
ప్రమాద ఘంటికలు..
భూమి వేడెక్కుతోంది, వాతావరణం విపరీత మార్పులకు లోనవుతోందని తరచూ వింటున్నాం. అంతేకాదు ఆ ప్రకృతి బీభత్సాన్ని అనుభవిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది డిసెంబర్‌లోనూ మాడు పగిలే ఎండలు ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే.. మరోవైపు వర్షాలు నగరాలను ముంచెత్తుతున్నాయి. ఇదే ఆ విపరీత మార్పుకు నిదర్శనం. అయితే ఈ పరిస్థితులు మన దగ్గరే ఉన్నాయా? లేక ప్రపంచమంతా ఇలాగే ఉందా? ముంచుకొస్తున్న ప్రమాదాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తున్నారు? అనే ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు.
వేసవి మంటల రికార్డుల మోత
వేసవి వచ్చిందంటే చాలు ఏడాదికేడాది కొత్త ఉష్ణోగ్రత రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ ఏడాది చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు సృష్టించింది. గతేడాది పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. గత 13 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు పదిసార్లు బద్దలైందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది భారత్‌లోనే దాదాపు 2,500 మంది వడగాడ్పులతో మృత్యువాత పడ్డారు. అంతర్జాతీయ వాతావరణ విభాగం అంచనాల ప్రకారం గత ఐదేళ్ల కాలంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కరిగిపోతున్న హిమనదాలు
ఉపగ్రహాల ద్వారా తీసిన ఛాయా చిత్రాల ప్రకారం.. మంచుఖండం ఆర్కిటిక్ ప్రాంతంలో మంచువిస్తీర్ణం ఏటికేటికీ తగ్గిపోతోంది. ఈ ప్రాంతంలో నౌకాయానం పెరగటం, ముడిచమురు నిక్షేపాల తవ్వకాలతో ఈ ప్రాంత పర్యావరణం ప్రమాదంలో పడింది. ఫలితంగా ధ్రువపు ఎలుగుబంట్లు, సీళ్ల వంటి సముద్రజీవుల మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. కెనడా, అలస్కా ప్రాంతాల్లో జరిపిన అధ్యయనాల ద్వారా అక్కడి దాదాపు 116 హిమనదాలు వేగంగా కరిగిపోతున్నట్లు స్పష్టమైంది. 1994 - 2013 మధ్యకాలంలో 7,500 టన్నుల మంచు కరిగిపోయిందని అంచనా.
సముద్రాల్లో వేడి
సముద్రాల్లో అరమైలు లోతు వరకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేల సంఖ్యలో ఏర్పాటుచేసిన తేలియాడే సెన్సర్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సముద్రపు జలాల ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడం పగడపు దిబ్బల (కోరల్ రీవ్స్)కు నష్టం కలిగిస్తాయి. సముద్రపు ఉపరితలంపై వీచే గాలుల ఉష్ణోగ్రతలు కూడా పెరగటంతో.. తీర ప్రాంతాల్లో ఆర్ద్రత (హ్యుమిడిటీ) పెరిగిపోతోంది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుంభవృష్టి కురుస్తోంది. వెచ్చటి ఉపరితల జలాలు తుపాన్లకు కారణమవుతున్నాయి.
సముద్ర మట్టం పెరుగుతోంది
సముద్ర మట్టం కూడా పెరుగుతున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతపు మంచు వేగంగా కరిగిపోవడం మొదలైతే ఇది మరింత ఎక్కువవుతుందని అంచనా. ఫలితంగా తీరప్రాంతాల్లోని మహానగరాల అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- సాక్షి, సెంట్రల్ డెస్క్
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు విస్తీర్ణం 17 లక్షల చదరపు కిలోమీటర్లు. పదేళ్లుగా అక్కడ కరిగిన మంచు 303 గిగా టన్నులు (30 వేల కోట్ల టన్నులు). ఇంత మంచు సముద్రంలోకి చేర్చిన నీరెంతో తెలుసా? ఆరు వందల కోట్ల మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో పట్టేంత! మరోపక్క.. అంటార్కిటికాలో గట్టకట్టుకుపోయిన మంచు ఒక్కసారిగా కరిగితే సముద్ర మట్టం 190 అడుగుల వరకూ పెరగుతుంది.