Rahu ketuvu
-
PROBA-3: అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. రెండు ఉపగ్రహాలు... ఒకటిగా! ‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఎందుకీ ప్రయోగం? సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.ఉపయోగాలేమిటి? → సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. → విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. → గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. → కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. – జమ్ముల శ్రీకాంత్ -
కాలసర్ప దోషమా?
జాతకంలో దోషాలు ఉండడం సహజమే. అదేవిధంగా ప్రతి దోషానికి మన ఋషులు నివారణ ఉపాయాలు కూడా అదే రీతిలో చెప్పారు. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి? కాలసర్పదోషం జాతకంలో రాహు కేతువుల వలన ఏర్పడుతుంది. జాతకంలో 7 గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండిపోవడమే కాలసర్పదోషం అని తేలికగా గుర్తుపట్టవచ్చు. ఈ దోషం వలన వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే ...! జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా వాటిని కాల సర్పదోషం మింగేయడమే. వివాహం, సంతానం, దాంపత్యంలో అన్యోన్యత, వృత్తి / ఉద్యోగంలో ఉన్నతి మొదలైన వాటికి ప్రధాన అవరోధంగా మారుతుంది. కాలసర్పదోషం ఎందుకు వస్తుంది? ఈదోషం వంశపారంపర్యంగా లేదా ఒక్కరికైనా గానీ రావొచ్చు. చాలామంది అనుకునేది ఏంటి అంటే సర్పాలను చంపడం వలననే ఈ దోషం వస్తుందేమో అని. కొంత నిజమే అయినా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సర్పాలను తెలిసిగానీ తెలియకగానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా సంహరించడం చేసినా దోషం వదలదు అని నిర్ణయకౌముది చెబుతుంది. పీడించినా హింసించినా బంధించినా సంహరించినా ఆ పాపం సర్పదోషం రూపంలో మనల్ని పీడిస్తుంది. వంశ క్షయానికి సర్పదోషమే ముఖ్య కారణం. అంతేకాదు.. గురువులు, ముసలివాళ్ళు, పిల్లలు, స్త్రీలు, గోవులు పశు పక్షులు, పిల్లుల పట్ల మనం చేసే అపరాధం కూడా ఈ దోషం రూపంలో పీడిస్తుంది. అంటే ధర్మహీనమైన హింసా ప్రవృత్తితో ఇతర జీవములపై మనం చేసే సమస్తకర్మలు సర్పశాప స్థితి ద్వారా అమలవుతాయన్నమాట. కర్త అనగా చేసినవాడు, కారయితా అనగా కారణం అయినవాడు, ప్రేరకః అనగా ప్రేరేపించినవాడు అనుమోదకః అనగా ఆమోదించినవాడు ఈ నలుగురు పాపం అయినా పుణ్యం అయినా సమానంగా అనుభవిస్తారట. నాగదోష ఫలితాలు ..! ...సంతానహీనతకు, గర్భశోకానికి, గుణ - రూప హీనులైన సంతానానికి, భర్తహీనతకి, సంసార దుఖానికి, ఈ నాగదోషమే కారణం. రోగాలకి అశాంతికి అభద్రతకి చంచలమైన - స్థిరత్వం లేని జీవితానికి కూడా ఈ దోషమే కారణం. వివాహం కాకపోవడం, దంపతులు త్వరగా విడిపోవడం బాల వైధవ్యం దాంపత్యంలో కలహాలు అన్యోన్యత లేకపోవడం కూడా నాగదోషమే. ఒక్కమాటలో చెప్పాలి అంటే జాతకంలో ఉండే అన్ని దోషాలకన్నా ప్రధానమైనదీ ప్రమాదమైనదీ కూడా ఈ ‘కాలసర్పదోషమే’ ఈ దోషం ఉన్న జాతకుల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. వీరి మిత్రులు, సహచరులు వీరికన్నా తక్కువ స్థాయి వారూ వీరిని దాటి ముందుకు వెళ్తారు కానీ వీరు మాత్రం ప్రతిభా పాటవాలు ఉన్నా అక్కడే ఉండిపోతారు. ‘కాళహస్తిలో ’ పూజ చేయిస్తే సరిపోతుందా..? అందరూ ఇలాగే అనుకోని తప్పుచేస్తుంటారు. ఉదాహరణకు: గుండె జబ్బుతో బాధపడే వ్యక్తికి చికిత్స నిమిత్తం ఒక మాత్ర ఇస్తే సరిపోదు. బైపాస్ చేయించడమే తగు చికిత్స. అలాగే ఈ దోషానికి కూడా ’కాలసర్ప శాంతి’ అనే పూర్తి ప్రక్రియను చేయడమే అసలైన మార్గం. అలా శాంతి చేయించిన తరువాత కాళహస్తి వెళ్లి అక్కడ రాహు - కేతు పూజ చేయించడంతో సమాప్తం అవుతుంది. దోషం పోవావాలంటే సశాస్త్రీయంగా శాంతి విధానం చేసుకోవాలి. ఇది 3 రోజులు లేదా 1 రోజు గానీ చేసుకోవచ్చు. గణపతి పూజ - పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం రాహువు 18 వేలు జపం, కేతువు 7 వేలు జపం, నక్షత్ర జపం, సర్ప మూల మంత్రం, లక్ష్మి గణపతి మూల మంత్ర జపం చేసి వాటికి దశామ్షంలో గో క్షీర తర్పణం చేయాలి. సప్తశతీ పారాయణం, సర్పసూక్త పారాయణం చేయాలి. మండపారాధనలో నవగ్రహ ఆరాధన, నవ నాగదేవతా ఆరాధన, మాసాదేవి ఇష్టదేవతా కులదేవతా రుద్ర ప్రధాన కలశాల స్థాపన చేసి వేదోక్తంగా పూజించాలి. రాహువుకి గరిక, మినుములతో; కేతువుకి దర్భ, ఉలవలతో హోమం చేసి ఆవాహిత దేవతలకి ఆవు నేయితో హవిస్సు ఇవ్వాలి. పూర్ణాహుతి చేసాక మండపం ఉద్వాసన చేసి మినుములు కిలో ఉలవలు కిలో, సర్ప ప్రతిమలు 2 కలిపి దక్షిణతో దానం చేసి, ఆయా కలశాల జలంతో కర్తకి (ఎవరికోసం చేసుకుంటున్నారో వారు ) మంత్రయుక్తంగా స్నానం చేయించాలి. కుదిరితే పూజలో పాల్గొన్న బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇక్కడితో శాంతి ప్రక్రియ పూర్తి అయినట్లే!మరి తమ పుట్టిన తేదీ తదితర జాతక వివరాలు తెలియనివారు తమకు కాలసర్పదోషం ఉన్నదో లేదో అనేది ఎలా తెలుసుకోగలరు అనే సందేహం రాకమానదు. అయితే అలాంటివారు తమ జీవితంలో జరిగిన, జరుగుతున్న ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అది కాలసర్ప దోషమో కాదో నిర్ధారణ చేయవచ్చు. - మద్దికుంట శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం నిర్వాహకులు