
లైట్‌తో లాగేస్తుంది!
మీరు రోడ్డుపై నడుస్తూ వెళుతున్నారు.. ఒక్కసారిగా మీపై విచిత్రమైన కాంతి పడింది.. అది అయస్కాంతంలా మిమ్మల్ని లాగేసుకుంది..
వాషింగ్టన్: మీరు రోడ్డుపై నడుస్తూ వెళుతున్నారు.. ఒక్కసారిగా మీపై విచిత్రమైన కాంతి పడింది.. అది అయస్కాంతంలా మిమ్మల్ని లాగేసుకుంది.. మీరు గాల్లోనే తేలిపోతూ ఆ కాంతి వచ్చినవైపు వెళ్లిపోయారు. ఇదేదో ఫిక్షన్ సినిమాలో దృశ్యంలా ఉంది కదా..! ఇలా కాంతి, విద్యుదయస్కాంత శక్తితో వస్తువులను లాగేసుకునే ‘ట్రాక్టర్ బీమ్ (ఆవేశిత విద్యుదయస్కాంత వికిరణం)’ పరికరాన్ని తయారు చేసేందుకు నాసా ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే గాల్లో తేలే స్కేట్‌బోర్డు ‘హెండో హోవర్‌బోర్డు’ను తయారుచేసిన ఆర్క్స్ పాక్స్ అనే సంస్థతో నాసా చేతులు కలిపింది. ‘ట్రాక్టర్ బీమ్’ను రూపొందించి అంతరిక్షంలోకి పంపాలని.. భూమి చుట్టూ తిరుగుతున్న చిన్న చిన్న శాటిలైట్లను ఒక్కచోటికి చేర్చి, పనితీరును మెరుగుపర్చాలని నాసా భావిస్తోంది. దాంతోపాటు శాటిలైట్లవైపు దూసుకువచ్చే చిన్న చిన్న గ్రహశకలాలను దారిమళ్లించడమో, ధ్వంసం చేయడమో చేయవచ్చని చెబుతోంది.