* శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్వీ- సీ 23 ప్రయోగం
* 5 విదేశీ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశం
* ప్రత్యక్షంగా తిలకించిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగంలో భారత్ మరోమారు విజయబావుటా ఎగురవేసింది. ఐదు విదేశీ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని షార్ నుంచి తన పీఎస్‌ఎల్‌వీ సీ23 ద్వారా సోమవారం ఉదయం విజయవంతంగా ఒకేసారి గగనతలంలోకి పంపించింది. ఐదు ఉపగ్రహాలనూ భూమికి 659 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్య (సన్ సింక్రనస్ ఆర్బిట్)ల్లోకి ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావటంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంతోషం వెల్లివిరిసింది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో సోమవారం ఉదయం 9.52 గంటలకు కౌంట్‌డౌన్ ముగియగానే.. మొదటి వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ23 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రధాని, గవర్నర్, సీఎంలు ఆసక్తిగా తిలకిస్తుండగా.. శాస్త్రవేత్తలు ఉద్విగ్నంగా పరిశీలిస్తుండగా.. షార్‌లోని వివిధ భవనాలపై స్థానికులు ఆకాశంకేసి చూస్తుండగా.. పీఎస్‌ఎల్‌వీ దశలవారీగా విజయవంతంగా ప్రయాణిస్తూ ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. మొత్తం 19.55 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది.
44.5 మీటర్ల పొడవైన రాకెట్ ప్రయాణమంతా నిర్దేశిత మార్గంలోనే కొనసాగింది. రాకెట్‌లోని నాలుగు దశలు అద్భుతంగా పనిచేశాయి. మొదటి దశ ప్రయోగాన్ని 138 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 110.5 సెకన్లకు 52.7 కిలోమీటర్ల ఎత్తులో పూర్తిచేశారు. రెండో దశ 42 టన్నుల ద్రవ ఇంధన వినియోగంతో 261.1 సెకన్లకు 218.7 కిలోమీటర్లు ఎత్తులో పూర్తయింది. మూడో దశను 7.6 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 526.3 సెకన్లలో 536.8 కిలోమీటర్ల ఎత్తులో పూర్తిచేశారు. నాలుగోదశ 2.5 టన్నుల ద్రవ ఇంధన వినియోగంతో 1,033 సెకన్లలో 659.1 కిలోమీటర్ల ఎత్తులో దిగ్విజయంగా పూర్తయింది.
అనంతరం 1,070.1 సెకన్లకు 659.8 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో స్పాట్-07 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. 1,110 సెకన్లకు 660.6 కిలోమీటర్ల ఎత్తులో జర్మనీకి చెందిన ఏఐశాట్‌ను, 1,141.4 సెకన్లకు 661.2 కిలోమీటర్ల ఎత్తులో కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్ 7.1ని, 1,171.4 సెకన్లకు 661.8 కిలోమీటర్ల ఎత్తులో ఎన్‌ఎల్‌ఎస్ 7.2ని, 1,195.1 సెకన్లకు 662.3 కిలోమీటర్ల ఎత్తులో సింగపూర్‌కు చెందిన వెలాక్సీ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీంతో మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల వదనాల్లో విజయగర్వంతో కూడిన చిరునవ్వు తొణికిసలాడింది. ప్రధాని సమక్షంలో విజయవంతంగా నిర్వహించినందుకు శాస్త్రవేత్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. కక్ష్యలో చేరిన ఉపగ్రహాలు సక్రమంగానే ఉన్నట్లు మారిషస్ నుంచి సిగ్నల్స్ వచ్చాయని ఇస్రో ప్రకటించింది.
పీఎస్‌ఎల్‌వీ 27 ప్రయోగాలు.. 38 విదేశీ ఉపగ్రహాలు...
పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 27వ ప్రయోగం. ఇస్రో వాణిజ్యపరంగా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్-07 అతి ఎక్కువ బరువైనది కావడం విశేషం. దీని బరువు 714 కిలోలు. భూమిపై 60 - 60 కిలోమీటర్ల వ్యాసార్థంలో 10.5 మీటర్లు ఉన్న ఏ వస్తువునైనా హైరిజల్యూషన్ ఫొటోలు తీయటం దీనిప్రత్యేకత. సముద్రాల్లోని నౌకల సమాచారాన్ని అందించే జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి చేర్చింది. ఈ ఐదు ఉపగ్రహాలతో పాటు రాకెట్ గమనం, ఉపగ్రహాలను కక్ష్యలో వదిలిపెట్టే తీరును పరిశీలించేందుకు ఇస్రో రూపొందించిన 60 కిలోల అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్‌ఎస్) పేలోడ్‌ను కూడా ఇందులో ప్రయోగించారు.
ఇది ఉపగ్రహం కానప్పటికి రాకెట్ గమనాన్ని పరిశీలించిన తర్వాత కక్ష్యలో వదిలిపెడతారు. కానీ ఎలాంటి సేవలు అందించదు. పూర్తి వాణిజ్యపరమైన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు సుమారు 55 రోజుల పాటు శ్రమించారు. తాజా ప్రయోగ విజయంతో.. ఇప్పటివరకూ 19 దేశాలకు చెందిన 38 ఉపగ్రహాలను రోదసిలోకి పంపి వాణిజ్యపరంగా తిరుగులేని ఉపగ్రహ వాహకనౌకగా పీఎస్‌ఎల్‌వీ పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశీయంగా 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా మారింది.
శాస్త్రవేత్తలందరికీ రాష్ర్తపతి, మోడీ అభినందనలు...
పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగాన్ని మోడీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్, మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ తదితరులు మిషన్ కంట్రోల్ రూం నుంచి వీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్త బి.ఎన్.సురేష్ ప్రయోగానికి సంబంధించిన విశేషాలను వివరించారు. ప్రయోగం ప్రతి దశ విజయవంతంగా సాగడంతో అతిథులతో పాటు శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి శాస్త్రవేత్తను ప్రధాని మోడీ అభినందించారు. పీఎస్‌ఎల్‌వీ సీ-23 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ సీ-23 ప్రయోగం విజయవంతం పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఓ ప్రకటనలో హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
స్పాట్ -7
ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్-07 ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లోకెల్లా అతి ఎక్కువ బరువైనది(714 కిలోలు). భూమిపై 60 - 60 కి.మీ. వ్యాసార్థంలో 10.5 మీటర్లు ఉన్న ఏ వస్తువునైనా హైరిజల్యూషన్ ఫొటోలు తీయటం దీని ప్రత్యేకత. 659.8 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టారు.
ఏఐశాట్
సముద్రాల్లోని నౌకల సమాచారాన్ని అందించేందుకు జర్మనీకి చెందిన ఏఐశాట్‌ను ప్రయోగించారు. బరువు 15 కిలోలు. 660.6 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్రవేశపెట్టారు.
ఎన్‌ఎల్‌ఎస్ 7.1
కెనడాకు చెందినఎన్‌ఎస్‌ఎల్-7.1, ఎన్‌ఎస్‌ఎల్-7.2 ఉపగ్రహాలను రెండూ ఒకే రకమైన కచ్చి తత్వంతో, ఒకే రకమైన వేగంతో, ఒకే దిశలో ప్రయాణించేలా రూపొందించారు.
ఎన్‌ఎల్‌ఎస్ 7.2
30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1ను 661.2 కి.మీ. ఎత్తులోను, ఎన్‌ఎల్‌ఎస్ 7.2ని 661.8 కి.మీ. ఎత్తులోను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
వెలాక్సీ
సింగపూర్‌కు చెందిన ఈ ఉపగ్రహాన్ని తమ దేశీయ ఇమేజ్ సెన్సర్ల టెక్నాలజీని ప్రదర్శించేందుకు ప్రయోగించారు. 662.3 కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
పీఎస్ఎల్వీ మళ్లీ సక్సెస్..
Published Tue, Jul 1 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
Advertisement
Advertisement