ఉత్తరం దక్షిణం.. ఉల్టా పల్టా!
భూమి ఓ పెద్ద బంతిలాంటి అయస్కాంతం.
చుట్టూ రక్షణకవచంలా
వేల మైళ్లకొద్దీ అయస్కాంత క్షేత్రం ఉంది.
కానీ ఇప్పుడా క్షేత్రం బలహీనమవుతోంది.
తలకిందులుగా తిరగబడేందుకు సిద్ధమవుతోంది!
మరి ఉత్తర, దక్షిణాలు ఉల్టాపల్టా అయితే... ఏమవుతుంది?
ఎందుకు? ఏమిటి? ఎలా!?
మన సౌరకుటుంబంలో ఒక్క భూమిపై మాత్రమే జీవుల మనుగడకు తోడ్పడే వాతావరణం ఎందుకు ఉందో తెలుసా? భూమి అంతర్భాగం నుంచి చుట్టూ వేల మైళ్ల వరకూ బలమైన అయస్కాంత క్షేత్రం ఆవరించి ఉండటం వల్లే. ఆ అయస్కాంత క్షేత్రమే లేకపోతే అసలు భూమిపై ఓజోన్ పొర, ఇప్పుడున్న వాతావరణమే ఉండేవి కావు. సూర్యుడి నుంచి దూసుకొచ్చే సౌరగాలులు, ప్లాస్మాకణాలు, అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ రేడియేషన్ ఓజోన్ పొరను తూట్లు పొడిచేవి. వాతావరణాన్ని దాదాపుగా ఊడ్చుకుపోయేవి! ఫలితంగా అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్ తాకిడికి భూమి కూడా ఇతర గ్రహాల్లా వట్టి మట్టిముద్దగా మిగిలిపోయేది!! అయితే భూమికి ఇంత ముఖ్య రక్షణకవచమైన అయస్కాంత క్షేత్రం గత ఆరు నెలలుగా ఓ పక్క బలహీనం అవుతోంది. అదేసమయంలో మరోపక్క బలోపేతం అవుతోంది. భూ అయస్కాంత క్షేత్రానికి అసలు ఏం జరుగుతోంది? అది బలహీనం అయితే ముప్పు ఏర్పడుతుందా? మున్ముందు ఏం జరగబోతోంది? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికర సంగతులు ఇవీ..
గుట్టువిప్పిన ఉపగ్రహాలు...
భూమికి భౌగోళికంగా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉన్నట్టే.. అయస్కాంత క్షేత్రానికి కూడా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయి. ప్రస్తుతం అయస్కాంత ధ్రువాలు భౌగోళిక ధ్రువాలకు దగ్గరగానే ఉన్నాయి. అయితే.. పశ్చిమార్ధగోళంపై అయస్కాంత క్షేత్రం గత ఆరు నెలలుగా క్రమంగా బలహీనం అవుతోందని, అదేసమయంలో దక్షిణ హిందూ మహాసముద్రం వైపు బలోపేతం అవుతోందని ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన మూడు ‘స్వార్మ్’ ఉపగ్రహాల పరిశీలనలో తేలింది. స్వార్మ్ ఉపగ్రహాల సమాచారాన్ని నిశితంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఇది 2, 3 లక్షల ఏళ్లకు ఓసారి జరిగే సహజ ప్రక్రియలో భాగంగానే జరుగుతోందని గుర్తించారు. ఇప్పుడు మరోసారి భూమి అయస్కాంత క్షేత్రం తారుమారు అయ్యే సమయం వచ్చేసిందని, 2, 3 వందల ఏళ్లలో దాని ఉత్తర ధ్రువం దక్షిణానికు, దక్షిణ ధ్రువం ఉత్తరానికి మారిపోనున్నాయని, ఇప్పుడు కనిపిస్తున్నది ఆ ప్రక్రియకు ముందస్తు సంకేతమేనని వారు తేల్చారు.
ఎందుకీ తకరారు?
అయస్కాంత క్షేత్రం తలకిందులు ఎందుకవుతుందో తెలుసుకోవాలంటే ముందుగా అది ఎలా ఏర్పడుతోందో తెలుసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే... కడుపులో భారీ ఇనుప బంతి, దాని చుట్టూ ద్రవరూపంలో ఉన్న ఇనుము, నికెల్ లోహాల మిశ్రమం తిరగడం వ ల్ల భూమి అనేది ఒక ఎలక్ట్రిక్ డైనమో(విద్యుచ్చాలక యంత్రం)లా పనిచేస్తుంది. దాంతో భూమి చుట్టూ భారీ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం.. భూకేంద్రమైన ఇన్నర్ కోర్ భాగంలో ఘనరూపంలోని ఇనుము 10,300 డిగ్రీ ఫారిన్‌హీట్‌ల వరకూ ఉంటుందట. దాని చుట్టూ ఇనుము, నికెల్, ఇతర లోహాలు ద్రవరూపంలో ఉండే ఔటర్ కోర్ పొర ఉంటుంది.
ఈ రెండు పొరల మధ్య ఉష్ణోగ్రతలు, పీడనం, సంఘటనం వంటివాటి ఆధారంగా ఉష్ణప్రసరణం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోహాల ప్రవాహం ఎలక్ట్రిక్ కరెంట్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా అవి అయస్కాంత క్షేత్రాలుగా మారతాయి. ఈ లోపలి చిన్నచిన్న అయస్కాంత క్షేత్రాలన్నీ కలిసి భూమి చుట్టూ ఓ పెద్ద అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. అయితే కోర్ ఉష్ణోగ్రతల్లో మార్పులు, భూ భ్రమణాన్ని బట్టి ద్రవలోహాలు తిరుగుతాయి. ఈ ద్రవలోహాల ప్రవాహం, వేడి తగ్గినచోట అయస్కాంత క్షేత్రం ఉపరితలంలో బలహీనం అవుతుందన్నమాట. ఉదాహరణకు.. అమెరికాపై అయస్కాంత క్షేత్రం బలహీనం అవడం అంటే.. అమెరికా కింద ఔటర్ కోర్‌లో ప్రవాహం మందగించింద ని అర్థం చేసుకోవచ్చు.
వేల ఏళ్ల నుంచి వందల ఏళ్లకు...
భౌగోళిక ధ్రువాల మాదిరిగా అయస్కాంత ధ్రువాలు స్థిరంగా ఉండవు. నిరంతరం కదులుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉత్తర అయస్కాంత ధ్రువం సైబీరియా (రష్యా) వైపుగా సంవత్సరానికి 25 మైళ్ల చొప్పున కదులుతోందట. అయితే అయస్కాంత ధ్రువాలు 2, 3 లక్షల ఏళ్లకు ఓసారి తిరగబడతాయని, ఆ తిరగబడే ప్రక్రియ 2 వేల ఏళ్లపాటు జరుగుతుందని ఇంతవరకూ భావించేవారు. అయస్కాంత క్షేత్రం బలహీనం అయ్యే ప్రక్రియ వందేళ్లకు ఐదు శాతం జరుగుతుందనీ అనుకునేవారు. కానీ స్వార్మ్ ఉపగ్రహాల సమాచారంపై అధ్యయనం తర్వాత.. దశాబ్దానికే ఐదు శాతం ప్రక్రియ జరుగుతోందని అంచనా వేశారు. దీంతో రెండు, మూడు వందల ఏళ్లలోనే అయస్కాంత ధ్రువాలు మారతాయని భావిస్తున్నారు.
అరుదైనదే కానీ.. హానికరం కాదు..
భూమి అయస్కాంత క్షేత్రం ఓ పక్క బలహీనం అయినా.. వాతావరణాన్ని సౌరగాలులు, రేడియేషన్ తూట్లు పొడిచేంతగా క్షీణించిపోదట. అయస్కాంత క్షేత్రం బలహీనమైనా.. లేదా తారుమారు అయినా.. కాస్మిక్ రేడియేషన్‌ను అది అడ్డుకోవడాన్ని ఆపదని, అదువల్ల భూగోళానికి ఏ హానీ ఉండదని, అన్నీ సక్రమంగానే జరుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి చుట్టూ అయస్కాంతక్షేత్రం పూర్తిగా మాయమవ్వదని, కాస్త బలహీనం మాత్ర మే అవుతుందని వారు భరోసా ఇస్తున్నారు.
- హన్మిరెడ్డి యెద్దుల
పుడమికి అసలైనరక్షణ కవచం
అంతరిక్షంలో సెకనుకు 200 నుంచి 1000 కి.మీ. వేగంతో దూసుకొచ్చే సౌరగాలులు, విద్యుదావేశ ప్లాస్మా కణాల ధాటికి సాధారణంగా అయితే భూమి వాతావరణం తుడిచిపెట్టుకుపోవాలి. కానీ.. వాటిని అడ్డుకుని దారి మళ్లించడం ద్వారా భూగోళాన్ని అయస్కాంత క్షేత్రం నిరంతరం రక్షిస్తోంది. భూమి చుట్టూ అదృశ్యరూపంలో గాలిబుడగలా ఉన్న ఈ అయస్కాంత క్షేత్రం సూర్యుడి వైపుగా సుమారు 63 వేల కి.మీ.లు, వెనక వైపుగా 12 లక్షల కి.మీ. వరకూ భూమిని ఆవరించి ఉంటుంది. అయితే సౌరగాలుల ఒత్తిడిని బట్టి ఇది ఒక్కోచోట ఎక్కువ, ఒక్కోచోట తక్కువ సైజులోకి మారుతుంటుంది.