అంతరిక్షానికి పాకిన డంప్‌యార్డ్ పొగ
ముంబై: కాలుష్యం కోరలు చాస్తోందనే శీర్షికలు మనం అప్పుడప్పుడు పత్రికల్లో చదువుతూనే ఉంటాం. అయితే ముంబైలోని దేవనార్ ప్రాంతంలోగల డంప్‌యార్డ్.. తన కోరలను ఏకంగా అంతరిక్షం దాకా చాచింది. వినడానికి కొంత అతిశయోక్తిగానే అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. ఈ విషయాన్ని నాసా స్వయంగా ఫొటోలు తీసి మరీ తెలియజెప్పింది.
వివరాల్లోకెళ్తే... ముంబైలోని దేవనార్ ప్రాంతంలో దాదాపు 132 హెక్టార్లలో ఓ డంపింగ్ యార్డు ఉంది. ఇక్కడ నిత్యం నాలుగువేల టన్నుల చెత్త వచ్చిపడుతుంది. జనవరి 28న కొందరు ఈ డంపింగ్ యార్డుకు నిప్పుపెట్టారు. దీంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. కాలుష్యం స్థాయి గణనీయంగా పెరిగిపోయింది. అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా తయారైందంటే చుట్టుపక్కల పాఠశాలలను కూడా మూసివేయాల్సి వచ్చింది. దాదాపు 14 ఫైరింజన్లు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చాయి. అయినా ఇప్పటికీ అక్కడక్కడా మంటలు వస్తూనే ఉన్నాయి. ఈ డంప్‌యార్డ్ నుంచి వెలువడుతున్న పొగను అంతరిక్షం నుంచి నాసా ఫొటోలు తీసి పంపింది. ఉపగ్రహానికి చాలా దగ్గరిదాకా పొగ చేరినట్లు నాసా పంపిన ఫొటోల్లో స్పష్టంగా కనిపించింది.