నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–12 ప్రయోగం | GSLV F 12 launch today | Sakshi
Sakshi News home page

నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–12 ప్రయోగం

Published Mon, May 29 2023 4:58 AM | Last Updated on Mon, May 29 2023 7:45 AM

GSLV F 12 launch today - Sakshi

సూళ్లూరుపేట/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థానిక సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ శాటిలైట్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌12)ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది.

ఈ మేరకు ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. మొత్తం 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–12 రాకెట్‌ ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన నావిక్‌–01 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగ పనులను ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ పర్యవేక్షిస్తున్నారు.

నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం బలోపేతం కోసం
భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం) వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్‌–01 పేరుతో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. నావిక్‌–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్‌–5, ఎస్‌–బాండ్‌ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించారు.

ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–12 నమూనా ఉపగ్రహానికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement