చంద్రుడిపై ఓ వెయ్యి గజాలు కొని పెట్టేస్తే బెటరేమో! అలాగే అమ్మాయి పేరు మీద అంగారకుడిపై ఓ ఎకరం కొని పెడితే పెళ్లి టైమ్‌కి పరుగులు ఉండవు మరి!! ఇక భూమ్మీద ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి కబుర్లు చెప్పుకోవలసిన సమయం దగ్గర్లోనే ఉందంటున్నారు. ఎందుకంటే.. భూమ్మీద కొన్నేళ్లుపోతే నిలబడ్డానికే చోటు ఉండదు. ఈ వెధవ కాలుష్యం... గొడవలూ ఎవడు పడతాడు. శుభ్రంగా మరో గ్రహంపై సెటిలైపోతే విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉంటుందని లెక్కలు వేసుకునే కాలం వచ్చేస్తోంది.
అంగారక అలియాస్ అరుణ గ్రహం లేదంటే ఇంగ్లిష్‌లో మార్స్! పేర్లేవైతేనేం...అక్కడో పెద్ద మంచుగడ్డ సైంటిస్టులకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ మంచు నిధిని చూసినప్పటి నుంచి ఖగోళశాస్త్ర వేత్తలు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. పొరుగూరి కెళ్లినంత తేలిగ్గా మార్స్ వెళ్లిపోదాం సామాను సర్దుకుని రెడీగా ఉండండంటున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో మనిషి మకాం వేయడం ఖాయమనే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మరీ ముఖ్యంగా మనిషి జీవించడానికి చంద్రుడితో పాటు.. అంగారకుడిపైనా అవకాశాలున్నాయని పరిశోధకులు టెలిస్కోప్ గుద్ది మరీ చెబుతున్నారు. భూమ్మీద ఉన్న మావయ్యని.. చందమామపై ఉన్న అత్తయ్య దగ్గరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అందరూ కలిసి... అంగారకుడిపై వినోదయాత్రకు బయలు దేరదాం అని ఇప్పుడెవరైనా అంటే పిచ్చి పట్టిందేమో అని భయం భయంగా చూస్తారేమోకానీ.. మరో యాభై ఏళ్ల తర్వాత అది అత్యంత సహజమైన పరిణామమవుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది.
ఆ మధ్య చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా నీటి జాడలు కచ్చితంగా ఉన్నాయని తేలడం తోనే అక్కడ మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రుడిపై గ్రామాలు కట్టేస్తారట. ఆ గ్రామాల్లో చక్కటి ఇళ్లు నిర్మించేసి భూమి నుంచి వలస వచ్చేవారి కోసం సిద్ధంగా ఉంచుతారట. చంద్రుడిపై విస్తారంగా ఇళ్లు కట్టేశాక కాలనీ కోసం అంగారకుడిపైకి వెళ్తారట. అంగారకుడి పైనా విశాలమైన కాలనీలు నిర్మించి.. మనుషులు మకాం పెట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తారట.
ఇదంతా ఎందుకంటే... ఇప్పటికే మితిమీరిన జనాభాతో భూమి కిక్కిరిసిపోతోంది. మరో యాభై ఏళ్లు దాటితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. భూమిపై కాలు మోపడానికి కూడా ఖాళీ స్థలం ఉండకపోవచ్చు. అప్పుడు కొత్తగా పుట్టబోయే వారికి భూమ్మీద నివసించడానికి చోటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాల భూగ్రహ వాసులు ఏం చేయాలి? దానికి సమాధానంగానే చంద్రుడు, అంగారకుడిపై దృష్టి సారించారు ఖగోళ శాస్త్రవేత్తలు.
ఆ కాలనీలు కానీ కట్టడం పూర్తయితే... భూమి నుంచి పెద్ద సంఖ్యలో జనం కొత్త గ్రహాలకు వలసపోతారన్నమాట! మరో వందేళ్లు దాటిందనుకోండి భూమిపై ఉన్న వారికి చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా చుట్టాలు ఉండచ్చు. భూమిపై ఉండేవారు మునుముందు తమ చుట్టాలను చూసి రావడానికి చంద్రుడిపైకి, అంగారకుడిపైకి అంతరిక్ష నౌకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భూమ్మీద జనాభా పెరిగిపోవడంతో పాటు.. రోజురోజుకీ పెరిగిపోతోన్న కాలుష్యం భూమిని ప్రమాదకరమైన గ్రహంగా మార్చేస్తోంది. భూమి చుట్టూరా ఉన్న వాతావరణమంతా విషమయమై పోతోంది. అంతులేని భూతాపం భూమిపై మానవ జాతి మనుగడకే సవాల్ విసురుతోంది. గాలితో పాటు భూమిలోని నీరు, అంతరిక్షం కూడా కలుషితమైపోతున్నాయి. వీటికితోడు మానవాళి వినాశనానికి దారి తీసే అణ్వాయుధాల భయమూ పెరుగుతోంది. ఏ క్షణంలో ఏ దేశం అణు బాంబును ప్రయోగిస్తుందో తెలీని ఉత్కంఠ నెలకొంది.
అడిలైడ్‌లో 4వేల మంది అంతరిక్ష పరిశోధకులతో జరిగిన వార్షిక సమావేశంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ కొత్త గ్రహాలపై కాలనీల ఏర్పాటు గురించి ఆశావహ దృక్పథంతో ప్రచారం చేసింది. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అందులో 17 ఏళ్లుగా నివసిస్తున్నామని ఈ సమావేశంలో స్పేస్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత ఆవాసాల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందనే తాము భావిస్తున్నామని ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. రానున్న పదేళ్లల్లో చంద్రుడిపై గ్రామం నిర్మాణానికి సంబంధించి అనువైన సమాచారాన్ని సేకరించి ప్రణాళికలు రూపొందించేందుకు మిషన్లను తయారు చేస్తున్నట్లు మెస్సినా పేర్కొన్నారు.
మొత్తం మీద ‘మా పెద్దబ్బాయి భూమ్మీద పని చేస్తున్నాడు. రెండో అబ్బాయి చంద్రుడిపైనా... మా అమ్మాయి అంగారకుడిపైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారు’ అని తల్లిదండ్రులు మురిసి పోయే రోజులు దూరంలో లేవన్నమాట. అప్పుడు మూడు గ్రహాలపైనా చుట్టాలుంటారు.
అన్నీ బానే ఉన్నాయి కానీ... అసలు సౌర వ్యవస్థలో ప్రాణులు జీవించడానికి ఆస్కారమున్న గ్రహాలున్నాయా అని? మనిషి ఆశాజీవి కదా! అసాధ్యమన్నదే తన డిక్షనరీలో లేదనుకుంటాడు. ప్రకృతినీ తాను శాసించేయగలనని అనుకుంటూనే ఉంటాడు. సాధ్యం కాని ఎన్నో ఘనతలను ఇలాంటి ధీమాతోనే సాధించి పారేశాడు కూడా! మరయితే మనిషి వేరే గ్రహాలపై కాపురం పెట్టేస్తాడా? ఏమో... గుర్రం ఎగరావచ్చు!!
Comments
Please login to add a commentAdd a comment