జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని ఇస్రో సాధించింది. అసలు చంద్రయాన్–3 మిషన్ వల్ల మానవాళికి ఏం లాభం? ఈ ప్రయోగం లక్ష్యమేంటీ?
చంద్రుడి గుట్టు విప్పేందుకే...
► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం...
చంద్రయాన్–3లో ఏమేం ఉన్నాయి?
► ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు.
► చంద్రయాన్–2 లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే అమర్చారు.
► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు.
దక్షిణ ధ్రువంపై దిగాలని...
ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించారు.
► ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకటి, ల్యాండర్‌లో మూడు, రోవర్‌లో రెండు పేలోడ్ల చొప్పున చంద్రయాన్–3లో అమర్చారు.
► 2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్‌లో 1,696 కేజీల అపోజి ఇంధనం నింపారు. దీని సాయంతోనే ల్యాండర్, రోవర్‌లను మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లింది.
► చంద్రుని కక్ష్య నుంచి భూమిని, చంద్రున్ని అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్‌లో ఓ పరికరాన్ని అమర్చారు.
► చంద్రుని ఉపరితలం వాసయోగ్యమో, కాదో తేల్చడంతో పాటు చంద్రునిపై జరిగే మార్పుచేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది.
► రోవర్‌లో మూడు పేలోడ్లను పంపుతున్నారు. ఇందులో లాంగ్‌మ్యూయిన్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు మారుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తుంది.
► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజకల్ ఎక్స్‌పెరమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి దోహదపడుతుంది.
► ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ పేలోడ్లు చంద్రుడి లాండింగ్ సైట్ చుట్టూ భూ కంపతను కొలుస్తాయి.
► అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్‌తో చంద్రునిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధించడంతో పాటు చంద్రుడిపై రసాయనాలున్నట్టు తేలితే వాటి జాబితా తయారీకి ఉపయోగిస్తారు.
► లేజర్ ప్రేరేపిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్ల వంటివున్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది, చుట్టూతా ఏముంది వంటివి శోధిస్తుంది.
చంద్రయాన్–2 ల్యాండర్, రోవర్ క్రాషై పని చేయకపోయినా వాటిని తీసుకెళ్లిన ఆర్బిటార్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలో తిరుగుతూ అత్యంత విలువైన సమాచారం అందిస్తోంది. చంద్రుడిపై నీళ్లున్నట్టు చంద్రయాన్–2 కూడా ధ్రువీకరించింది. చంద్రయాన్–3 ముగియగానే సూర్యుడిపై పరిశోధనలకు ఆగస్టులో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. తద్వారా మిషన్ సూర్య, చంద్ర దిగ్విజయంగా పూర్తవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment