మరో చరిత్రకు సర్వం సిద్ధం | All to prepare for Another history | Sakshi
Sakshi News home page

మరో చరిత్రకు సర్వం సిద్ధం

Published Sun, Feb 12 2017 5:05 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

మరో చరిత్రకు సర్వం సిద్ధం

మరో చరిత్రకు సర్వం సిద్ధం

15న పీఎస్‌ఎల్‌వీ సీ37 ద్వారా 104 ఉపగ్రహాల ప్రయోగం

  • 14న ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం
  • నేడు ఎంఆర్‌ఆర్‌ సమావేశం

104 ఉపగ్రహాలివే..
పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా 1,478 కిలోల బరువైన 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. కార్టోశాట్‌ ఉపగ్రహం 714 కిలోల బరువు కాగా, మిగిలిన 103 ఉపగ్రహాల బరువు 664 కిలోలు మాత్రమే. ఇందులో 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌–2డీ ఉపగ్రహం, 8.4 కేజీల బరువున్న ఇస్రో నానోశాటిలైట్‌ (ఐఎన్‌ఎస్‌–1ఏ), 9.7 కిలోల బరువు కలిగిన ఇస్రో నానోశాటిలైట్‌ (ఐఎన్‌ఎస్‌–1బీ) అనే మూడు స్వదేశీ ఉపగ్రహాలను ప్రధానంగా పంపనున్నారు. అమెరికాకు చెందిన 631.8 కిలోల 88 డౌవ్‌ శాటిలైట్స్, 8 లీమూర్‌ శాటిలైట్స్‌తో కలిపి 96 చిన్న తరహా ఉపగ్రహాలను పంపనున్నారు.

నెదర్లాండ్‌కు చెందిన మూడు కేజీల పీయాస్‌–1, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 కేజీల బీజీయూశాట్, కజకిస్థాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్‌–ఫరాబీ–1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల నాయిప్‌–1 అనే విదేశీ ఉపగ్రహాలను పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 22 దేశాలకు చెందిన 76 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారానే పంపించి మన సత్తా ప్రపంచానికి చాటారు.  ప్రస్తుతం 101 ఉపగ్రహాల ప్రయోగం పూర్తయితే మొత్తం 177 ఉపగ్రహాలు వాణిజ్యపరంగా పూర్తి చేసినట్లవుతుంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించనుండడంతో దేశంలోని మేధావులే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇస్రో వైపే చూస్తోంది.

ప్రయోగమిలా..
పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపనున్న 104 ఉపగ్రహాలను భూమికి 505 కిలోమీటర్ల ఎత్తు నుంచి 525 కిలో మీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి తగలకుండా వివిధ రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేందుకు డిజైన్‌ చేశారు. 44.4 మీటర్ల పొడవు కలిగిన పీఎస్‌ఎల్‌వీ సీ37 ప్రయోగసమయంలో 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. 28.42 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసేలా రూపొందించారు. రాకెట్‌లోని మొదటిదశను 211.4 టన్నుల ఘన ఇంధనంతో కలిపి ప్రారంభిస్తారు. మొదటిదశలోని ఆరు స్ట్రాపాన్‌ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్‌అలోన్‌ దశలో 138.2 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను 110.88 సెకెన్లకు పూర్తి చేస్తారు.

అనంతరం 42 టన్నుల ద్రవ ఇంధనంతో రెండో దశను 262.92 సెకెన్లకు, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 492.22 సెకెన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1007.80 సెకెన్లకు నాలుగోదశను పూర్తి చేయనున్నారు. అనంతరం భూమికి 510.383 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలోకి ముందుగా 17.29 నిమిషాలకు 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌–2డీని ప్రవేశపెడతారు. తరువాత 17.39 నిమిషాలకు 510.590 కిలోమీటర్ల ఎత్తులో ఐఎన్‌ఎస్‌–1ఏ ఉపగ్రహాన్ని, 17.40 నిమిషాలకు 510.601 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడతారు. అనంతరం 18.32 నిమిషాలకు 511.719 కిలోమీటర్ల ఎత్తులో ఫస్ట్‌ ఫెయిర్‌ నానోశాటిలైట్స్‌ను, అనంతరం 28.42 నిమిషాలకు 524.075 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి లాస్ట్‌ ఫెయిర్‌ ఆఫ్‌ నానోశాటిలైట్స్‌ను వదిలి పని పూర్తి చేసేవిధంగా డిజైన్‌ చేసుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 39వ ప్రయోగం కాగా, ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్లలో ప్రయోగం విషయంలో 16వ ప్రయోగం కావడం విశేషం.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈనెల 15న ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. రాకెట్‌కు శిఖరభాగంలో 104 ఉపగ్రహాలను పొందికగా అమర్చి అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. శనివారం సాయంత్రం రాకెట్‌ శిఖర భాగంలో ఉపగ్రహాలను అత్యంత భద్రంగా అమర్చి హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేశారు. ఆదివారం లెవెల్‌–1, లెవెల్‌–2, లెవెల్‌–3 పరీక్షలు నిర్వహించి సాయంత్రం తుది విడత మిషన్‌ సంసిద్ధత (ఎంఆర్‌ఆర్‌) సమావేశాన్ని నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఎంఆర్‌ఆర్‌ సమావేశం ముగిసిన అనంతరం ప్రయోగాన్ని లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌)కు అప్పగించనున్నారు. సోమవారం ల్యాబ్‌ ఆధ్వర్యంలో మరోమారు తనిఖీలు నిర్వహించిన అనంతరం మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు.
– శ్రీహరికోట (సూళ్లూరుపేట)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement