పీఎస్‌ఎల్‌వీ సీ–37 ప్రయోగ సమయం మార్పు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ సీ– 37 రాకెట్ ప్రయోగ సమయం నాలుగు నిమిషాలు ముందుకు మారింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ– 37 ద్వారా 104 ఉపగ్రహాల ప్రయోగాన్ని ఈ నెల 15న ఉదయం 9.32 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు దీనిని ఉదయం 9.28 గంటలకు మార్చారు. 14వ తేదీ వేకువజామున 5.48 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
షార్‌లోని క్లీన్‌రూంలో శాస్త్రవేత్తలు ఉపగ్రహాలకు పరీక్షలు నిర్వహించి ఈ నెల 9న ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చే ప్రక్రియ చేపట్టనున్నారు. 10, 11వ తేదీల్లో రాకెట్ తుది విడత తనిఖీలు నిర్వహించి, 12న తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్) ఏర్పాటు చేసి, ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.