అంతరిక్షం..10000 కోట్లు | Spacecraft experiment for one week with 10000 crores | Sakshi
Sakshi News home page

అంతరిక్షం..10000 కోట్లు

Published Sun, Dec 30 2018 2:32 AM | Last Updated on Sun, Dec 30 2018 2:33 AM

Spacecraft experiment for one week with 10000 crores - Sakshi

పది వేల కోట్ల రూపాయలు.. ముగ్గురు వ్యోమగాములు..వారం రోజుల అంతరిక్ష ప్రయోగం.. 2022 కల్లా కల సాకారం దిశగా అడుగులు... విజయం సాధిస్తే భారత్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి... అంతరిక్షాన్ని అందుకున్న అమెరికా, రష్యా, చైనాల సరసన సగర్వంగా నిలిచే అవకాశం..అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ రంగంలో ఉపాధి కల్పనకు ఊతం.. ఇదీ ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టు ప్రణాళిక. స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షయానం కోసం ఇస్రో భుజానికెత్తుకున్న ఈ బృహత్తర ప్రాజెక్టు విశేషాలు స్థూలంగా.. 

2004 లోనే గగన్‌యాన్‌కు శ్రీకారం..
అంతరిక్షంలోకి మనుషులను పంపించాలన్న ఆలోచనకు సూత్రప్రాయ అంగీకారం తెలపడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్లానింగ్‌ కమిటీ 2004లో గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రయోగం ఎప్పుడు? ఎలా? అనే అంశాలపై మాత్రం స్పష్టత లేకపోయింది. 2015కల్లా ప్రయోగం చేపట్టాలన్నది తొలినాళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యం. రెండేళ్ల క్రితం కూడా మానవసహిత అంతరిక్ష ప్రయోగ ప్రణాళిక ఏదీ లేదని ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే అంటూ వచ్చిన ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం ద్వారా శుక్రవారమే గగన్‌యాన్‌ను ధ్రువీకరించింది. 

సంక్లిష్టమైన ప్రయోగం... 
ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో రాకెట్లను, వాటి ద్వారా మరెన్నో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినా మానవసహిత అంతరిక్ష ప్రయోగం వాటన్నింటికంటే భిన్నమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రయాన్, మంగళ్‌యాన్‌లతో పోల్చినా గగన్‌యాన్‌ చాలా సంక్లిష్టమైన, భారీ ప్రయోగమనే చెప్పాలి. మళ్లీమళ్లీ వాడుకోగల రాకెట్‌ను తయారు చేయడం ఒక ఎత్తైతే.. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు అనువైన మాడ్యూల్‌ను తయారు చేయడం ఇంకో ఎత్తు. 

వ్యోమగాములు తినేదేమిటి? 
ఒక్కమాటలో చెప్పాలంటే మెనూ ఇంకా రెడీ కాలేదు. కాకపోతే మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ఈ మెనూపై ఏళ్లుగా పనిచేస్తోంది. దక్షిణాది వ్యోమగాములైతే మనవాళ్ల ఫేవరెట్‌ ఆహారం పులిహోర లేదంటే దోసలు. ఉత్తరాది వారికి చపాతీ ముక్కలు, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కొన్నేళ్ల క్రితమే సీఎఫ్‌టీఆర్‌ఐ ఉన్నతాధికారులు ప్రకటించారు. వీలైనంత వరకూ భారతీయులు ఇష్టపడే మసాలా నిండిన వెజ్, నాన్‌వెజ్‌ ఆహారాన్ని గిన్నెల్లోనే ప్యాక్‌ చేసి ఇస్తామని, కాకపోతే వ్యోమగాములు ఈ ఆహారాన్ని గొట్టాల ద్వారా పీల్చుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారరహిత స్థితిలో నీళ్లుతాగడమైనా, ఆహారం తీసుకోవడమైనా చాల ఇబ్బందితో కూడుకున్న విషయమన్నది తెలిసిందే. వాటితోపాటు ఫ్రూట్‌బార్‌లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గ్రనోలా బార్‌లు కూడా వ్యోమగాములకు ఇస్తామని సీఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్‌ చెప్పారు. 

ప్రాజెక్టు డైరెక్టర్‌గా మహిళా శాస్త్రవేత్త... 
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్‌ వి.ఆర్‌. లలితాంబిక. ఉపగ్రహ ప్రయోగాల్లో 30 ఏళ్ల అనుభవమున్న ఈ శాస్త్రవేత్త గతేడాది ఒకే రాకెట్‌ ద్వారా 104 రాకెట్ల ప్రయోగంలోనూ కీలకపాత్ర పోషించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తన తాత స్ఫూర్తితో ఇస్రోలో చేరానని, తిరువనంతపురంలో ఇస్రో తొలి సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని పసిపిల్లగా చూసిన తాను సైన్స్‌పట్ల ఆసక్తి పెంచుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు లలితాంబిక చెబుతారు. పది వేల కోట్ల రూపాయలు పోసి అంతరిక్షంలోకి మనుషులను పంపడం అవసరమా? అని ప్రశ్నిస్తే కచ్చితంగా అవసరమేనని.. అంతరిక్ష ప్రయోగాలను శాంతియుత, సామాజిక ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత్‌ ఉద్దేశాలకు తగ్గట్లుగానే ఇది కూడా ఉంటుందని ఆమె వివరించారు.

జీఎస్‌ఎల్వీనే ఎందుకంటే? 
ఇస్రో అత్యంత విజయవంతంగా ప్రయోగించిన రాకెట్లలో ముందు వరసలో నిలిచేది పీఎస్‌ఎల్వీనే. అయితే వాటి సామర్థ్యం తక్కువ. అంటే ఇవి మోసుకెళ్లగల బరువు గరిష్టంగా రెండు టన్నులు మాత్రమే. భూ ఉపరితలం నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఇవి తిరగ్గలవు. ఈ కారణం వల్లే గగన్‌యాన్‌లో జీఎస్‌ఎల్వీని ఉపయోగిస్తున్నారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 విషయాన్నే తీసుకుంటే దీని ద్వారా ఐదు నుంచి ఆరు టన్నుల బరువును అంతరిక్షంలోకి చేర్చవచ్చు. ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లే రాకెట్, అంతరిక్షంలో వారం రోజులు గడిపేందుకు ఉపయోగించే మాడ్యూల్‌ల బరువు 7.8 టన్నులు ఉంటుందని అంచనా. క్రయోజెనిక్‌ ఇంజిన్లతో కూడిన జీఎస్‌ఎల్వీని తొలిసారి 2014 డిసెంబర్‌లో విజయవంతంగా ప్రయోగించగా మూడో ప్రయోగం ఈ నెలలోనే పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గగన్‌యాన్‌ కూడా సక్సెస్‌ అవుతుందనే అంచనా. 

పూర్తయినవి ఇవీ..
గగన్‌యాన్‌ కోసం ఇస్రో ఇప్పటికే బోలెడన్ని టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. 2014లో జీఎస్‌ఎల్వీ ప్రయోగం సందర్భంగా ఇస్రో వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మాడ్యూల్‌ అట్మాస్ఫరిక్‌ రీ ఎంట్రీ ఎక్స్‌పరిమెంట్‌ (కేర్‌) భూమికి 126 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి తిరిగి వచ్చింది. అండమాన్‌ నికోబార్‌ ద్వీపాల సమీపంలో సముద్రంలో పడిపోయిన ఈ మాడ్యూల్‌ను కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రికవర్‌ చేయగలిగారు. దీన్నే 2022లో జరిగే గగన్‌యాన్‌లోనూ వాడతారని అంచనా. రాకెట్‌ ప్రయోగం సందర్భంగా అనుకోని అవాంతరం ఏర్పడితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు కూడా ఇస్రో ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో క్రూ మాడ్యూల్‌ను సురక్షిత దూరానికి తీసుకెళ్లడం.. కొంత సమయం తరువాత పారాచూట్ల సాయంతో ల్యాండ్‌ కావడం దీని ప్రత్యేకత. ఈ ఏడాది జూలైలో ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. క్రూ మాడ్యూల్‌ లోపల భూమిని పోలిన వాతావరణం ఉండేలా చూసేందుకు ఇస్రో సిద్ధం చేసిన వ్యవస్థ డిజైనింగ్‌ ఇప్పటికే పూర్తికాగా త్వరలో పరీక్షించనున్నారు. వ్యోమగాముల శిక్షణ కోసం బెంగళూరులో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో ఆలోచించినా ఇప్పటివరకూ ఈ దిశగా జరిగింది కొంతే. 
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement