నిజానికి ఇదొక బాహుబలి రాకెట్. భారీ పరిమాణంలో పేలోడ్‌ను అంతరిక్షంలోకి సులభంగా మోసుకెళ్లగలదు. ఇందులో రెండు ఘన ఇంధన బూస్టర్లు, ఒక ద్రవ ఇంధన కోర్ స్టేజ్‌తో కూడిన మూడు దశలు ఉన్నాయి. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి ప్రాథమిక దశలో ఘన ఇంధన బూస్టర్లు దోహదపడతాయి. రాకెట్ చంద్రుడి కక్ష్యలోకి చేరడానికి ఇక ద్రవ ఇంధన కోర్ స్టేజ్ సాయపడుతుంది. ఎలా పనిచేస్తుంది? దశల వారీగా ఇంధనాన్ని మండించడం ద్వారా రాకెట్‌ను నింగిలోకి పంపిస్తారు. ఘన, ధ్రవ ఇంధన ఇంజిన్లు, స్ట్రాప్–ఆన్ బూస్టర్లు నిర్దేశిత సమయాల్లో పనిచేస్తాయి. ఎల్వీఎం–3లో విద్యుత్ సరఫరా కోసం రెండు వికాస్ ఇంజిన్లు ఉన్నాయి. ప్రాథమిక దశలో రెండు సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్లు అదనపు శక్తిని అందజేస్తాయి. పేలోడ్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడానికి అవసరమైన శక్తిని దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ–20 సమకూరుస్తుంది. మొదట రెండు బూస్టర్లను ఒకేసారి మండిస్తారు. దాంతో రాకెట్ టేకాఫ్ అవుతుంది. తర్వాత లిక్విడ్ కోర్ స్టేజ్‌ను 113 సెకండ్లపాటు, రెండు ఎస్200 బూస్టర్లను 134 సెకండ్లపాటు మండిస్తారు. టేకాఫ్ తర్వాత 217 సెకండ్లకు భూమికి 115 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్‌తో కూడిన పేలోడ్ రాకెట్ నుంచి విడిపోతుంది. ♦ ఎల్వీఎం–3 రాకెట్ బరువు 640 టన్నులు, పొడవు 43.5 మీటర్లు. 4,000 కిలోలపేలోడ్ను జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి మోసుకెళ్లగలదు. ♦ రాకెట్‌కు అవసరమైన శక్తిని సమకూర్చడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇందులో రెండు సాలిడ్ స్ట్రాప్–ఆన్ మోటార్లు(ఎస్200), ఒక లిక్విడ్ కోర్ స్టేజ్(ఎల్110), 28 టన్నుల బరువైన ప్రొపలెంట్ లోడింగ్‌తో కూడిన ఒక హై–థ్రస్ట్ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్(సీ25) ఉన్నాయి. ♦ ఈ రాకెట్‌ను మొదట ‘జీఎస్ఎల్వీ–ఎంకే3’గా వ్యవహరించేవారు. ఇస్రో దీనికి ఎల్వీఎం–3గా నామకరణం చేసింది. దీనిద్వారా ఇప్పటివరకూ 3 ప్రయోగాలు విజయవంతమ య్యాయి. చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కానుంది. ♦ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ఎల్వీఎం–3 వాహక నౌకను గతంలో ఉపయోగించారు. జీశాట్–19 కమ్యూనికేషన్ శాటిలైట్, అస్ట్రోశాట్ అ్రస్టానమీ శాటిలైట్, చంద్రయాన్–2 లూనార్ మిషన్‌ను ఇదే రాకెట్ ద్వారా ప్రయోగించారు. భారతదేశంలో తొలి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగమైన గగన్‌యాన్ మిషన్‌లో ఎల్వీఎం–3 వాహక నౌక తన సేవలను అందించనుంది. ♦ భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ల ప్రయోగాల్లో ఎల్వీఎం–3 ద్వారా మనం స్వయం సమృద్ధి సాధించినట్లేనని ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. -
నేడు జీఎస్ఎల్వీ ఎఫ్–12 ప్రయోగం
సూళ్లూరుపేట/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థానిక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్12)ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. మొత్తం 27.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ ఎఫ్–12 రాకెట్ ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన నావిక్–01 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగ పనులను ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షిస్తున్నారు. నావిగేషన్ శాటిలైట్ సిస్టం బలోపేతం కోసం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్–01 పేరుతో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. నావిక్–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్–5, ఎస్–బాండ్ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించారు. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో జీఎస్ఎల్వీ ఎఫ్–12 నమూనా ఉపగ్రహానికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
24న ‘నావిక్–01’ ఉపగ్రహ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మే 24వ తేదీన జీఎస్ఎల్వీ–ఎఫ్12 రాకెట్ ద్వారా నావిక్–01 (ఐఆర్ఎన్ఎస్ఎస్–1జే) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీనిని నిర్వహించేందుకు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్‌ను అనుసంధానం చేసే పనులు ప్రారంభించారు. షార్‌లో లాంచింగ్ వసతులు పెరిగిన తర్వాత నెలకు ఒక ప్రయోగం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 22న పీఎస్ఎల్వీ సీ55ని ప్రయోగించారు. ఆ ప్రయోగం పూర్తయిన వెంటనే మే 24న జీఎస్ఎల్వీ ఎఫ్12 ద్వారా నావిక్–01 ఉపగ్రహ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్)ను బలోపేతం చేయడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు. -
22న పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న పీఐఎఫ్ భవనంలో పీఎస్ఎల్వీ మొదటి, రెండు దశలు రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. మూడు, నాలుగు దశలను మొబైల్ సర్వీస్ టవర్‌లో అనుసంధానం చేసి సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. -
నేడు ఎల్వీఎం3–ఎం3 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ స్పేస్ సంస్థలు కలిసి వాణిజ్యపరంగా స్థానిక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఎల్వీఎం3–ఎం3 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధంచేశారు. ఇందుకు సంబంధించి శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 24.30గంటల కౌంట్ డౌన్ అనంతరం రాకెట్‌ను ప్రయోగిస్తారు. ఈ మేరకు షార్‌లో శుక్రవారం నిర్వహించిన ఎంఆర్ఆర్ కమిటీ, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశాల్లో నిర్ణయించారు. అంతకుముందే మూడు దశల రాకెట్‌ను అనుసంధానం చేశారు. దానిని ప్రయోగ వేదికపై అమర్చి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు వారికి అప్పగించారు. ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండియాకు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ వారు సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో 5,805 కిలోల బరువు కలిగిన 36 సమాచార ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (సర్క్యులర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేసి 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా నిర్దేశించిన సమయంలో నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. -
నింగిలోకి సగర్వంగా...
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత వాయుసేనకు విశేష సమాచార సేవలందించేందుకు ఉద్దేశించిన జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ రంగానికి సాంకేతికంగా కీలకమైన ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్ ద్వారా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో షార్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం నింగిలోకి పంపింది. 19 నిమిషాల 20 సెకన్లలో ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. ఇస్రోకు ఈ ఏడాదిలో ఇది ఏడో విజయం కాగా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన వాటిలో 69వ విజయవంతమైన ప్రయోగం. 2,250 కిలోల బరువు కలిగిన మిలటరీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఈ జీశాట్–7ఏ. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో పరిపూర్ణత సాధించి ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని అంతరిక్ష ప్రయోగాలు చేసే శక్తిగా ఎదిగిందని మరోసారి నిరూపించారు. 18 ఏళ్లు కఠోర శ్రమ ఫలితమే ఇస్రో 18 ఏళ్లు కఠోరశ్రమ ఫలితమే తాజా వరుస విజయాలకు బాటవేసిందని చెప్పొచ్చు. సాయంత్రం 4.10 గంటలకు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పెద్ద శబ్దంతో జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్ నిప్పులు చిమ్ముతూ జీశాట్–7ఏను మోసుకుని నింగికేగింది. ఒక్కొక్క దశ విజయవంతంగా ప్రయాణం సాగిస్తుంటే మిషన్ కంట్రోల్ సెంటర్లోని శాస్త్రవేతల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడింది. రాకెట్‌కు మొదటి దశలో నాలుగు వైపులా అమర్చిన నాలుగు ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లతో పాటు కోర్ అలోన్ దశ విజయవంతంగా పనిచేసింది. రెండు, మూడు దశలు కూడా సమర్థవంతంగా పనిచేయడంతో ఈ భారీ ప్రయోగాన్ని సునాయాసంగా నిర్వహించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి మూడో దశలో అమర్చిన 14,996 టన్నుల క్రయోజనిక్ ఇంజిన్ల సాయంతో రాకెట్ శిఖరభాగంలో అమర్చిన జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని 19.20 నిమిషాలకు నిర్దేశిత సమయంలో నిర్ణీత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో 3.5 టన్నుల నుంచి 5 టన్నుల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలతోపాటు చంద్రయాన్–2 ప్రయోగంలో రోవర్‌ను, ల్యాండర్‌ను, అలాగే స్పేస్ షటిల్ ప్రోగ్రాంలో భాగంగా మానవుడిని అంతరిక్షంలోకి పంపేందుకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ (ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం) వారు దానిని తమ అధీనంలోకి తీసుకుని, అంతా సవ్యంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. 2019లో 32 మిషన్లు లక్ష్యం: శివన్ ప్రయోగం విజయానంతరం మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తల కఠోర శ్రమ ఫలించిదన్నారు. ఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే జీఎస్ఎల్వీ ప్రయోగాలు మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తు అని శివన్ అన్నారు. సమాచార ఉపగ్రహాలను మనం పంపుకోవడమే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను పంపేస్థాయికి ఎదిగామని విజయగర్వంతో చెప్పారు. ఇస్రో 2019 ఏడాదిలో 32 మిషన్లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2019 ప్రథమార్ధంలో చంద్రయాన్–2 ప్రయోగం చేపడతామన్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్11 ప్రయోగంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎప్పుడు లేని విధంగా జీఎస్ఎల్వీ ఎఫ్11 రాకెట్‌లోని రెండోదశలోని ద్రవ ఇంధనాన్ని 2.5 టన్నులు పెంచడంతో ఆ దశ సక్సెస్ అయ్యిందన్నారు. తర్వాత క్రయోజనిక్ దశలో 3 టన్నులు ఇంధనం పెంచడంతో ఈ దశ కూడా విజయవంతం అయ్యిందన్నారు. ఈ రెండు ప్రత్యేకతలను ఒకే ప్రయోగంలో సాధించామని గర్వంగా చెప్పారు. 35 రోజుల్లో 3 ప్రయోగాలు సైతం ఇస్రో చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం భరత జాతికి కొత్త ఏడాదికి కానుక అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్, సీఎం అభినందనలు జీఎస్ఎల్వీ ఎఫ్–11 రాకెట్లో పంపిన జీశాట్–7ఏ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్తవేత్తల బందానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్తవేత్తలు పనితీరు దేశానికి గర్వకారణమని వారు కొనియాడారు. శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు జీశాట్–7ఏను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతమైన విజయాలను ఇస్రో సాధించాలని ఆయన ఆకాంక్షించారు. వాయుసేనకు అండదండ జీశాట్–7ఏ బరువు: 2,250 కేజీలు ఉపగ్రహ జీవితకాలం: 8 ఏళ్లు వ్యయం: రూ.500–800 కోట్లు ట్రాన్స్పాండర్లు: కేయూ బ్యాండ్. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అతిచిన్న యాంటెన్నాతోనైనా సిగ్నల్స్‌ను గ్రహిస్తాయి. ఇతర బ్యాండ్లతో పోల్చి చూస్తే విస్తృతమైన కవరేజ్ ఉంటుంది. వర్షాలు, ఇతర వాతావరణమార్పుల్ని బాగా తట్టుకోగలవు. బెంగళూరు: ఇస్రో ప్రయోగించిన జీశాట్–7ఏ ఉపగ్రహంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జీశాట్–7ఏని ప్రత్యేకంగా భారతీయ వైమానిక దళ, ఆర్మీ అవసరాల కోసమే రూపొందించారు. వాయుసేనకు చెందిన రాడార్ స్టేషన్లు, వైమానిక స్థావరాలను ఈ ఉపగ్రహానికి అనుసంధానిస్తారు. తద్వారా కదనరంగంలో భారత వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుంది. సమాచార సరఫరా వేగవంతం అవుతుంది. ఎంతో దూరంలో ఉండే ప్రత్యర్థుల విమానాలను కూడా గుర్తించడానికి వీలు కలుగుతుంది. యుద్ధ విమానాల పర్యవేక్షణ కూడా ఈ ఉపగ్రహం సాయంతో చేయవచ్చు. రాడార్ల కంటే అత్యంత శక్తిమంతమైన సిగ్నల్స్‌ను కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్ ద్వారా ఈ ఉపగ్రహం అందిస్తుంది. దీంతో గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరమవుతుంది. డ్రోన్ల పనితీరు సులభం జీశాట్–7ఏతో వాయుసేనలో డ్రోన్ల నిర్వహణ సులభమవనుంది. యూఏవీ (గాలిలో ఎగిరే మానవరహిత వాహనం)లను భూస్థావరం నుంచి కాకుండా ఉపగ్రహం ద్వారా నియంత్రించవచ్చు. డ్రోన్లు ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి సమాచారం పంపడానికి సాయపడుతుంది. అమెరికా నుంచి సముద్ర గస్తీ డ్రోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్న తరుణంలో జీశాట్–7ఏ ఉపగ్రహంతో వాటి పనితీరు మరింత సులభం కానుంది. అత్యంత ఎత్తులో ప్రయాణించే డ్రోన్లు సుదూరం నుంచి కూడా నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించగలవు. గతంలో రుక్మిణి ప్రయోగం 2013లో ఇస్రో జీశాట్–7ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని రుక్మిణి అని పిలుస్తారు. ఈ రుక్మిణి హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికాదళ కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగపడింది. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, సముద్ర తీర గస్తీ విమానాల కదలికలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని రుక్మిణి ఉపగ్రహం ద్వారా తెలుసుకునే వీలు కలిగింది. ఇప్పుడు రుక్మిణిని మరింత అధునీకరించి జీశాట్–7ఏను ప్రయోగించారు. ఇందులో ఏ అంటే అడ్వాన్స్డ్ అని అర్థం. జీశాట్–7ఏతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు రానున్నాయి. మరికొన్నేళ్లలో జీశాట్–7సీ ఉపగ్రహాన్ని ప్రయోగించి నెట్వర్క్ ఆపరేషన్లను బలోపేతం చేయడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలో 320 మిలటరీ ఉపగ్రహాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 320 మిలటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో సగం అమెరికాకు చెందినవే. ఆ తరవాత అత్యధిక సైనిక ఉపగ్రహాలు కలిగిన దేశాల్లో రష్యా, చైనా ఉన్నాయి. ఈ విషయంలో చైనాయే మనకి అతి పెద్ద శత్రువు. సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎన్నో ఉపగ్రహాల్ని చైనా ప్రయోగించింది. చివరికి యాంటీ శాటిలైట్ ఆయుధాలు.. అంటే ఉపగ్రహాల్నే కూల్చే ఆయుధాల్ని కూడా పరీక్షించింది. భారత్‌కు ఇప్పటివరకు 13 మిలటరీ ఉపగ్రహాలే ఉన్నాయి. భూమిపై నిఘా, యుద్ధనౌకలకు దిక్సూచి, కమ్యూనికేషన్లకి ఉపయోగపడుతున్నాయి. మిలటరీ ఉపగ్రహాల సహకారంతోనే పాకిస్తాన్‌పై లక్షిత మెరుపుదాడుల సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయగలిగాం. ఉపయోగాలివీ... సమాచార ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. సమాచార ఉపగ్రహాలను ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. ఈసారి మాత్రం పూర్తిగా వాయుసేన, ఆర్మీ కోసం దీనిని ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో అభివృద్ధి చేశారు. శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును కనిపెడుతుంది. మిలటరీకి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇప్పటిదాకా పంపిన 35 సమాచార ఉపగ్రహాల్లోకెల్లా ఇది ప్రత్యేకమైనది. మిలటరీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాల కోసమే దీన్ని రూపొందించినట్టు ఇస్రో ప్రకటించింది. -
నింగిలోకి ఎగిసిన జీశాట్-7ఏ ఉపగ్రహం
-
జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 ప్రయోగం విజయవంతం
సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): వరుస ప్రయోగాలు, విజయాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దూసుకెళ్తోంది. నెల రోజుల వ్యవధిలోనే చేపట్టిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. సమాచార వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జీశాట్-7ఏ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. దీంతో ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు విమానయాన వ్యవస్థకు సేవలు అందించనుంది. భారత కాలమాన ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) ప్రయోగించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీఎస్ఎల్వీ వెహికల్ నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లింది. అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–7ఏ: కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్–7ఏ మాత్రం అడ్వాన్స్డ్ మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ ట్రాన్స్పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్)లో రూపొందించారు. సిబ్బంది, శాస్త్రవేత్తల అంకితభావంతోనే విజయాలు సిబ్బంది సమష్టి కృషి వల్లే జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 ప్రయోగతం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ కె శివన్ పేర్కొన్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ప్రయోగించిన జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్11) విజయవంతం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజుల నుంచి వాతావరణం అనుకూలించకపోయినా సిబ్బంది, శాస్త్రవేత్తలు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. శ్రీహరికోట నుంచి 35 రోజుల్లో మూడు ప్రయోగాల విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాదిని ఇస్రో విజవంతంగా ముగించిందని, వచ్చే ఏడాది మరిన్ని ప్రయోగాలు చేస్తామని శివన్ తెలిపారు. వైఎస్ జగన్ అభినందనలు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. జీఎస్ఎల్వీ–ఎఫ్11 ప్రయోగం విజయవంతమవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేపట్టి దేశాభివృద్దికి కృషి చేయాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
క్రయోజనిక్ హాట్ టెస్ట్ విజయవంతం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ఏడాది డిసెంబర్లో ప్రయోగించబోయే జీఎస్ఎల్వీ ఎఫ్–11కు సంబంధించి క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెప్ట్ హాట్ టెస్ట్ విజయవంతంగా ముగిసింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కేంద్రంలో ఆగస్టు 27న చేపట్టిన ‘హాట్ టెస్ట్’ సక్సెస్ అయ్యిందని ఇస్రో శనివారం ప్రకటించింది. క్రయోజనిక్ ఇంజిన్‌ను సుమారు 200 సెకన్లపాటు పనిచేయించి పరీక్షించారు. జీఎస్ఎల్వీ రాకెట్‌కు సంబంధించి కీలకమైన క్రయోజనిక్ దశ అత్యంత సంక్లిష్ట పరిజ్ఞానంతో కూడుకున్నది కావడంతో ఈ దశలో ఎప్పటికప్పుడు నూతనంగా పలు పరీక్షలు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. -
పీఎస్ఎల్వీ-సీ41 విజయవంతం
శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సీ41 రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం వేకువజామున 4.04 గంటలకు రాకెట్ ప్రయోగం జరిగింది. 19.19 నిమిషాల తర్వాత రాకెట్ లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహం విఫలం కావడంతో దాని స్థానంలో గురువారం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పంపారు. ఇది విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. దేశీయ దిక్సూచి వ్యవస్థ కింద ఇప్పటికే 8 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వచ్చే 8 నెలల్లో 9 ప్రయోగాలు చేస్తామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్3 ద్వారా కమ్యునికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని , ఈ ఏడాది చివరిలో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని వివరించారు. దేశీయ నావిగేషన్ సేవల కోసం త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. యాప్‌డౌన్‌లోడ్ ద్వారా వాతావరణ హెచ్చరికలు మత్స్యకారులకు చేరనున్నాయని వివరించారు. విపత్తు నిర్వహణ, వాహనాల గమనాన్ని పరిశీలించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు చాలా ఉపయోగం కలగనుంది. ఈ ఉపగ్రహం వల్ల దృశ్య, వాయిస్ దిక్సూచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సాసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు తన తరపున అభినందనలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ఆందోళనలో ఇస్రో..అసలేం ఏం జరిగింది?
-
శాటిలైట్‌తో లింక్ కట్; ఆందోళనలో ఇస్రో
న్యూఢిల్లీ: ఉపగ్రహ ప్రయోగాల్లో అనేక రికార్డులను సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల కిందట నింగిలోకి పంపిన జీశాట్-6ఏ ఉపగ్రహంతో సంబంధాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఇస్రో ప్రతినిధులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. మార్చి 29న నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి పంపిన ఉపగ్రహం తొలిదశ విజయవంతంకాగా, తుది దశలో మాత్రం సాంకేతిక లోపాలు తలెత్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఉపగ్రహంతో లింక్ కోల్పోవడం ఆందోళనకరమే అయినా, సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఇస్రో తెలిపింది. అసలేం ఏం జరిగింది?: భారత సమాచార వ్యవస్థకు పదునుపెట్టే లక్ష్యంతో గత గురువారం ఇస్రో జీశాట్6–ఏ ప్రయోగాన్ని చేపట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్08) ఉపగ్రహ వాహకనౌక 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు శుక్రవారం విజయవంతంగా పొడిగించారు. కాగా, శనివారం నాటికి అనూహ్య రీతిలో ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీతో ఉపగ్రహానికి సంబంధాలు తెగిపోయాయి. మరింతలోతుకు వెళితే..: జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. హసన్(కర్ణాటక)లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పెరిజీని 170 కిలో మీటర్ల నుంచి 5,054 కిలోమీటర్ల ఎత్తుకు, అపోజీని 35,975 కిలోమీటర్లు నుంచి 36,412 ఎత్తుకు పెంచారు. శనివారం.. చివరిదైన మూడో లామ్ ఇంజిన్‌ను మండించిన సమయంలోనే ఉపగ్రహంలో లోపాలు తలెత్తాయి. అప్పటి నుంచి జీశాట్6ఏ భూమితో అనుసంధానం కోల్పోయింది. -
ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ ప్రయోగానికి రంగం సిద్ధం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 31న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్) ఉపగ్రహాన్ని మంగళవారం పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్‌కు అమర్చారు. 1,400 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని రాకెట్‌కు శిఖర భాగాన అనుసంధానించారు. అన్ని పరీక్షలు నిర్వహించి బుధవారం హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను పూర్తి చేయను న్నారు. 28న తుది విడత సంసిద్ధతా కార్యక్రమం నిర్వహి స్తారు. అనంతరం కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 31 సాయంత్రం 6.59కి ప్రయోగాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగం తేదీని, సమయాన్ని తుదివిడత ఎంఆర్ఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు. -
షార్ నుంచి మరో నాలుగు ప్రయోగాలు
షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ చివరి నాటికి మరో నాలుగు ప్రయోగాలు చేయనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31న పీఎస్ఎల్వీ సీ–39 శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్– 1హెచ్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపుతున్నట్లు తెలిపారు. 2013లో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్– 1 ఏ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పనిచేయట్లేదని, దాని స్థానంలో ఐఆర్ఎన్ఎస్ఎస్– 1హెచ్ ఉపగ్రహాన్ని రోదíసీలోకి పంపిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం రెండు పీఎస్ఎల్వీ రాకెట్లు, ఒక జీఎస్ఎల్వీ మార్క్– 2 ప్రయోగాలు ఉంటాయని వివరించారు. 2018 ప్రథమార్ధంలో చంద్రయాన్–2 ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ నాటికి రెండో రాకెట్ అనుసంధాన భవనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. షార్కు మరో రెండు కొత్త ప్రాజెక్టులు రానున్నట్లు కున్హికృష్ణన్ తెలిపారు. అలాగే సుమారు రూ. 630 కోట్లతో నిర్మిస్తున్న వరల్డ్ క్లాస్ సెకండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ నిర్మాణం ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని తెలిపారు. ఏటా అక్టోబర్ 4 నుంచి 10 వరకు నిర్వహించే అంతరిక్ష వారోత్సవాలను ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట గ్రూప్ డైరెక్టర్ పి.గోపీకృష్ణ, పీఆర్వో విశ్వనాథశర్మ ఉన్నారు. -
ఇస్రో పాంచ్ పటాకా!
- ఐదు విదేశీ ఉపగ్రహాల ప్రయోగం సూపర్ సక్సెస్ - విజయవంతంగా నింగికి చేర్చిన పీఎస్ఎల్వీ-సీ28 రాకెట్ - అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రో టాప్ గేర్ - 1,440 కిలోల బరువైన ఐదు ఉపగ్రహాలతో పేలోడ్ - వాణిజ్యపరంగా తొలిసారి అత్యంత ‘బరువైన’ ప్రయోగం సూళ్లూరుపేట(శ్రీహరికోట): స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలకు దీటుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విదేశీ ఉపగ్రహాలను సైతం నింగికి పంపి వాణిజ్యపరమైన భారీ ప్రయోగంలోనూ సత్తా చాటింది. బ్రిటన్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో కదనాశ్వం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్ఎల్వీ) రాకెట్ శుక్రవారం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం ఈ విజయానికి వేదికైంది. శుక్రవారం రాత్రి 9.57 గంటలు.. షార్ డెరైక్టర్‌గా పి.కున్హికృష్ణన్కు తొలి ప్రయోగం కావడం, పీఎస్ఎల్వీ రాకెట్‌కు ఆయనే మిషన్ డెరైక్టర్ కావడంతో అంతటా ఉత్కంఠ.. కౌంట్‌డౌన్ ముగియవచ్చింది.. 3.. 2.. 1.. 0.. అందరికళ్లు తూర్పుదిక్కున ఆకాశం వైపు మళ్లాయి. చీకటిని చీల్చుకుంటూ, నిప్పులు చిమ్ముకుంటూ పీఎస్ఎల్వీ-సీ28 నింగికి ఎగిసింది. శ్రీహరికోట వెలుగులతో నిండిపోయింది. కరతాళ ధ్వనులు మిన్నంటాయి. రాకెట్ విజయవంతంగా దూసుకెళ్తూ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్‌లు శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో వాణిజ్య విభాగం ‘యాంత్రిక్స్’కు రూ. 180 కోట్ల ఆదాయం లభించినట్లు ఇస్రో తెలిపింది. ప్రయోగం జరిగిందిలా... నిర్దేశించిన విధంగానే.. 108.1 సెకన్లకు 68.82 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ మొదటి దశ పూర్తయింది. 260.2 సెకన్లకు 231.85 కి.మీ. ఎత్తులో రెండోదశ, 521.8 సెకన్లకు 506.29 కి.మీ. ఎత్తులో మూడోదశ, 1037 సెకన్లకు 652.32 కి.మీ. ఎత్తులో నాలుగో దశ పూర్తయ్యాయి. మొత్తం 19.16 నిమిషాల్లో ప్రయోగం పూర్తయింది. సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో.. 653.8 కి.మీ. ఎత్తులో డీఎంసీ3-1ను, 653.9 కి.మీ. ఎత్తులో డీఎంసీ3-2ను, డీఎంసీ3-3ను, డీ ఆర్బిట్సెయిల్ను, 654.75 కి.మీ. ఎత్తులో సీఎన్బీటీ-1ను రాకెట్ ప్రవేశపెట్టింది. సమష్టి కృషితో సాధించాం: ఇస్రో చైర్మన్ కిరణ్ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ఇది సమష్టి విజయం. వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఐదు ఉపగ్రహలనూ నిర్ణీత సమయంలోనే నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగాం. ఈ విజయం స్ఫూర్తితో మరిన్ని భారీ ప్రయోగాలకు శ్రీకారం చుడతా’న్నారు. తాను పదవీబాధ్యతలు చేపట్టాక మొదటి ప్రయోగం విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందని కున్హికృష్ణన్ అన్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. బ్రిటన్ ఉపగ్రహాలు, వాటి ప్రత్యేకతలు డీఎంసీ3-1, డీఎంసీ3-2, డీఎంసీ3-3, సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్‌సెయిల్. వీటిలో డీఎంసీ3 ఉపగ్రహాలు ఒక్కోటి 447 కిలోలు, సీబీఎన్‌టీ-1 శాటిలైట్ 91 కిలోలు, డీ-ఆర్బిట్‌సెయిల్ 7 కిలోలు మొత్తం 1,440 కిలోల బరువున్నాయి. డీఎంసీ3 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ 647 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలోకి, ఒక్కో ఉపగ్రహానికి మధ్య 120 డిగ్రీల కోణంలో తేడా ఉండేలా ప్రవేశపెట్టింది. ప్రతిరోజూ భూమిపై ఏ లక్ష్యాన్ని నిర్దేశించినా, ఇవి ఫొటోలు తీయగలవు. వనరులను సర్వే చేయడం, పర్యావరణ అధ్యయనం, ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ వంటి వాటికి ఇవి ఉపయోగపడతాయి. ఒక్కోటి 3 మీటర్ల పొడవుండే 3 ఉపగ్రహాలనూ ప్రస్తుత పేలోడ్లోనే ఉంచి ప్రయోగించడమనేది ఇస్రోకు సవాలుగా మారింది. ఇందుకోసం వృత్తాకార లాంచర్ అడాప్టర్‌ను, త్రికోణాకారంలోని మల్టిపుల్ శాటిలైట్ అడాప్టర్-వెర్షన్ 2(ఎంఎస్ఏ-వీ2) వేదికనూ ఇస్రో తయారుచేసి ఉపయోగించింది. ఇక సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్‌సెయిల్ ఉపగ్రహాలను సాంకేతికత ప్రదర్శన కోసమే బ్రిటన్ రూపొందించింది. సీబీఎన్‌టీ-1ని భూ పరిశీలన టెక్నాలజీని పరీక్షించుకోవడం కోసం పంపగా.. పలుచని తెరచాప లాంటి సెయిల్ ఆధారంగా వస్తువులను క్రమంగా దిగువ కక్ష్యలోకి రప్పించే టెక్నాలజీని పరీక్షించుకోవడం కోసం డీ-ఆర్బిట్‌సెయిల్ నానో ఉపగ్రహాన్ని పంపింది. పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించటం ఇది 30వ సారి. ఇప్పటిదాకా 19 దేశాలకు చెందిన 40 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించగా, తాజా ప్రయోగంతో ఆ సంఖ్య 45కు చేరింది. -
షార్ నుంచి 10న పీఎస్ఎల్వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట) :భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 10వ తేదీన పీఎస్ఎల్వీ సీ28ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక మీద నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తి చేశారు. ఉపగ్రహాల అనుసంధానం మాత్రమే ఇక మిగిలివుంది. ఈ నెల 14న కెనడాకు చెందిన డీసీఎం-3 అనే మూడు ఉపగ్రహాలు షార్కు చేరుకున్న విషయం తెలిసిందే. షార్‌లోని క్లీన్‌రూంలో ఉపగ్రహాలకు ఇస్రో, కెనడా శాస్త్రవేత్తలు పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి చేసుకుని మంగళవారం సాయంత్రం ప్రయోగవేదిక వద్దకు ఉపగ్రహాలు చేరుకుంటాయి. బుధవారం ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అనుసంధానం చేసి హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే పనులు చేపట్టనున్నారు. ఆ తరువాత మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. -
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ 24
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ 24
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్ ధావన్స్పేస్ సెంటర్ (షార్)లో మొదటి ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 5.14 గంటలకు పీఎస్ఎల్వీ సీ24 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఆర్మింగ్ ఆపరేషన్ ప్రక్రియ నిర్వహించారు. గురువారం రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రకియను చేపట్టారు. శుక్రవారం నైట్రోజన్, హీలియం గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. పీఎస్ఎల్వీ సీ24 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1432 కిలోల ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1బీ (ఐఆర్ఎన్ఎస్ఎస్ 1బీ)ను 20.25 నిమిషాల్లో 284 కి.మి. పెరిజీ (భూమికి దగ్గరగా), 20,652 కి.మి. అపోజి (భూమికి దూరంగా) భూమధ్య రేఖాతలానికి 19.2 డిగ్రీల వాలులో దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహా నియంత్రణ కేంద్రం నుంచి కక్ష్య దూరాన్ని పెంచే కార్యక్రమాన్ని చేపడతారు. ఉపగ్రహంలో ద్రవ ఇంజిన్ మోటారును ఐదుసార్లు మండించి కక్ష్య దూరాన్ని పెంచుతూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీల తూర్పుగా, భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో వృత్తాకార కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపరుస్తారు. 1.5 బ్యాండ్, ఎస్ బ్యాండ్ పౌనఃపున్యాలతో ఉపగ్రహం పనిచేస్తుంది. ఇందులో కచ్చితంగా పనిచేసే రుబీడియం అణుగడియారం కీలకమైంది. ఈ ఉపగ్రహంలో ఉండే సీ బ్యాండ్ ట్రాన్స్ఫాండర్ ఉపగ్రహ వ్యాప్తిని తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ ప్రయోగం తరువాత ఏడు నెలల కాలంలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహ ప్రయోగాన్ని చేస్తున్నారు. చెంగాళమ్మ సేవలో ఇస్రో చైర్మన్: ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ గురువారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అధికారులకు, మీడియాకు సమాచారం ఇవ్వకుండా దర్శనం చేసుకుని వెళ్లారు. షార్‌లో ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియను ఆయన పరిశీలించి, శాస్త్రవేత్తలతో గురువారం రాత్రి సమీక్షించారు. శుక్రవారం ప్రయోగం వరకు ఆయన ఇక్కడే ఉంటారు. -
అపూర్వం... అపురూపం!
‘నేను వైఫల్యాలను మూటగట్టుకుంటున్నానన్నది నిజం కాదు. ఎన్ని రకాలుగా పొరపాట్లు చేయడానికి ఆస్కారముందో తెలుసుకుంటున్నాన’ంటాడు సుప్రసిద్ధ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. రెండు దశాబ్దాలుగా వైఫల్యాలను ఎదుర్కొన్నా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో కృషి చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు చివరకు విజయపతాక ఎగరేశారు. ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-డీ5 మన అంతరిక్ష విజయ ప్రస్థానంలో ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇస్రో కీర్తికిరీటంలో అది మరో కలికితురాయి అయింది. ఇదంత సులభంగా చేజిక్కలేదు. అలవోకగా చేతికి రాలేదు. జీఎస్ఎల్వీ (జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) రాకెట్లకు దేశీయంగా అభివృద్ధి చేసుకున్న క్రయోజెనిక్ ఇంజన్‌ను ఉపయోగించాలన్నది మన శాస్త్రవేత్తల సంకల్పం. ఆ సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు వారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. వైఫల్యాలను ఎదుర్కొన్నా అవి సరిదిద్దుకోలేనిగా వారు భావించలేదు. కుంగిపోలేదు. తాము సాధించాల్సిన విజయానికి వాటిని సోపానాలుగా మలుచుకున్నారు. గత ఏడాది ఆగస్టులో దీన్ని ప్రయోగించాల్సివున్నా చివరి నిమిషంలో ఇంధనం లీక్ కావడాన్ని గమనించి వాయిదా వేశారు. ప్రయోగ వేదికనుంచి రాకెట్‌ను వెనక్కు తెచ్చి లోపాలను చక్కదిద్దారు. డిజైన్‌లో అవసరమైన మార్పులు చేశారు. ఒకటికి పదిసార్లు పరీక్షించుకుని సూక్ష్మ లోపాలను కూడా పరిహరించగలిగారు. క్రయోజెనిక్ పరిజ్ఞానం విషయంలో మన శాస్త్రవేత్తలు అంత పట్టుదలగా ఉండటానికి కారణాలున్నాయి. ఎన్నడో 1992లో ఆ పరిజ్ఞానంతో కూడిన ఇంజిన్లను, సాంకేతికతను అందజేయడానికి రష్యాతో ఒప్పందం కుదిరింది. దానికి అనుగుణంగా అది కొన్ని ఇంజిన్లను అందజేసింది కూడా. కానీ ఈలోగా మన అణు పరీక్షల నేపథ్యంలో అమెరికా ఆగ్రహించి తాను ఆంక్షలు విధించడమే కాక...రష్యా కూడా సాయం చేయడానికి వీల్లేదని అడ్డుపుల్లలేసింది. ఫలితంగా రష్యానుంచి క్రయోజెనిక్ ఇంజిన్లు రావడం ఆగిపోయింది. ఇక స్వదేశీ పరిజ్ఞానంపైనే ఆధారపడాలని మన శాస్త్రవేత్తలు సంకల్పించారు. 2010 ఏప్రిల్‌లో జీఎస్ఎల్వీ- డీ3ని ప్రయోగించి విఫలమయ్యారు. దాంతో ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో ఎస్ఎల్వీ-ఎఫ్6ను రష్యా ఇంజిన్‌తో ప్రయోగించి చూశారు. కానీ, అప్పుడూ చేదు అనుభవమే ఎదురైంది. మొత్తానికి డుసార్లు జీఎస్ఎల్వీని ప్రయోగిస్తే కేవలం రెండుసార్లు మాత్రమే విజయం చేతికందింది. పర్యవసానంగా భారీ ఉపగ్రహాలను కొన్నిసార్లు ఫ్రెంచి గయానానుంచి ప్రయోగించాల్సివచ్చింది. శాస్త్రవేత్తలకు ఇన్ని పరీక్షలు పెట్టిన క్రయోజెనిక్ పరిజ్ఞానం ఎంతో కీలకమైనది. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉండే భూ స్థిర కక్ష్యలోనికి అధిక బరువుతో ఉండే ఉపగ్రహాన్ని పంపాలంటే అది క్రయోజెనిక్ పరిజ్ఞానంతోనే సాధ్యం. అయితే, అది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. రాకెట్లో మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని, మూడో దశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగించాల్సివస్తుంది. మిగిలిన రెండు దశలూ సాధారణమైనవే. కానీ, క్రయోజెనిక్ దశ కొరకరాని కొయ్య. ఇందులో వాడే హైడ్రోజన్‌నూ, దాన్ని మండించడానికి వాడే ఆక్సిజన్‌ను ద్రవరూపంలోకి మార్చాలంటే వాటిని నిర్దిష్ట స్థాయికి శీతలీకరించ్సాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం లోపం తలెత్తినా హైడ్రోజన్, ఆక్సిజన్లు వాయురూపంలోకి మారిపోతాయి. హైడ్రోజన్ ద్రవ రూపంలోకి మారాలంటే మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ వద్దా, ఆక్సిజన్ ద్రవరూపంలోకి మారాలంటే మైనస్ 183 డిగ్రీలవద్దా ఉండాలి. ఆ ఉష్ణోగ్రతల్లో ఉండే ఇంధనాలను శూన్యంలో మండించడమంటే మాటలు కాదు. భారీ ట్యాంకుల్లో ఉండే ఈ రెండు వాయువులనూ శీతలీక రణ స్థితిలో ఉంచడానికి అనువుగా ఇంజిన్‌లోని పరికరాలనూ, పైపులనూ కూడా శీతల స్థితిలోనే ఉంచాలి. శాస్త్రవేత్తలకు ఇదంతా పెను సవాల్. మనపై ఆంక్షలు విధించిన అమెరికాకు దీటైన జవాబివ్వడంతోపాటు ఒకరిపై ఆధారపడే స్థితిని అధిగమించడానికీ, భారీ వ్యయాన్ని తగ్గించుకోవడానికీ ఈ సవాల్‌ను శాస్త్రవేత్తలు ఛేదించారు. రష్యా క్రయోజెనిక్ ఇంజన్ల వ్యయం దాదాపు రూ.100 కోట్లుకాగా, మన శాస్త్రవేత్తలు అదే ఇంజిన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో రూ.40 కోట్లకు రూపొందించగలిగారు. అంతరిక్ష పరిజ్ఞానంలో గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవడానికి, వాణిజ్యపరంగా భారీ మొత్తాలను రాబట్టుకోవడానికి ఇన్నాళ్లూ అగ్ర రాజ్యాలు క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని ఎవరికీ అందనివ్వలేదు. ఉన్నతస్థాయి పరిశోధనలైనా, అందుకవసరమైన తెలివితేటలైనా తమకే సొంతమని అవి భావించాయి. కానీ, మన శాస్త్రవేత్తలు వారి భ్రమలను పటాపంచలు చేశారు. వారి గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. ఇదేమంత సులభంగా సమకూరలేదు. జీఎస్ఎల్వీ వైఫల్యాలు ఎదురైనప్పుడు మన శాస్త్రవేత్తలు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరికి పీఎస్ఎల్వీ ప్రయోగాలు విజయవంతమైనప్పుడూ జీఎస్ఎల్వీ వైఫల్యాలను గుర్తుచేసినవారున్నారు. వాటి సంగతేమిటని ప్రశ్నించినవారున్నారు. కానీ, శాస్త్రవేత్తలు నిరాశచెందలేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాకే క్రయోజెనిక్ సాంకేతికతను సొంతం చేసుకోగలిగాయన్న ఎరుకతో పట్టుదలగా పనిచేశారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అదే ఈరోజు విజయాన్ని చేరువ చేసింది. మరో రెండేళ్లలో ప్రయోగించదలుచుకున్న చంద్రయాన్-2కు, అటు తర్వాత కాలంలో ప్రయోగించదలుచుకున్న మానవసహిత అంతరిక్ష వాహక నౌకకూ జీఎస్ఎల్వీ, అందులో వాడే క్రయోజెనిక్ పరిజ్ఞానం ముఖ్యమైనవి. ఆదివారంనాటి విజయం ఈ మార్గంలో మరిన్ని ముందడుగులు వేసేందుకు దోహదపడుతుంది. అందువల్లే ఈ విజయం ఎంతో అపురూపమైనది. అపూర్వమైనది. అందుకు మన శాస్త్రవేత్తలను అభినందించాలి.