కాలసర్ప దోషమా?
జాతకంలో దోషాలు ఉండడం సహజమే. అదేవిధంగా ప్రతి దోషానికి మన ఋషులు నివారణ ఉపాయాలు కూడా అదే రీతిలో చెప్పారు.
అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి?
కాలసర్పదోషం జాతకంలో రాహు కేతువుల వలన ఏర్పడుతుంది. జాతకంలో 7 గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండిపోవడమే కాలసర్పదోషం అని తేలికగా గుర్తుపట్టవచ్చు. ఈ దోషం వలన వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే ...!
జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా వాటిని కాల సర్పదోషం మింగేయడమే. వివాహం, సంతానం, దాంపత్యంలో అన్యోన్యత, వృత్తి / ఉద్యోగంలో ఉన్నతి మొదలైన వాటికి ప్రధాన అవరోధంగా మారుతుంది.
కాలసర్పదోషం ఎందుకు వస్తుంది?
ఈదోషం వంశపారంపర్యంగా లేదా ఒక్కరికైనా గానీ రావొచ్చు. చాలామంది అనుకునేది ఏంటి అంటే సర్పాలను చంపడం వలననే ఈ దోషం వస్తుందేమో అని. కొంత నిజమే అయినా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సర్పాలను తెలిసిగానీ తెలియకగానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా సంహరించడం చేసినా దోషం వదలదు అని నిర్ణయకౌముది చెబుతుంది. పీడించినా హింసించినా బంధించినా సంహరించినా ఆ పాపం సర్పదోషం రూపంలో మనల్ని పీడిస్తుంది.
వంశ క్షయానికి సర్పదోషమే ముఖ్య కారణం. అంతేకాదు.. గురువులు, ముసలివాళ్ళు, పిల్లలు, స్త్రీలు, గోవులు పశు పక్షులు, పిల్లుల పట్ల మనం చేసే అపరాధం కూడా ఈ దోషం రూపంలో పీడిస్తుంది. అంటే ధర్మహీనమైన హింసా ప్రవృత్తితో ఇతర జీవములపై మనం చేసే సమస్తకర్మలు సర్పశాప స్థితి ద్వారా అమలవుతాయన్నమాట. కర్త అనగా చేసినవాడు, కారయితా అనగా కారణం అయినవాడు, ప్రేరకః అనగా ప్రేరేపించినవాడు అనుమోదకః అనగా ఆమోదించినవాడు ఈ నలుగురు పాపం అయినా పుణ్యం అయినా సమానంగా అనుభవిస్తారట.
నాగదోష ఫలితాలు ..!
...సంతానహీనతకు, గర్భశోకానికి, గుణ - రూప హీనులైన సంతానానికి, భర్తహీనతకి, సంసార దుఖానికి, ఈ నాగదోషమే కారణం. రోగాలకి అశాంతికి అభద్రతకి చంచలమైన - స్థిరత్వం లేని జీవితానికి కూడా ఈ దోషమే కారణం. వివాహం కాకపోవడం, దంపతులు త్వరగా విడిపోవడం బాల వైధవ్యం దాంపత్యంలో కలహాలు అన్యోన్యత లేకపోవడం కూడా నాగదోషమే. ఒక్కమాటలో చెప్పాలి అంటే జాతకంలో ఉండే అన్ని దోషాలకన్నా ప్రధానమైనదీ ప్రమాదమైనదీ కూడా ఈ ‘కాలసర్పదోషమే’ ఈ దోషం ఉన్న జాతకుల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. వీరి మిత్రులు, సహచరులు వీరికన్నా తక్కువ స్థాయి వారూ వీరిని దాటి ముందుకు వెళ్తారు కానీ వీరు మాత్రం ప్రతిభా పాటవాలు ఉన్నా అక్కడే ఉండిపోతారు.
‘కాళహస్తిలో ’ పూజ చేయిస్తే సరిపోతుందా..? అందరూ ఇలాగే అనుకోని తప్పుచేస్తుంటారు.
ఉదాహరణకు: గుండె జబ్బుతో బాధపడే వ్యక్తికి చికిత్స నిమిత్తం ఒక మాత్ర ఇస్తే సరిపోదు. బైపాస్ చేయించడమే తగు చికిత్స. అలాగే ఈ దోషానికి కూడా ’కాలసర్ప శాంతి’ అనే పూర్తి ప్రక్రియను చేయడమే అసలైన మార్గం. అలా శాంతి చేయించిన తరువాత కాళహస్తి వెళ్లి అక్కడ రాహు - కేతు పూజ చేయించడంతో సమాప్తం అవుతుంది.
దోషం పోవావాలంటే సశాస్త్రీయంగా శాంతి విధానం చేసుకోవాలి. ఇది 3 రోజులు లేదా 1 రోజు గానీ చేసుకోవచ్చు. గణపతి పూజ - పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం
రాహువు 18 వేలు జపం, కేతువు 7 వేలు జపం, నక్షత్ర జపం, సర్ప మూల మంత్రం, లక్ష్మి గణపతి మూల మంత్ర జపం చేసి వాటికి దశామ్షంలో గో క్షీర తర్పణం చేయాలి. సప్తశతీ పారాయణం, సర్పసూక్త పారాయణం చేయాలి. మండపారాధనలో నవగ్రహ ఆరాధన, నవ నాగదేవతా ఆరాధన, మాసాదేవి ఇష్టదేవతా కులదేవతా రుద్ర ప్రధాన కలశాల స్థాపన చేసి వేదోక్తంగా పూజించాలి. రాహువుకి గరిక, మినుములతో; కేతువుకి దర్భ, ఉలవలతో హోమం చేసి ఆవాహిత దేవతలకి ఆవు నేయితో హవిస్సు ఇవ్వాలి. పూర్ణాహుతి చేసాక మండపం ఉద్వాసన చేసి మినుములు కిలో ఉలవలు కిలో, సర్ప ప్రతిమలు 2 కలిపి దక్షిణతో దానం చేసి, ఆయా కలశాల జలంతో కర్తకి (ఎవరికోసం చేసుకుంటున్నారో వారు ) మంత్రయుక్తంగా స్నానం చేయించాలి.
కుదిరితే పూజలో పాల్గొన్న బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇక్కడితో శాంతి ప్రక్రియ పూర్తి అయినట్లే!మరి తమ పుట్టిన తేదీ తదితర జాతక వివరాలు తెలియనివారు తమకు కాలసర్పదోషం ఉన్నదో లేదో అనేది ఎలా తెలుసుకోగలరు అనే సందేహం రాకమానదు. అయితే అలాంటివారు తమ జీవితంలో జరిగిన, జరుగుతున్న ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అది కాలసర్ప దోషమో కాదో నిర్ధారణ చేయవచ్చు. - మద్దికుంట శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం నిర్వాహకులు