European Space Agency (Esa)
-
PROBA-3: అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. రెండు ఉపగ్రహాలు... ఒకటిగా! ‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఎందుకీ ప్రయోగం? సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.ఉపయోగాలేమిటి? → సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. → విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. → గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. → కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. – జమ్ముల శ్రీకాంత్ -
‘జ్యూస్’ అన్వేషణకు అంకురార్పణ
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివాళ్లమా లేక మనలాగే మనుగడసాగించే బుద్ధిజీవులు వేరే గ్రహాలపై కూడా ఉన్నారా అన్న విచికిత్స ఈనాటిది కాదు. ఆ ప్రయత్నంలో గురువారం మరో అడుగు ముందుకుపడబోతోంది. యూరొపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) నేతృత్వంలో రూపొందిన ‘జ్యూస్’ (జూపిటర్ అయిసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్) అంతరిక్ష నౌక దక్షిణ అమెరికాలోని కౌరు దీవి నుంచి ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. 2031లో అక్కడికి చేరుకున్నాక గురు గ్రహానికున్న లెక్కకు మిక్కిలి చందమామల్లో మూడింటిని ఎంచుకుని వాటిల్లో జీవుల ఉనికి సంగతిని తేల్చడం ఈ అంతరిక్ష నౌక లక్ష్యం. అంగారక గ్రహం ఆవల జీవం ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదని ఒకప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. కానీ అంతటితో ఆగిపోతే మానవ జిజ్ఞాసకు అర్థం లేదు. ‘వేరెక్కడో ఒక మహాద్భుతం తనను తాను వ్యక్తపరుచుకోవటానికి వేచిచూస్తూ వుండొచ్చ’ని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సెగాన్ ఒక సందర్భంలో అన్నారు. ఒక్క ఖగోళ శాస్త్రం అనేమిటి...సమస్త రంగాల్లోనూ మానవాళి సాధిస్తున్న విజయపరంపరకు ఈ భావనే మూలం. 1990లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గురుగ్రహంపైకి ప్రయోగించిన గెలీలియో ఉపగ్రహం, ఈమధ్యకాలంలో శనిగ్రహానికి పోయిన కేసినీ ఉపగ్రహం శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేశాయి. గురుడు, శుక్రుడు, బుధుడు వంటి ఇతరేతర గ్రహాలపై జీవం ఉండక పోవచ్చుగానీ, గురుడు, అంగారకుడు మధ్య కనబడుతున్న చందమామలపై ఏదోమేర, ఏదో రూపంలో జీవం ఉండటానికి అవకాశం ఉన్నదని అవి పంపిన డేటా ఆధారంగా నిర్ధారణ కొచ్చారు. ఆ తర్వాతే ఈ మూడు చందమామలనూ అన్వేషించాలన్న నిర్ణయానికొచ్చారు. గ్రహాలన్నిటిలోనూ గురుగ్రహం చాలా పెద్దది. సంక్లిష్టమైనది కూడా. ఎందుకంటే దీనికి ఒకటీ రెండూ కాదు...ఏకంగా 92 చందమామలున్నాయి. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో కూడా తిరుగు తుంటాయి. అలాంటి చందమామల్లో పెద్దగా ఉండే యూరోపా, క్యాలిస్టో, గానిమీడ్ అనే మూడింటిని ఎంచుకుని వాటిచుట్టూ జ్యూస్ 35 ప్రదక్షిణలు చేస్తుంది. ఆ తర్వాత 2034లో గానిమీడ్ చుట్టూ నిర్దేశిత కక్ష్యలో కుదురుకుంటుంది. ఈ మూడు చందమామలూ మంచుతో నిండివున్నాయి. ఆ పొరల వెనక మహా సముద్రాలు నిక్షిప్తమైవున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అదే నిజమైతే ఏదో రూపంలో అక్కడ జీవం ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గానిమీడ్పై లవణసముద్రం ఉన్నదని గుర్తించారు. నిజానికి సూర్యకాంతి పడే అవకాశం లేదు గనుక ఈ మూడు చందమామల్లో జీవం ఉనికికి అవకాశం లేదు. కానీ గురుగ్రహానికుండే గురుత్వాకర్షణ ఆ లోటు తీరుస్తోంది. ఈ చందమామల్లోని సముద్రాలు వేడెక్కడానికి దోహదపడుతోంది. గురుగ్రహానికి మన దగ్గర బృహస్పతి అనే నామాంతరం ఉంది. పురాణాల్లో బృహస్పతి దేవగురువు. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... బృహస్పతికి ప్రీతిపాత్రమైన గురువారం రోజునే గురుగ్రహానికి జ్యూస్ ప్రయాణం కడుతోంది. నిజానికి ఇంతవరకూ గురుగ్రహం గురించి మానవాళికి తెలిసింది గోరంతే. దాన్ని దట్టంగా చుట్టుముట్టివుండే వాయుమేఘాలే అందుకు కారణం. అందులో అత్యధికం, అంటే...90 శాతం హైడ్రోజన్ అయితే, మిగిలిన పదిశాతంలో హీలియం, మీథేన్, గంథకం, అమోనియా వంటివి ఉన్నాయి. అయితే ఈ మూలకాల్లో ఎన్ని వాయురూపంలో ఉన్నాయో, మరెన్ని ఘనరూపం దాల్చాయో శాస్త్రవేత్తలు ఇంకా తేల్చలేదు. అసలు గురుగ్రహం నెన్నొసట సిందూరంలా ఎర్రగా మెరిసే బింబం ఒకటుంటుంది. దాని పరిమాణమే మన భూమి కన్నా మూడింతలు కాగా, అది కుదురుగా ఒకచోట ఉండక తిరుగా డుతుంటుంది. గురుగ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇలా కనబడుతోందని శాస్త్రవేత్తలంటారు. మనం భూమ్మీద క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అది గురుగ్రహం చలవే. ఎందుకంటే భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాల్లో, ఉల్కల్లో చాలాభాగాన్ని గురుగ్రహం తనవైపు ఆకర్షించుకుని వాటివల్ల కలిగే కష్టనష్టాలను తానే భరిస్తుంటుంది. నిజానికి గురుగ్రహం చుట్టూ తిరుగాడుతున్న చందమామల్లో అనేకం అటువంటి గ్రహశకలాలే. ఇందులో ఒకటైన గానిమీడ్‌కు అయస్కాంత క్షేత్రం ఉన్నా, అది బుధుడి కన్నా చాలా పెద్దదైనా గురుడి ప్రభావానికి లోనై చందమామగానే మిగిలి పోయింది. గురుగ్రహం ఆనుపానులు రాబట్టేందుకు ఇంతవరకూ 4 అంతరిక్షనౌకలు వెళ్లాయి. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్–10 గురుగ్రహం చుట్టూ 2003 వరకూ చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ తర్వాత దాన్నుంచి సంకేతాలు లేవు. మన సౌర వ్యవస్థను దాటి ముందు కెళ్లడానికి 1977లో ప్రయోగించిన వాయేజర్ గురుగ్రహాన్ని దాటుకుంటూ వెళ్తూ దాని ఛాయా చిత్రాలు పంపింది. ఆ తర్వాత 1990లో వెళ్లిన గెలీలియో, 2000లో వెళ్లిన కేసినీ వ్యోమనౌకలు సైతం గురుగ్రహ ఛాయాచిత్రాలు పంపాయి. ఇక 2016లో నాసా ప్రయోగించిన జునో అంతరిక్ష నౌక నిరుడు యూరోపా ఛాయాచిత్రాలు పంపింది. ఇప్పుడు జ్యూస్ ప్రదక్షిణలు చేయబోయే 3 చందమామల్లో యూరోపా ఒకటి. అది 2031–34 మధ్య యూరోపాను రెండుసార్లు, క్యాలిస్టోను 21సార్లు, గాని మీడ్‌ను 12 సార్లు చుట్టివస్తుంది. అంతరిక్ష నౌకలు పంపే డేటాలో కేవలం రంగుల పొందికే ఉంటుంది. వీటి ఆధారంగా అక్కడ ఏమేం వాయువులున్నాయో, మూలకాలున్నాయో అంచనా కొస్తారు. విశ్వరహఃపేటిక తెరుచుకోవాలంటే నిత్యం ప్రయోగాలు కొనసాగుతూనే ఉండాలి. ఖగోళ శాస్త్ర ఆవిష్కరణలు విశ్వానికి సంబంధించిన మన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విస్తృతపరుస్తుంటాయి. -
సూర్యుడికి ఆయుక్షీణం
లండన్: జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందట. సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనని, ఆ తర్వాత అదొక కాంతిహీనమైన తెల్లటి మరుగుజ్జు గ్రహంగా మిగిలిపోతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) చెబుతోంది. భానుడి జీవితకాలం సగం ముగిసిపోయిందని, మరో సగమే మిగిలి ఉందని పేర్కొంటోంది. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. అంతరిక్ష పరిశోధనల కోసం ఈఎస్ఏ ప్రయోగించిన గైయా స్పేస్ అబ్జర్వేటరీ(స్పేస్‌క్రాఫ్ట్) భానుడి జీవితకాలాన్ని లెక్కగట్టింది. మన సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్న సూర్యుడు నిరంతరం మండే ఓ అగ్నిగోళం. అందులో సౌర తుపాన్లు సంభవిస్తుంటాయి. అత్యధిక శక్తి వెలువడుతుంది. సూర్యుడి ఆయువు క్షీణిస్తుండడానికి కారణం ఏమిటంటే.. అందులోని హైడ్రోజన్ నిల్వలే. సూర్యుడి ఉపరితలం ఉన్న హైడ్రోజన్ హీలియం వాయువులో సంలీనం చెందుతూ ఉంటుంది. ఫలితంగా ఉష్ణం ఉద్గారమవుతుంది. భవిష్యత్తుతో హైడ్రోజన్ హీలియంలో సంలీనం చెందకుండా సూర్యుడి కేంద్ర స్థానం వైపు వెళ్తుందట! దాంతో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతాయి. సూర్యగోళం మొత్తం వయసు 10,110 కోట్ల సంవత్సరాలు అనుకుంటే, 800 కోట్ల సంవత్సరాల వయసు నాటికి గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అనంతరం ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, పరిమాణం తగ్గిపోతుందని చెబుతున్నారు. -
ఎర్త్ టూ మార్స్.. వయా మూన్!
చంద్రుడిపై ఓ వెయ్యి గజాలు కొని పెట్టేస్తే బెటరేమో! అలాగే అమ్మాయి పేరు మీద అంగారకుడిపై ఓ ఎకరం కొని పెడితే పెళ్లి టైమ్‌కి పరుగులు ఉండవు మరి!! ఇక భూమ్మీద ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి కబుర్లు చెప్పుకోవలసిన సమయం దగ్గర్లోనే ఉందంటున్నారు. ఎందుకంటే.. భూమ్మీద కొన్నేళ్లుపోతే నిలబడ్డానికే చోటు ఉండదు. ఈ వెధవ కాలుష్యం... గొడవలూ ఎవడు పడతాడు. శుభ్రంగా మరో గ్రహంపై సెటిలైపోతే విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉంటుందని లెక్కలు వేసుకునే కాలం వచ్చేస్తోంది. అంగారక అలియాస్ అరుణ గ్రహం లేదంటే ఇంగ్లిష్‌లో మార్స్! పేర్లేవైతేనేం...అక్కడో పెద్ద మంచుగడ్డ సైంటిస్టులకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ మంచు నిధిని చూసినప్పటి నుంచి ఖగోళశాస్త్ర వేత్తలు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. పొరుగూరి కెళ్లినంత తేలిగ్గా మార్స్ వెళ్లిపోదాం సామాను సర్దుకుని రెడీగా ఉండండంటున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో మనిషి మకాం వేయడం ఖాయమనే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మరీ ముఖ్యంగా మనిషి జీవించడానికి చంద్రుడితో పాటు.. అంగారకుడిపైనా అవకాశాలున్నాయని పరిశోధకులు టెలిస్కోప్ గుద్ది మరీ చెబుతున్నారు. భూమ్మీద ఉన్న మావయ్యని.. చందమామపై ఉన్న అత్తయ్య దగ్గరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అందరూ కలిసి... అంగారకుడిపై వినోదయాత్రకు బయలు దేరదాం అని ఇప్పుడెవరైనా అంటే పిచ్చి పట్టిందేమో అని భయం భయంగా చూస్తారేమోకానీ.. మరో యాభై ఏళ్ల తర్వాత అది అత్యంత సహజమైన పరిణామమవుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది. ఆ మధ్య చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా నీటి జాడలు కచ్చితంగా ఉన్నాయని తేలడం తోనే అక్కడ మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రుడిపై గ్రామాలు కట్టేస్తారట. ఆ గ్రామాల్లో చక్కటి ఇళ్లు నిర్మించేసి భూమి నుంచి వలస వచ్చేవారి కోసం సిద్ధంగా ఉంచుతారట. చంద్రుడిపై విస్తారంగా ఇళ్లు కట్టేశాక కాలనీ కోసం అంగారకుడిపైకి వెళ్తారట. అంగారకుడి పైనా విశాలమైన కాలనీలు నిర్మించి.. మనుషులు మకాం పెట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తారట. ఇదంతా ఎందుకంటే... ఇప్పటికే మితిమీరిన జనాభాతో భూమి కిక్కిరిసిపోతోంది. మరో యాభై ఏళ్లు దాటితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. భూమిపై కాలు మోపడానికి కూడా ఖాళీ స్థలం ఉండకపోవచ్చు. అప్పుడు కొత్తగా పుట్టబోయే వారికి భూమ్మీద నివసించడానికి చోటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాల భూగ్రహ వాసులు ఏం చేయాలి? దానికి సమాధానంగానే చంద్రుడు, అంగారకుడిపై దృష్టి సారించారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ కాలనీలు కానీ కట్టడం పూర్తయితే... భూమి నుంచి పెద్ద సంఖ్యలో జనం కొత్త గ్రహాలకు వలసపోతారన్నమాట! మరో వందేళ్లు దాటిందనుకోండి భూమిపై ఉన్న వారికి చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా చుట్టాలు ఉండచ్చు. భూమిపై ఉండేవారు మునుముందు తమ చుట్టాలను చూసి రావడానికి చంద్రుడిపైకి, అంగారకుడిపైకి అంతరిక్ష నౌకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భూమ్మీద జనాభా పెరిగిపోవడంతో పాటు.. రోజురోజుకీ పెరిగిపోతోన్న కాలుష్యం భూమిని ప్రమాదకరమైన గ్రహంగా మార్చేస్తోంది. భూమి చుట్టూరా ఉన్న వాతావరణమంతా విషమయమై పోతోంది. అంతులేని భూతాపం భూమిపై మానవ జాతి మనుగడకే సవాల్ విసురుతోంది. గాలితో పాటు భూమిలోని నీరు, అంతరిక్షం కూడా కలుషితమైపోతున్నాయి. వీటికితోడు మానవాళి వినాశనానికి దారి తీసే అణ్వాయుధాల భయమూ పెరుగుతోంది. ఏ క్షణంలో ఏ దేశం అణు బాంబును ప్రయోగిస్తుందో తెలీని ఉత్కంఠ నెలకొంది. అడిలైడ్‌లో 4వేల మంది అంతరిక్ష పరిశోధకులతో జరిగిన వార్షిక సమావేశంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ కొత్త గ్రహాలపై కాలనీల ఏర్పాటు గురించి ఆశావహ దృక్పథంతో ప్రచారం చేసింది. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అందులో 17 ఏళ్లుగా నివసిస్తున్నామని ఈ సమావేశంలో స్పేస్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత ఆవాసాల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందనే తాము భావిస్తున్నామని ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. రానున్న పదేళ్లల్లో చంద్రుడిపై గ్రామం నిర్మాణానికి సంబంధించి అనువైన సమాచారాన్ని సేకరించి ప్రణాళికలు రూపొందించేందుకు మిషన్లను తయారు చేస్తున్నట్లు మెస్సినా పేర్కొన్నారు. మొత్తం మీద ‘మా పెద్దబ్బాయి భూమ్మీద పని చేస్తున్నాడు. రెండో అబ్బాయి చంద్రుడిపైనా... మా అమ్మాయి అంగారకుడిపైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారు’ అని తల్లిదండ్రులు మురిసి పోయే రోజులు దూరంలో లేవన్నమాట. అప్పుడు మూడు గ్రహాలపైనా చుట్టాలుంటారు. అన్నీ బానే ఉన్నాయి కానీ... అసలు సౌర వ్యవస్థలో ప్రాణులు జీవించడానికి ఆస్కారమున్న గ్రహాలున్నాయా అని? మనిషి ఆశాజీవి కదా! అసాధ్యమన్నదే తన డిక్షనరీలో లేదనుకుంటాడు. ప్రకృతినీ తాను శాసించేయగలనని అనుకుంటూనే ఉంటాడు. సాధ్యం కాని ఎన్నో ఘనతలను ఇలాంటి ధీమాతోనే సాధించి పారేశాడు కూడా! మరయితే మనిషి వేరే గ్రహాలపై కాపురం పెట్టేస్తాడా? ఏమో... గుర్రం ఎగరావచ్చు!! -
4 కోట్ల గంటలు.. 10 వేల మంది.. 76 వేల కోట్ల ఖర్చు
విశ్వ రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆదిమ కాలం నుంచి మానవుడికి ఉండేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ జిజ్ఞాసతో టెలిస్కోపుల నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద టెలిస్కోపును నిర్మించడం జరిగింది. ఇంతవరకు విశ్వ రహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం డిసెంబర్ 22న జరగనుంది. బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడనుంది. విశ్వ రహస్యాలను వివరంగా చూపించే ఈ టెలిస్కోపు నిర్మాణం నుంచి ప్రయోగం వరకు అనేక విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం.. 10,000 మంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యముంది. ఏరియన్ 5 స్పేస్ రాకెట్లో ఫ్రెంచ్ గినియాలోని గినియాస్పేస్ సెంటర్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు 4 కోట్ల పనిగంటల పాటు కష్టపడ్డారు. 25 సంవత్సరాలు 1996లో ఎన్జీఎస్టీ పేరిట ఈ టెలిస్కోపు ప్రాజెక్టు ఆరంభమైంది. 2002లో దీనికి జేమ్స్ వెబ్ పేరును పెట్టారు. సుదీర్ఘకాలం పట్టిన ఈ టెలిస్కోపు నిర్మాణం సాఫీగా జరగలేదు. నిధుల కొరతతో ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. 2011లో అమెరికా చట్టసభల కేటాయింపుల కమిటీ ఈ ప్రాజెక్టును ఏకంగా రద్దు చేయాలని పత్రిపాదించింది. ఆ సమయంలో దీన్ని నేచర్ పత్రిక ‘ఖగోళ నిధులు మింగేస్తున్న టెలిస్కోపు’గా అభివర్ణించింది. అయితే రద్దు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా కాంగ్రెస్ టెలిస్కోపు నిర్మాణాన్ని కొనసాగించే నిధులను కేటాయించింది. దీంతో సుమారు 25 సంవత్సరాల కృషి అనంతరం 2021కి టెలిస్కోపు సిద్ధమైంది. రూ.76 వేల కోట్లు సుదీర్ఘకాలం కొనసాగడంతో దీని నిర్మాణానికి చాలా నిధులు వెచ్చించారు. 1996లో ఈ టెలిస్కోపు నిర్మాణ అంచనా నిధులు 50 కోట్ల డాలర్లు కాగా, 2021లో పూర్తయ్యేనాటికి 1,000 కోట్ల డాలర్ల (సుమారు 76 వేల కోట్ల రూపాయలు) వ్యయమైంది. లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమణం డిసెంబర్ 22న ప్రయోగంతో దీన్ని భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ బిందువు వద్దకు చేరుస్తారు. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇది భూమిలా సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తుంటుంది. టెలిస్కోపులోని దర్పణాలను, పరికరాలను –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు దీనికి సిలికాన్, అల్యూమినియం పూత పూసిన సౌర కవచాన్ని తొడిగారు. హబుల్ భూమికి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది. 11 రోజులు ప్రయోగించిన 11 రోజులకు ఇది ఎల్2 పాయింటుకు చేరుకుంటుంది. అక్కడ కక్ష్యలో ప్రవేశించాక అంతవరకు ముడుచుకుని ఉన్న దర్పణం తెరుచుకొని పని ప్రారంభిస్తుంది. ఇందులో ప్రాథమిక దర్పణం కాకుండా మరో మూడు దర్పణాలు, లైట్ డిటెక్టర్, స్టార్ ట్రాకర్స్, సోలార్ ప్యానెల్స్, యాంటెన్నాలాంటి ఇతర భాగాలుంటాయి. 458 జీబీ కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. 1350 కోట్ల సంవత్సరాల క్రితం కాంతి బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గాలక్సీల నుండి వెలువడ్డ కాంతి కోసం అన్వేషణ, గెలాక్సీల నిర్మాణం, పరిణామాలను, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటును అధ్యయనం చేయడం, జీవావిర్భావాన్ని పరిశోధించడం లక్ష్యంగా ఈ టెలిస్కోపు పనిచేయనుంది. జేమ్స్ వెబ్ పరారుణ సామర్థ్యంతో బిగ్ బ్యాంగ్ అనంతరం కొన్ని పదుల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడిన తొలి గెలాక్సీల గురించి పరిశీలించవచ్చు. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికి సుమారు 1380 కోట్ల సంవత్సరాలైందని అంచనా. ఈ టెలిస్కోపు సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టగలదు. ఆసక్తి ఉన్న సైంటిస్టులు డైరెక్టర్స్ డిస్క్రెషనరీ ఎర్లీ రిలీస్ సైన్స్(డిడి–ఇఆర్ఎస్) కార్యక్రమం, గ్యారెంటీడ్ టైమ్ అబ్జర్వేషన్స్(జిటిఓ) కార్యక్రమం, జనరల్ అబ్జర్వర్స్(జిఓ) కార్యక్రమాల ద్వారా ఈ టెలిస్కోపును వాడుకొని ఖగోళ పరిశోధన చేసేందుకు సమయాన్నిస్తారు. నేషనల్ డెస్క్, సాక్షి -
టాటా స్కై కోసం అంతరిక్షంలోకి జిశాట్-24 కమ్యూనికేషన్ శాటిలైట్
యూరోపియన్ ఏరోస్పేస్ ఏజెన్సీ ఏరియన్ స్పేస్'కు చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా నాలుగు టన్నుల జీశాట్-24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ప్రభుత్వ రంగ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) నిర్ణయించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్మించిన ఈ నాలుగు టన్నుల క్లాస్ కమ్యూనికేషన్-బ్యాండ్ ఉపగ్రహాన్ని ఏరియన్-5 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఎన్ఎస్ఐఎల్ చేత తయారు చేయబడిన పూర్తి స్థాయి జీశాట్-24 ఉపగ్రహాన్ని 2022 మొదటి త్రైమాసికంలో ప్రయోగించాలని భావిస్తున్నారు. డిటిహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చడం కోసం మొత్తం జిశాట్-24 ఉపగ్రహాన్ని టాటా స్కైకి లీజుకు ఇచ్చారు. జిశాట్-24 ఉపగ్రహాన్ని ఎన్ఎస్ఐఎల్ వాణిజ్య ప్రాతిపదికన స్వంతం చేసుకుని నడుపుతుంది. గతంలో అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఛైర్మన్ కె. శివన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రో తయారు చేసిన జిశాట్ 20, జిశాట్ 22, జిశాట్ 24 అనే మూడు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఎన్ఎస్ఐఎల్ స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాలను కొనుగోలు చేయడమే కాకుండా వాటిని లీజుకు తీసుకోవచ్చు. (చదవండి: లక్ష పెట్టుబడి..ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం) ప్రభుత్వ రంగ అంతరిక్ష వాణిజ్య సంస్థ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) ఉపగ్రహాలు, వాహక నౌకల తయారీ కోసం పెట్టుబడుల పెడుతుంది. వచ్చే అయిదేళ్లలో రూ.10 వేల కోట్ల వ్యయంతో తమదైన సొంత వాహక నౌకలను తయారు చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ జి.నారాయణన్ బెంగళూరులో ప్రకటించారు. రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సైతం కొనుగోలు/లీజుకు తీసుకుంటుంది. వచ్చే ఏడాది డీటీహెచ్(టాటా స్కై), బ్రాడ్ బ్యాండ్ సంస్థలకు చెందిన రెండు ఉపగ్రహాలను వచ్చే ఏడాది ప్రయోగిస్తామన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 342 సంస్థలు ఎన్ఎస్ఐఎల్తో ఒప్పందాలు కుదుర్చుకోగా వాటిల్లో అత్యధిక సంస్థలు అమెరికాకు చెందినవని నారాయణ్ తెలిపారు. -
టిక్... టిక్... టిక్
ఓ గ్రహశకలం.. వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.. అప్పుడో.. ఇప్పుడో భూమిని తాకడం ఖాయం! ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు.. ఇంతలోనే ఓ అద్భుతం జరిగింది.. భూమ్మీది నుంచి దూసుకెళ్లిన అంతరిక్ష నౌక.. ఆ గ్రహశకలాన్ని.. ఢీకొట్టింది! వెంటనే అది పటాపంచలైంది.. ఇదేదో సినిమా కథ అనుకునేరు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో మూడేళ్లలో మనం ప్రత్యక్షంగా చూడబోయే ఘటనే ఇది. భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందన్న వార్తలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. తీరా చూస్తే అవి భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయిందని, లేదా కక్ష్యమార్గం మార్చుకుందని తెలియగానే ఊపిరి పీల్చుకుంటాం. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొడుతుందని తెలిస్తే.. ఏం చేయాలి.. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి.. రాకెట్లతో ఆ గ్రహశకలాన్ని పేల్చేస్తే సమస్య తీరిపోతుందా.. గ్రహశకలాన్ని ముక్కలుగా చేయాలా.. లేదా రాకెట్‌తో ఢీకొట్టిస్తే దాని దిశ మారిపోయి మనకు ప్రమాదం తప్పిపోతుందా.. ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లు సంయుక్తంగా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) అనే ప్రయోగాన్ని చేపట్టనున్నాయి. ఇందులో భాగంగా 2022 సెప్టెంబర్‌లో ఓ గ్రహశకలాన్ని అంతరిక్ష నౌకతో ఢీ కొట్టనున్నారు. దానికి ఒక ఏడాది ముందు చిన్న ఉపగ్రహంతో కూడిన అంతరిక్ష నౌక నింగిలోకి ఎగరనుంది. ఏమిటా గ్రహశకలం? ఈ ప్రయోగానికి ఎంచుకున్న గ్రహశకలం పేరు డిడైమోస్–బి. ఇది ఒకే గ్రహశకలం కాదు. రెండు శకలాలతో కూడిన వ్యవస్థ. అందులో చిన్నసైజులో ఉండే ‘బి’శకలాన్ని ఢీకొట్టాలన్నది ప్రణాళిక. భూమికి కొంచెం దూరంలోనే ఉండే ఈ వ్యవస్థలో ‘ఏ’శకలం 780 మీటర్ల వెడల్పు ఉంటే.. ‘బి’160 మీటర్లు మాత్రమే ఉంటుంది. 12 గంటలకోసారి ‘ఏ’చుట్టూ తిరుగుతుంది. పైగా డిడైమోస్ వ్యవస్థ భూమి వైపు దూసుకు రావట్లేదు కాబట్టి దీన్ని అంతరిక్ష నౌకతో ఢీ కొట్టించినా మనకు వచ్చే నష్టమేమీ ఉండదు. జపాన్‌కు చెందిన హయబుస–2 అంతరిక్ష నౌక ఈ ఏడాది ఏప్రిల్‌లో రైగూ అనే గ్రహశకలాన్ని ఢీకొన్నప్పుడు తెలిసిన కొన్ని కొత్త సంగతులను పరీక్షించేందుకు ఈ తాజా ప్రయోగం ఉపయోగపడుతుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త నాన్సీ చాబోట్ అంటున్నారు. భవిష్యత్ ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు డిడైమోస్ చాలా అనువైందని చెప్పారు. వేగాన్ని మారుస్తారు.. అంతే! సుమారు గంటకు 23,760 కిలోమీటర్ల వేగంతో అంతరిక్ష నౌక డిడైమోస్–బిని ఢీకొడుతుంది. అయినాసరే.. ఆ గ్రహశకలమేమీ ముక్కలు కాదు కానీ దాని వేగం స్వల్పంగా తగ్గుతుంది. అది కూడా సెకనుకు సెంటీమీటర్ వరకు మాత్రమే ఉంటుందని.. ఈ స్వల్ప మార్పుతోనే అది డిడైమోస్–ఏ చుట్టూ తిరిగే కాలంలో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి చేటు తేగల గ్రహశకలాలను ఇలాగే నిరపాయకరంగా మార్చొచ్చా.. అనేది పరిశీలిస్తారు. ఇందుకు తగ్గట్లే ఢీకొనేందుకు కొన్ని క్షణాల ముందు ఓ చిన్న క్యూబ్‌శాట్ డార్ట్ నుంచి విడిపోయి.. ఫొటోలు తీసి మనకు పంపుతుంది. దాంతో పాటు 2023లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించే హెరా అనే అంతరిక్ష నౌక కూడా ఈ గ్రహశకలాన్ని పరిశీలించే ఏర్పాట్లు చేశారు. తద్వారా గ్రహశకలాన్ని అంతరిక్ష నౌకతో ఢీకొట్టించడమన్న ప్రయోగం విజయవంతమైందా.. లేదా అన్నది తెలుస్తుంది. ఏవి ప్రమాదకరం? అంతరిక్షం నుంచి దూసు కొచ్చే వేల గ్రహశకలాలతో భూమికి నిత్యం ప్రమాదం పొంచి ఉంటుంది. చిన్న గ్రహశకలాలు భూ వాతావరణంలోకి చేరిన వెంటనే మండిపోతాయి. రోజూ ఇలాంటి చిన్న సైజు గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. పెద్దసైజువి మాత్రం కొంచెం అరుదు. ఒక అంచనా ప్రకారం కిలోమీటర్ కంటే ఎక్కువ సైజున్న గ్రహశకలాలు సుమారు 200 వరకు ఉండగా.. అన్ని సైజుల శకలాల సంఖ్య దాదాపు 2 వేలకు పైగానే ఉన్నాయి. 1999లో గుర్తించిన అపోలో (53319) 1999 జేఎం8 7 కిలోమీటర్ల వెడల్పుతో అతిపెద్ద గ్రహశకలం గా గుర్తింపు పొందింది. గ్రహశకలం 35 మీటర్ల కంటే పెద్ద సైజులో ఉండి.. భూమిని ఢీకొడితే ఒక నగరం స్థాయిలో విధ్వంసం జరుగుతుంది. కిలోమీటర్ సైజున్నవి ఢీకొంటే ప్రాణ నష్టం ఒక దేశం లేదా ఖండం స్థాయిలో ఉంటుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మరో స్కైలాబ్?! మహావినాశనం??
చైనాకు చెందిన ఒక స్పేస్ స్టేషన్ మరో స్కైలాబ్ కానుందా? ఇప్పటికే భూ నియంత్రణ కోల్పోయిందా? ఒక మహానగరం మొత్తం సర్వనాశనం కానుందా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? భూమిపై ఎప్పుడు విలయం సృష్టిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవండి. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యాలతో పోటీ పడే చైనా.. ప్రపంచానికి మహా ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా పంపిన తియాంగాంగ్-1 పూర్తిగా భూ నియంత్రణ కోల్పోయినట్లు ఐరోపా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సైంటిస్టుల నియంత్రణ కోల్పోయిన ఈ స్పేస్ స్టేషన్ వచ్చే ఏడాది లోపు ఉత్తర, దక్షిణార్ధ గోళాల మధ్యలో ఎక్కడైనా పడొచ్చని వారు ప్రకటించారు. భారీ స్పేస్ స్టేషన్ చైనా నిర్మించిన తియాంగాంగ్-1 8.5 టన్నుల బరువు ఉంటుంది. 12 మీటర్ల పొడవున్న తియాంగాంగ్ జనవరి-మార్చి మధ్య కాలంలో ఎప్పుడైనా, ఎక్కడైనా భీకరంగా నేల కూలవచ్చని సైంటిస్టుల హెచ్చరిస్తున్నారు. ప్రమాదంలో ప్రధాన నగరాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలున్నాయి. ప్రమాద స్థాయి తియాంగాంగ్-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. జీవరాశి మొత్తం అంతరించిపోగా, భారీ భవనాలు సైతం నేల మట్టమవుతాయి. మనకు ప్రమాదం? తియాంగాంగ్-1 నుంచి భారత్, బ్రిటన్లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. -
రోసెట్టా అపూర్వ విజయం
మనిషి విజ్ఞాన శాస్త్ర ప్రయాణం మరో కీలక మలుపు తీసుకుంది. ఖగోళంలో మనకు అనంత దూరంలో తిరుగాడుతున్న తోకచుక్కను వెంటాడుతూ వెళ్లిన అంతరిక్ష నౌక రోసెట్టా... తనతో తీసుకెళ్లిన ప్రయోగ పరికరం ఫీలే ల్యాండర్‌ను దానిపై నిలపగలగడం మానవాళి సాధించిన ఒక అసాధారణ విజయం. యూరోప్ అంతరిక్ష సంస్థ (ఈసా) ప్రయోగించిన రోసెట్టాకు రాత్రీ లేదు...పగలూ లేదు. విరామమూ, విశ్రాంతీ లేనేలేదు. దశాబ్దకాలంనుంచి నిరంతర ప్రయాణం. 650 కోట్ల కిలోమీటర్ల దూరమే లక్ష్యం. గంటకు 54,718 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రోసెట్టా... అంతరిక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు చెప్పినట్టల్లా విని ఈ లక్ష్యాన్ని సాధించింది. మధ్యలో 957 రోజులపాటు నిద్రాణ స్థితిలో ఉంచితే అలా ఉంటూ కూడా మునుముందుకు సాగింది. 2004లో దీన్ని ప్రయోగించినప్పుడు శాస్త్రవేత్తల్లో పెద్ద ఆశలేమీ లేవు. తెలియని తీరాల అంచులకు సాగనంపుతున్నామనీ, మధ్యలో అనుకోనిదేదైనా సంభవిస్తే ఈ ప్రయాణం అర్ధంతరంగా నిలిచిపోతుందన్న ఎరుక వారిలో ఉన్నది. అన్నీ సక్రమంగా పూర్తయ్యాక ఫీలే ల్యాండర్ తోకచుక్కపై దిగే అవకాశాలు సైతం 75 శాతంమాత్రమే ఉంటాయని లెక్కేశారు. కనుకనే ఈసా శాస్త్రవేత్తలు రెప్పవాల్చకుండా దాన్ని వీక్షించారు. ఎప్పటికప్పుడు తోకచుక్క గమనాన్ని చూసుకుంటూ, రోసెట్టా ఎంత వేగంతో వెళ్తే దాన్ని అందుకోగలదో అంచనా వేసుకుంటూ అవసరమైన ఆదేశాలు పంపారు. రోసెట్టాకు కాంతివేగంతో ఒక సందేశం పంపితే అది దానికి చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. వెనువెంటనే తనకు అమర్చిన రాకెట్లను మండించుకుంటూ తన వేగాన్ని, దిశను నియంత్రించుకుంటుంది. 30 నిమిషాల తర్వాత అది ఏంచేయాలో నిర్దేశించడమనే సంక్లిష్ట ప్రక్రియను శాస్త్రవేత్తలు సజావుగా పూర్తిచేయగలగడం గొప్ప విషయమే. పదేళ్ల ఈ యజ్ఞం ఫలించింది. బుధవారం రోసెట్టా తనతో తీసుకెళ్లిన ఫీలే ల్యాండర్‌ను తోకచుక్కపైకి జారవిడిచింది. మరో ఏడుగంటల తర్వాత ఫీలే ల్యాండర్ తోకచుక్కను ముద్దాడి భూమ్మీది అంతరిక్ష కేంద్రానికి సచిత్ర సందేశాలను పంపింది. 1,400 కోట్ల సంవత్సరాలక్రితం అణువుల మహా విస్ఫోటం సంభవించి ఆవిర్భవించిన ఈ విశ్వంలో గ్రహాలు...వాటికి మళ్లీ ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు ఎన్నెన్నో! నిత్యం తిరుగాడే లక్షలాది గ్రహాలు, నక్షత్రాల్లోనుంచి వెలువడే ధూళి...కాలక్రమంలో మేఘాలుగా పరివర్తనం చెంది, అవి క్రమేపీ గడ్డకట్టుకుపోయి తోకచుక్కలుగా, శకలాలుగా మారి ఉంటాయన్నది శాస్త్రవేత్తల భావన. 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన భూమిపైకి ఇలా దారితప్పి దూసుకొచ్చిన తోకచుక్కేదో జీవరాశి ఆవిర్భావానికి పనికొచ్చే కర్బన మిశ్రమాలనూ, నీటినీ మోసుకొచ్చి ఉంటుందని వారి అంచనా. మన సౌర వ్యవస్థను పోలిన వ్యవస్థలు విశ్వంలో ఎన్నో ఉన్నాయని... వాటిల్లో ఎక్కడో ఇవే తరహా మార్పులు జరిగి జీవరాశితో అలరారే గ్రహం ఉండే అవకాశం లేకపోలేదని చెబుతారు. ఈ తోకచుక్కలూ, గ్రహశకలాలూ విశ్వావిర్భావంనుంచీ ఎక్కడికో, ఎటో తెలియకుండా పరిభ్రమిస్తూనే ఉన్నాయి. అంతేకాదు... ఇవి తమలో ఆనాటి జ్ఞాపకాలను మూలకాల రూపంలో అత్యంత జాగ్రత్తగా పదిలపరుచుకున్నాయి. నిర్దిష్టమైన కక్ష్యలో ఇవి తిరుగాడుతున్నట్టే కనబడుతున్నా ఎప్పుడో హఠాత్తుగా ఇవి దారితప్పడమూ, ఉపద్రవాలు తీసుకురావడమూ తథ్యం. ఇలాంటి ఉపద్రవాలను నివారించాలంటే వీటికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం అవసరమని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఒక్క తోకచుక్కను పట్టుకున్నా, అందులోని పదార్థాలేమిటో, దాని పోకడలేమిటో తెలుసుకోగలిగినా ఈ విశ్వానికి సంబంధించి మన అవగాహన మరింత విస్తృతమవుతుందని...అదే సమయంలో భూమికి ఎదురుకాగల ఉపద్రవాలను నిరోధించడంలో పనికొస్తుందని శాస్త్రవేత్తలు ఆశించారు. శక్తిమంతమైన టెలిస్కోపులతో తోకచుక్కలూ, గ్రహశకలాల ఆచూకీని రాబట్టడం...వాటి వేగాన్ని, కక్ష్యను లెక్కేసి తెలుసుకోవడం నిత్యం సాగే పనే. ఇందులో కొత్తగా తారసపడినవేమైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు కూపీ లాగుతారు. అలా తొలిసారి 1969లో అప్పటి సోవియెట్ యూనియన్‌కు చెందిన ఇద్దరు ఔత్సాహికులు 67పీ తోకచుక్కను కనుక్కున్నారు. ఆ ఇద్దరి పేర్లే ఈ తోకచుక్కకు పెట్టారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రోసెట్టా ఎన్నిటినో దాటింది. మధ్యలో అంగారకుడి పక్కనుంచి దూసుకెళ్లింది. స్టీన్స్, టుటేషియా వంటి భారీ గ్రహశకలాల బారిన పడకుండా ఒడుపుగా తప్పించుకున్నది. మొన్న సెప్టెంబర్‌లో తోకచుక్కకు 50 కిలోమీటర్ల దూరంలో ఉండగా తన సెల్ఫీని సైతం తీసుకుని పంపింది. మినీ బస్సు సైజులో ఉండే రోసెట్టా మరో ఏడాదిపాటు తోకచుక్క కక్ష్యలోనే తిరుగుతూ తనకు అమర్చిన 21 పరికరాల సాయంతో దాన్ని జల్లెడపడుతుంది. సూర్యుడికి సమీపంగా వెళ్తున్నప్పుడు తోకచుక్కలో స్పందనలెలా ఉన్నాయో చూసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది. ఫీలే ల్యాండర్‌లోని ఏడు కెమెరాలు 360 డిగ్రీల్లో తోకచుక్క ఛాయాచిత్రాలు తీసి పంపుతాయి. తోకచుక్కలో ఉండగలదనుకుంటున్న నీరు, మంచులో నిక్షిప్తమై ఉన్న సేంద్రీయ పదార్థాలేమిటో విశ్లేషించి సమాచారం అందిస్తుంది. సృష్టి, స్థితులకు కారణమైన తోకచుక్కలు, గ్రహశకలాలే ఎప్పుడో ఒకప్పుడు లయ కారకాలు కూడా కావొచ్చు. అందుకు అంగారక, గురుగ్రహాలను తరచు ఢీకొట్టే తోకచుక్కలు, గ్రహశకలాలే రుజువు. విజ్ఞానశాస్త్ర సాయంతో దీన్ని సులభంగా ఎదుర్కొనగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు రోసెట్టా సాధించిన విజయం ఆ దిశగా వేసిన తొలి అడుగు. అంతరిక్షంనుంచి పొంచివున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఇలాంటి అడుగులు మరిన్ని పడవలసి ఉంటుంది. ఈ క్రమానికి శ్రీకారం చుట్టిన ఈసా శాస్త్రవేత్తలు అభినందనీయులు.