జంట ఉపగ్రహాలతో సంపూర్ణ సూర్యగ్రహణ సృష్టి
‘ప్రోబా–3’కు ఈఎస్‌ఏ సన్నాహాలు
త్వరలో ఇస్రో ప్రయోగం
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు.
ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం.
రెండు ఉపగ్రహాలు... ఒకటిగా!
‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి.
మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి.
అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్‌లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది.
ఎందుకీ ప్రయోగం?
సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.
ఉపయోగాలేమిటి?
→ సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
→ విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
→ గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్‌ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
→ కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు.
త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం!
‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్‌ఎల్వీ (ఎక్స్‌ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్‌ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.
– జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment