ఇస్రో తదుపరి లక్ష్యం.. సూర్యుడు! | ISRO next target is the Sun | Sakshi
Sakshi News home page

ఇస్రో తదుపరి లక్ష్యం.. సూర్యుడు!

Published Sun, Aug 11 2019 3:55 AM | Last Updated on Sun, Aug 11 2019 11:20 AM

ISRO next target is the Sun - Sakshi

ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం ఇదే. (ఉపగ్రహం సూర్యుడి కక్ష్యలో పరిభ్రమించే ఊహాచిత్రం)

సూళ్లూరుపేట: భారత, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు (ఇస్రో, నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాదే దీనిపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఇటీవలే సూర్యుడిపై పరిశోధనలకు సోలార్‌ ప్రోబ్‌ అనే ప్రయోగాన్ని చేపట్టింది. దీని తర్వాత ఇస్రో–నాసా కలిసి మరో ప్రయోగాన్ని చేపట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి.

శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ–ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హ్యూమన్‌ స్పేస్‌ ప్రోగ్రాం ముందుగానే ప్రయోగించే అవకాశముంటుందని గతంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఉపగ్రహంలో యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్‌ అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్‌) అమర్చి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు–1 (ఎల్‌–1)లోకి చేరవేస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకుల్లేకుండా సూర్యుడిని నిత్యం పరిశీలించడం వీలవుతుందని అంచనా వేస్తున్నారు. 

కరోనాలో వేడి పెరుగుదలకు గల కారణాలపై పరిశోధనలు 
సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల కెల్విన్స్‌ ఉంటుంది. సూర్యుడి అంతర్భాగంలో ఆరు వేల కెల్విన్స్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్‌1తో పరిశోధనలు చేస్తారు. సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై కూడా పరిశోధనలు చేయడానికి ఇస్రో–నాసాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సౌర తుఫాన్‌ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని కూడా అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్‌), వర్ణ మండలం (క్రోమోస్పియర్‌)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు.
సౌరగోళాన్ని పరిశోధించేందుకు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహంలో అమర్చబోయే ఆరు పరికరాలు. (ఊహాచిత్రం)  

బెంగళూరులోని ఉపగ్రహాల తయారీకేంద్రంలో ఈ ఉపగ్రహాన్ని తయారుచేసేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అన్నీ సమకూరితే 2020 ఆఖరులోపు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని మీడియా సమావేశాల్లో పలుమార్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్‌–1, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్‌యాన్‌–1లను అత్యంత తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి విజయం సాధించారు. తాజాగా చంద్రయాన్‌–2 మిషన్‌ను కూడా అత్యంత తక్కువ వ్యయంతో గత నెల 22న ప్రయోగించి మొదటిదశను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చంద్రయాన్‌–2 మిషన్‌ చంద్రుడి వైపునకు ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. మూడు గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో.. నాలుగో గ్రహాంతర ప్రయోగమైన ఆదిత్య–ఎల్‌1ను కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement